పంటలు నష్టపోయిన రైతులకు బీమా రూల్స్ ప్రకారం పరిహారం చెల్లించాలి.
x

పంటలు నష్టపోయిన రైతులకు బీమా రూల్స్ ప్రకారం పరిహారం చెల్లించాలి.

2020 నుంచి దేశంలో పంటల బీమా పథకం లేని రాష్ట్రం తెలంగాణయే...కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి కూడా పంటల బీమా గురించి ఏమీ వినిపించడం లేదు...



తెలంగాణ రాష్ట్రంలో వరసగా కురుస్తున్న భారీ వర్షాలు, పొంగుతున్న నదులు,వాగులు, వంకలతో పోటెత్తుతున్న వరదలు గ్రామీణ ప్రాంతాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. లక్షలాది ఎకరాలలో పంటలు దెబ్బ తింటున్నాయి. వందల సంఖ్యలో పశువులు మరణిస్తున్నాయి. గ్రామీణ కుటుంబాల ఇళ్ళు కూడా కూలిపోతున్నాయి. లేదా దెబ్బ తింటున్నాయి. అనేక గ్రామాలలో, లంబాడీ తండాలలో ప్రజలు కట్టుబట్టలతో మిగిలారు.

ఈ సమయంలో ప్రభుత్వం వేగంగా కదిలి సహాయం అందించడం ఎంత ముఖ్యమో , మిగిలిన సమాజమూ అంతే బాధ్యతగా స్పందించాలి. బాధితులకు తోచిన పద్ధతిలో సహాయం అందించాలి.

ప్రకృతి విపత్తుల యాజమాన్య చట్టం 2005 ప్రకారం, ఒక జిల్లాలో జరిగే విపత్తుల పట్ల జిల్లా కలెక్టర్ అధ్యక్షతన ఉండే కమిటీ వేగంగా స్పందించి, చర్యలు చేపట్టాల్సి ఉంటుంది. నష్టపోయిన బాధితుల వివరాలను సేకరించాల్సి ఉంటుంది. సేకరించిన సమాచారాన్ని సహాయం అందించడానికి వీలుగా రాష్ట్ర ప్రభుత్వానికి పంపాల్సి ఉంటుంది. ఈ నివేదికల ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం బాధిత కుటుంబాలకు నష్ట పరిహారం అందించాల్సి ఉంటుంది.

రాష్ట్ర కేంద్రం నుండీ వచ్చే ఆదేశాలతో సంబంధం లేకుండా జిల్లా కలెక్టర్ చొరవ చేసి ఈ బాధ్యతను నిర్వర్తించాల్సి ఉంటుందని చట్టం స్పష్టంగా పేర్కొంది. 2022 లో రాష్ట్ర హైకోర్టులో ఆదిలాబాద్ జిల్లా రైతులు దాఖలు చేసిన ఒక రిట్ పిటిషన్ పై 2023 లో తీర్పు ఇస్తూ రాష్ట్ర హైకోర్టు కూడా ఇదే విషయాన్ని మరోసారి స్పష్టం చేసింది.

కానీ గత ప్రభుత్వ హయాంలో జిల్లా కలెక్టర్స్ ఈ చొరవను కోల్పోయారు. KCR ముఖ్యమంత్రిగా ఉన్న పదేళ్ళూ, ఆయన ఆదేశాల కోసం ఎదురు చూడడమే అనేకమంది జిల్లా కలెక్టర్స్ పనిగా పెట్టుకున్నారు తప్ప, వివిధ చట్టాలు, జీవో లు తమకు ఇచ్చిన అధికారాలను కూడా వినియోగించుకోవడం మానేశారు. ఫలితంగా 2020 నుండీ 2022 వరకూ ప్రతి సంవత్సరం భారీ వర్షాలు, వరదలతో రైతులు పంటలను నష్టపోయినా, ఒక్క రూపాయి కూడా ప్రభుత్వం సహాయం అందించలేదు.

2020 ఖరీఫ్ లో కురిసిన వర్షాలకు నష్టపోయిన రైతులకు నష్ట పరిహారం అందించాలని రైతు స్వరాజ్య వేదిక దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యం పై ఒక సంవత్సరం పాటు విధారణ చేసిన రాష్ట్ర హై కోర్టు ప్రధాన న్యాయమూర్తి బెంచ్, రైతులకు అనుకూలంగా అద్భుతమైన తీర్పు ఇచ్చింది. నష్టపోయిన రైతుల వివరాలను మూడు నెలల లోపు పూర్తి స్థాయిలో సేకరించి, నాలుగవ నెల గడిచే లోపు రైతులకు పరిహారం అందించాలను స్పష్టం చేసింది. కేవలం నష్ట పరిహారమే కాకుండా, పంటల బీమా పరిహారం కూడా అందించాలని స్పష్టం చేసింది. కేవలం భూ యజమానులకు మాత్రమే కాకుండా, వాస్తవంగా సాగు చేసే కౌలు రైతులకు కూడా పరిహారం అందించాలని చెప్పింది.

