
‘కేసీఆర్‌పై కోపంతో రైతులను బాధపెడుతున్నారు’
కేసీఆర్ హాయంలో వ్యవసాయరంగమంతా పచ్చగా ఉందని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సంక్షోభంలోకి వెళ్లిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు కేటీఆర్.
కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శలు గుప్పించారు. కేసీఆర్ అంటే కాళేశ్వరం.. కాంగ్రెస్ అంటే శనీశ్వరం అంటూ చురకలంటించారు. కేసీఆర్ హాయంలో వ్యవసాయరంగమంతా పచ్చగా ఉందని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సంక్షోభంలోకి వెళ్లిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్‌పై కోపంతో కాంగ్రెస్ కావాలనే అన్నదాతలను ఇబ్బందులకు గురిచేస్తోందని ఆరోపించారు. ఎల్లారెడ్డి మండలం రాజన్నపేట దేవుని గుట్ట తండాలో ఎండిపోయిన వరిపొలాలను కేటీఆర్.. ఆదివారం పరిశీలించారు. వరి పంటలు ఎండిపోయి ఉండటాన్ని చూసి.. ఆయన ఇదంతా కాంగ్రెస్ కుట్రేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాళేశ్వరం నీళ్లను కేసీఆర్.. మల్కపేట రిజర్వాయర్‌లో పోస్తే దేవుటి గుట్ట తండాలోని రైతులు వ్యవసాయం చేశారని చెప్పారు. కేసీఆర్‌పై ఉన్న కోసం, ద్వేషంతో మేడిగడ్డలో జరిగిన ప్రమాదాన్ని సాకుగా చూపుతూ నీళ్లు ఆపేస్తుండటంతో రాష్ట్రవ్యాప్తంగా పంటలు ఎండుతున్నాయని, రైతులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు కేటీఆర్.
సిరిసిల్ల ప్రాంతంలోని చాలా మంది రైతులు సాగునీరు లేక అవస్థలు పడుతున్నారని చెప్పారు. కాళేశ్వరం నీళ్లు రాక తుంగతుర్తి, సూర్యాపేట, కోదాడ ప్రాంతాల్లో వ్యవసాయం సంక్షోభంలోకి వెళ్లిపోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ అంటే కాళేశ్వరం, కాంగ్రెస్ అంటే రాష్ట్రానికి పట్టిన శనీశ్వరం అని చురకలంటించారు. ప్రస్తుతం రాష్ట్రంలో వచ్చిన కరువు కాలం తెచ్చింది కాదని, కాంగ్రెస్ కుట్రపూరితంగా తెచ్చిందని విమర్శించారు. మేడిగడ్డ పర్రెను రిపేర్ చేసి నీళ్ళు ఇవ్వవచ్చు, పంటపొలాలను మళ్ళీ పచ్చగా మార్చొచ్చు అని అన్నారు కేటీఆర్.
‘‘మిడ్ మానేరు అప్పర్ మానేరు నింపడంతో ఎర్రటి ఎండల్లో కూడా వాగులు చెర్లను నింపు రైతులను కాపాడుకున్నాం. సిరిసిల్ల జిల్లాలో వందల ఎకరాల్లో పంటలు ఎండిపోతున్నాయి. ఇలానే కొనసాగితే.. రైతులను ఇబ్బందిపెడుతూనే ఉంటే చూస్తూ ఊరుకోం. 48 గంటల్లో నీళ్లను వదలకపోతే మంత్రి ఛాంబర్ ముందు ధర్నా చేస్తాను. ఈ ప్రభుత్వాన్ని వదిలిపెట్టం. కేసీఆర్ అంటే కోపం ఉంటే.. రాజకీయంగా ఎదుర్కోవాలని కానీ ప్రజలను, రైతులను ఇబ్బంది పెట్టి పైశాచికానందం పొందడం కాదు. ఇప్పటికే 450 మంది రైతులను రేవంత్ రెడ్డి పొట్టనపెట్టుకున్నాడు. కాంగ్రెస్ చెప్పిన రైతు డిక్లరేషన్‌లో ఒక్క మాటను కూడా నిలబెట్టుకోలేదు. రైతు బంధు కూడా రాలేదు. ఈ ప్రభుత్వానికి కరెంటు ఇచ్చే తెలివి లేదు.. నీళ్లు ఇచ్చే సోయలేదు. రేవంత్ సర్కార్ వచ్చాక నీళ్లు పాతాళానికి పోయాయి. కాంగ్రెస్ ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని రైతులను కాపాడుకోవడానికి వెంటనే నీళ్లు విడుదల చేయాలి’’ అని డిమాండ్ చేశారు.