గడువు లోపల ఈ తీర్పును అమలు చేయడానికి సిద్దం కాని KCR సర్కార్, తీర్పు గడువు ముగిసే చివరి రోజుల్లో సుప్రీం కోర్టుకు అప్పీల్ కు వెళ్ళింది. ఇప్పటికీ ఆ కేసు సుప్రీం కోర్టు విచారణలో ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ తీర్పును సమీక్షించి, సుప్రీం కోర్టు నుండీ అప్పీల్ ను ఉపసంహరించుకుని, రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేయడానికి పూనుకోవాలని మేము కోరుతున్నాము.

2023 లో , అంటే ఎన్నికల సంవత్సరంలో మాత్రం మొదటి దఫా కురిసిన భారీ వర్షాల కారణంగా నష్టపోయిన రైతులకు ఎకరానికి 10,000 రూపాయల చొప్పున సహాయం అందించిన అప్పటి రాష్ట్ర ప్రభుత్వం, రెండవ విడత కురిసిన వర్షాలకు నష్ట పోయిన రైతులకు సహాయం అందించడానికి జీవో విడుదల చేసి కూడా, అంతిమంగా నిధులను విడుదల చేయలేదు. వేలాదిమంది రైతులకు ఎటువంటి సహాయం అందలేదు.

2023 డిసెంబర్ 7 రాష్ట్రంలో అధికారం లోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం , 2023-2024 రబీలో రైతులు ఎదుర్కున్న నష్టాలకు ఎకరానికి 10,000 రూపాయల చొప్పున పరిహారం అందించడానికి వేగంగా చర్యలు తీసుకుంది. ఇది అభినందనీయమే అయినా, నష్టపోయిన కౌలు రైతులకు మాత్రం సహాయం అందలేదు.

ఇప్పుడు కురుస్తున్న వర్షాలవల్ల, వరదల వల్ల, నష్టపోయిన రైతులకు ఎకరానికి 10,000 రూపాయల సహాయం అందిస్తామని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. ఈ నెల 7 వ తేదీ లోపు నష్టపోయిన రైతుల వివరాలు, నష్టపోయిన పంటల విస్తీర్ణం సేకరించి రాష్ట్ర ప్రభుత్వానికి పంపాలని జిల్లా అధికారులకు ఆదేశాలు కూడా ఇచ్చింది. నిజానికి ఇంకా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. రైతుల పంటలకు నష్టం వాటిల్లుతూనే ఉంది. నష్టపోతున్న రైతుల వివరాలను సేకరించడమనేది , మరి కొన్నిరోజులు నిరంతర ప్రక్రియగా కొనసాగించాలి. క్షేత్ర స్థాయిలో నష్టపోయిన రైతుల వివరాలను సేకరించేటప్పుడు, ఆయా సర్వే నంబర్స్ లో వాస్తవ సాగుదారులుగా ఉండే కౌలు రైతుల, పోడు, రైతుల, భూమి పై పట్టా హక్కులు లేని ఇతర వాస్తవ సాగు దారుల వివరాలను తప్పకుండా సేకరించాలని, క్షేత్ర స్థాయి వ్యవసాయ విస్తరణ అధికారులకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ధిష్ట ఉత్తర్వులివ్వాలి. లేకపోతే, E క్రాప్ బుకింగ్ లో రాసుకు వచ్చినట్లుగా వాళ్ళు కేవలం భూమి యాజమానుల వివరాలే రాసుకువచ్చే ప్రమాదం ఉంది. దానివల్ల, , నిజంగా నష్టపోయిన కౌలు, పోడు రైతులకు పరిహారం అందే అవకాశం లేదు. వ్యవసాయం చేయని భూ యజమానులకు పంట నష్ట పరిహారం అందించే పేరుతో వందల కోట్ల నిధులు దుర్వినియోగం అయ్యే అవకాశం కూడా ఉంది.

2020 నుండీ 2023 వరకూ నాలుగు సంవత్సరాల పాటు తెలంగాణ రాష్ట్రంలో పంటల బీమా పథకం అమలు కాలేదు. దేశం మొత్తం మీద ఏ విధమైన పంటల బీమా పథకం అమలు కాని ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమే. ఈ నాలుగు సంవత్సరాలలో రైతులు ప్రకృతి వైపరీత్యాల వల్ల తీవ్రంగా నష్టపోయారు. ఆయా రైతుల కుటుంబాలు అప్పుల ఊబిలో కూరుకుపోయాయి. రైతు ఆత్మహత్యలకు ప్రధాన కారణాలలో , ప్రకృతి వైపరీత్యాల వల్ల, పంటలను నష్టపోవడం అనేది ఒక ముఖ్య కారణంగా ముందుకు వచ్చింది.

2023లో అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ 2024 ఖరీఫ్ నుండీ పంటల బీమా పథకం అమలు చేస్తామని ఎన్నికల మానిఫెస్టో లో కూడా హామీ ఇచ్చింది. అధికారంలో వచ్చాక అనేక సార్లు ఈ విషయాన్ని స్పష్టంగా ప్రకటించింది. పైగా బీమా ప్రీమియం భారం రైతులపై వేయకుండా, తానే భరిస్తానని కూడా స్పష్టం చేసింది. కేంద్రం అమలు చేస్తున్న ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజనలో చేరతామని, కేంద్ర ప్రభుత్వంతో ఒప్పందం కూడా చేసుకుంది. ఈ సంవత్సరం బడ్జెట్ లో పంటల బీమా పథకానికి నిధులు కూడా కేటాయించింది.

కానీ కారణమేదైనా , 2024 ఖరీఫ్ కోసం మే నెలలో విడుదల చేయాల్సిన పంటల బీమా పథకం నోటిఫికేషన్ విడుదల చేయలేదు. నిజానికి పాత బీమా మార్గదర్శకాల ప్రకారం జులై 14 నాటికి పత్తి పంటకు, మిగిలిన పంటలకు జులై 31 నాటికి ఎంపిక చేసిన కంపెనీలకు ప్రీమియం మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది. సెప్టెంబర్ 30 నాటికి ఖరీఫ్ సీజన్ కూడా ముగిసిపోతుంది. ఒకవేళ ప్రభుత్వమే బీమా కంపెనీని స్వంతంగా ఏర్పాటు చేసి నడుపుతుంది అనుకున్నా, ఆ విషయాన్నయినా స్పష్టంగా రైతులకు ముందుగా చెప్పాల్సి ఉంటుంది. కానీ ఇప్పటివరకూ ప్రభుత్వం నుండీ దీనిపై స్పష్టమైన ప్రకటన రాలేదు. ప్రభుత్వం ఇప్పుడు ఎకరానికి 10,000 రూపాయల పరిహారం అందిసంచాలని అనుకున్నా, నిజానికి పంటల బీమా పథకం అమలులో ఉండడం, దాని క్రింద పరిహారం నష్టపోయిన రైతులకు అందించడం ఎప్పుడూ రైతులకు మేలు చేసే ప్రక్రియ. జాతీయ విపత్తుల నిధి క్రింద కేంద్రం అందించే సహాయం , ఎకరానికి 10,000 చొప్పున రైతులకు తక్షణ సహాయంగా అందించడం మంచిదే అయినా, పంటల బీమా పథకం క్రింద కూడా పరిహారం అందుతుందని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలి.

పత్తి, మిరప, ఆయిల్ పామ్, టమాటా, బత్తాయి పంటలు వాతావరణ ఆధారిత పంటల బీమా పథకం క్రింద కవర్ అవుతాయి. ముఖ్యంగా ఈ పథకం క్రింద , పత్తి పంటకు ఎక్కువ రోజుల పాటు వరుసగా వర్షాలు పడని సమయం లోనూ, ఒక నిర్ధిష్ట నెలలో అధిక వర్షాలు కురిసిన సమయంలోనూ, ఒక నిర్ధిష్ట నెలలో తక్కువ వర్షపాతం నమోదైన సందర్భం లోనూ, ఒక నెలలో వరుసగా మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసిన సమయంలోనూ, అతి చలి పెరిగిన సందర్భం లోనూ రైతులకు బీమా పరిహారం అందే అవకాశం ఉంది. ఒక్కోసారి, ఒక్కో రైతుకు , ఒకే సీజన్ లో రెండు మూడు సందర్భాలలో కూడా పరిహారం అందే అవకాశం ఈ పథకం క్రింద ఉంది. ఈ పథకం క్రింద ఆదిలాబాద్ పత్తి రైతులు గతంలో మంచి ప్రయోజనం పొందారు.

మిగలిన పంటలు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన క్రింద కవర్ అవుతాయి. ఈ పథకం క్రింద ప్రతి జిల్లాలోనూ ఏదైనా ఒకటి రెండు పంటలు గ్రామం యూనిట్ గా బీమా పరిధిలోకి వస్తే, ఆయా జిల్లాలలో మిగిలిన పంటలు మండలం యూనిట్ గా బీమా పరిధిలోకి వస్తాయి. సీజన్ చివరిలో చేసే పంట కోత పరీక్షల ఆధారంగా సగటు దిగుబడులను లెక్కవేసి, ఆ నిర్ధిష్ట గ్రామంలో, లేదా మండలంలో పంటల సగటు దిగుబడులు బీమా నోటిఫికేషన్ లో నిర్ణయించిన ఇండెమ్నిటీ లెవల్ కంటే, తక్కువకు పడిపోయిన సందర్భంలో రైతులకు బీమా పరిహారం అందుతుంది. ఎకరానికి ఎంత పరిహారం అందుతుందనేది,సగటు దిగుబడుల ఆధారంగా మాత్రమే తేలుతుంది. కరువు కాటకాలు, వర్షాభావ పరిస్థితులు, భారీవర్షాలు, వడగండ్ల వానలు, వరదల కారణంగా ఏదైనా పంటలో సీజన్ చివరిలో సగటు దిగుబడులు పడిపోయే అవకాశం ఉంది కనుక, పంటల బీమా పథకం అమలయితే, రైతులకు తప్పకుండా బీమా పరిహారం అందే అవకాశం ఉంది.

కానీ రాష్ట్ర ప్రభుత్వం ఈ సీజన్ నుండీ ఈ పథకం అమలవుతుంది అని ప్రకటించి ఉంది కనుక, ఇప్పుడు కురిసే భారీ వర్షాలు, వరదల కారణంగా సగటు దిగుబడులు పడిపోయిన సందర్భంలో , బీమా పరిహారం అందిస్తామని రాష్ట్ర వ్యవసాయ శాఖ స్పష్టంగా ముందుగానే ప్రకటన చేయాల్సి ఉంటుంది. రైతులందరికీ, అన్ని పంటలకూ ఈ సీజన్ నుండే పంటల బీమా పథకం అమలులోకి వచ్చినట్లుగా ప్రభుత్వం ప్రకటిస్తే మాత్రమే, ఈ సీజన్ లో నష్టపోతున్న రైతులు పంటల బీమా పరిహారం గురించి కొంతయినా ఆశ పెట్టుకోవచ్చు. అలా ప్రభుత్వం ప్రకటన చేయకపోతే, రైతులకు ఈ సీజన్ లో పంటల బీమా పథకం అమలు కానట్లుగానే అనుకోవాలి. అంటే, ప్రభుత్వం 2024 ఖరీఫ్ నుండీ పంటల బీమా పథకాన్ని అమలు చేస్తామని హామీ ఇచ్చి కూడా అమలు చేయనట్లుగా భావించాలి.

2024-2025 రబీ సీజన్ కోసం అయినా, పంటల బీమా పథకాన్ని అమలు చేయాలనుకుంటే, ఈ నెలలోనే బీమా నోటిఫికేషన్ రాష్ట్ర వ్యవసాయ శాఖ విడుదల చేయాల్సి ఉంటుంది. కానీ ఇప్పటి వరకూ అటువంటి సూచనలు కూడా కనపడడం లేదు.

2023 ఎన్నికలలో హామీ ఇచ్చిన విధంగా పంట ఋణమాఫీ హామీని అరకొరగా అమలు చేయడం తప్ప, నిజానికి ఈ సీజన్ లో వ్యవసాయ రంగానికి సంబంధించి కీలక అడుగులు ఇంకా పడలేదు. రైతు భరోసా విధి విధానాలు ఖరారు కాలేదు. రైతు భరోసా సహాయం అందలేదు. కౌలు రైతుల గుర్తింపు ఇంకా జరగలేదు. వ్యవసాయ కూలీలకు రైతు భరోసా సహాయం అందలేదు. భూమి లేని కౌలు రైతులకు, వ్యవసాయ కూలీలకు రైతు బీమా పథకం విస్తరించలేదు. పంటల ప్రణాళిక జరగనే లేదు. వ్యవసాయ/ రైతు కమిషన్ ఏర్పడలేదు. సమగ్ర వ్యవసాయ విధానం రూప కల్పనకు అడుగులు పడలేదు.

వ్యవసాయ రంగానికి సంబంధించి డైనమిక్ గా నిరణ్యాలు తీసుకోకపోతే, రైతులు నష్ట పోయే ప్రమాదం ఉందని రేవంత్ ప్రభుత్వం గుర్తించాలి. రాజకీయంగా కూడా ప్రభుత్వ ప్రతిష్టకు ఇది తీవ్ర నష్టం చేస్తుందని కూడా ఈ ప్రభుత్వం గుర్తించాలి. గత పదేళ్ళ పాటు, దేశ, రాష్ట్ర రైతాంగానికి తీవ్ర నష్టం చేసిన BRS,BJP ప్రభుత్వాలు , ప్రస్తుతం ఇక్కడ రాష్ట్రంలో ప్రతిపక్షాలుగా చేసే హంగామాకు, రైతాంగంలో వారి కార్యకలాపాల విస్తరణకు, ప్రజలకు ఇచ్చిన హామీల అమలులో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యమే కారణంగా మిగులుతుందని గుర్తించాలి.


Read More
Next Story