
వర్షం కురుస్తున్న చిత్రం
‘‘ముందు మురిపించి తరువాత మొహం చాటేస్తుందా?’’
తెలంగాణలో జోరుగా కురుస్తున్న వర్షాలు, వర్షాకాలంలో వానలు కురవకపోవచ్చని ఆందోళన చెందుతున్న అన్నదాతలు
దక్షిణ భారతంలో గత కొన్ని రోజులుగా జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. తమిళనాడు, కర్ణాటకలో అయితే కుండపోతగా ఉంది. దీనితో ప్రజలకు వేసవి నుంచి పూర్తి ఉపశమనం లభించిందనే చెప్పాలి.
వేసవికాలంలో అడపాదడపా అప్పుడప్పూడు వడగండ్ల వర్షాలు కురవడం మామూలే కానీ.. ఈ స్థాయిలో వర్షాలు కురవడం చాలా అరుదనే చెప్పాలి. ఎండ వేడి నుంచి భూమి దాదాపు చల్లబడిందనే చెప్పాల్సిన పరిస్థితి. చాలా చోట్ల పొలాల్లో నీరు నిలిచి దుక్కి చేసుకోవడానికి అనుకూలంగా మారాయి.
నిజానికి మే 25 నుంచి రోహిణి కార్తె ప్రారంభం అవుతుంది. రోహిణిలో రోళ్లు పగిలేలా ఎండలు కాస్తాయని ఓ సామెత కూడా ఉంది. కానీ దీనికి విరుద్దంగా ఇప్పటికే వాతావరణం పూర్తిగా మారిపోయింది.
ఎక్కడ చూసిన పచ్చదనం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. గుట్టలు, ఎత్తైన ప్రాంతాలు మొత్తం పచ్చదనం సంతరించుకున్నాయి. కేరళకు మరో రెండు రోజుల్లో నైరుతి రుతుపవనాలు రాబోతున్నాయి.
ఈ లెక్క ప్రకారం జూన్ రెండోవారం చివరికి కానీ రుతుపవనాలు తెలంగాణలోకి ప్రవేశిస్తాయి. ఆ తరవాత వర్షాలు ప్రారంభం అయి, భూమి చల్లబడి దుక్కి దున్నడం ప్రారంభం అవుతాయి.
గత అనుభవాలను నెమరు వేసుకుంటున్న రైతులు
ప్రస్తుతం రాష్ట్రంలో చాలా చోట్ల వరికోతలు పూర్తి అయిన కాస్త ఆలస్యంగా కోతకోసిన రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారు. అకాల వర్షాల పట్ల తెలంగాణ రైతాంగం గుబులు పడుతోంది.
దాదాపు రెండు దశాబ్ధాల క్రితం ఇదేవిధంగా వేసవి కాలంలో వర్షాలు కురిశాయని, కానీ తరువాత వర్షాకాలం మొదలయ్యాక వర్షాలు మొహం చాటేశాయని తమ గత అనుభవాలను నెమరువేసుకుంటున్నారు.
చాలామంది రైతులు పొలాలు దున్ని మొదటి విడతగా ప్రత్తి పంట వేయడానికి సిద్దం అవుతున్నారు కానీ తరువాత ఏం అవుతుందో అని భయపడుతున్నారు.
హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం వంగర గ్రామానికి చెందిన ఆర్. లచ్చవ్వ అనే మహిళా రైతు మాట్లాడుతూ... 20 సంవత్సరాల క్రితం వరుసగా నాలుగు సంవత్సరాలుగా ఇలాగే వర్షాలు కురిశాయని, కానీ తరువాత వర్షాలు సరిగా కురవక చెరువులోకి చెంబుడు నీళ్లు కూడా రాలేదని చెప్పుకొచ్చారు.
గ్రామంలో అప్పుడు రైతులు ఆత్యహత్యలు చేసుకున్నారని గుర్తు చేసుకున్నారు. ‘‘జమాన్ల కింద ఇట్లనే ముందు వానలు పడ్డాయ్. కానీ వానకాలం సక్కగ వాన పడక, చుక్క నీరు రాలే. అంతా పత్తి మందుతాగుడు దవాఖాన్లకు పోవుడే అయింది’’ అంటూ అప్పటి విషయాలను ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు.
‘‘ముందే వాన దేవుడు మురిపిస్తున్నాడు, తరువాత పత్తా లేకుండా పోతాడు’’ అంటూ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఏడు పశువులకు నీళ్లు పెట్టడానికి అయిన నీళ్లు దొరికే వర్షం కురవాలని ఆకాశం వైపు చూస్తూ దండం పెట్టుకున్నారు.
ఇంకా వర్షధార ప్రాంతాలే అధికం
తెలంగాణలోని చాలా ప్రాంతాలు ఇప్పటికి వర్షాధారంగానే పంటలు పండిస్తున్నారు. ఇక్కడ బావులు, బోరు బావుల కింద చేసే వ్యవసాయమే అధికం. గత కొంతకాలంగా ప్రజలు ఎక్కువగా వరిసాగు పైనే దృష్టి సారిస్తున్నారు. దానికి అత్యధిక స్థాయిలో నీరు అవసరం. వరి సాగు చేస్తే ఐదు వందల బోనస్ కూడా ఇస్తామని ప్రభుత్వం ప్రకటించడం సాగునీటిపై ఎక్కువ ప్రభావం చూపేలా చేసింది.
ఈ సంవత్సరం ఫిబ్రవరి చివరి వారంలోనే భూగర్భ జలాలు ఏకంగా తొమ్మిది మీటర్లకు పడిపోయాయి. వేలాది మంది రైతులు తమ పంటను కాపాడుకునేందుకు బోరుబావులు తవ్వించారు. బావుల్లో పూడికలు తీశారు. చివరగా బావుల తవ్వకం కూడా చేపట్టారు.
ఎంతచేసిన చాలామంది రైతులు తమ పంటను కాపాడుకోలేకపోయారు. ముఖ్యంగా గత మూడు సంవత్సరాలుగా కేవలం ఒక్కటి రెండు భారీ వర్షాలు పడి మాత్రమే చెరువులు నిండుతున్నాయి.
పాతకాలంలా ముసురు పట్టి రోజుల తరబడి వర్షాలు కురవకపోవడంతో నీరు ఎక్కువ కాలం ఉండటం లేదు. హనుమకొండ జిల్లా లోని రత్నగిరి గ్రామానికి చెందిన సమ్మయ్య అనే ఓ కౌలుదారుడు ఫెడరల్ తో మాట్లాడారు.
‘‘నేను మూడు సంవత్సరాలుగా కౌలు చేస్తున్నాను. ఈ బావి దాదాపు 18 గోళల లోతు ఉంది. ఈ ఊళ్లో ఇదే లోతైన బావి. ఇది ఎండిపోవడం అంటే ఏంటో తెలియదు. కానీ మొదటిసారిగా ఇది ఎండిపోయింది. రెండు మోటార్లు కేవలం నాలుగు గంటలు నడిచాయి. తొలిసారిగా 20 గుంటల పొలం ఎండిపోయింది’’ అని చెప్పారు.
ఇప్పుడు మరోసారి ముందస్తు వర్షాలు కురవడంతో రైతులు భయపడుతున్నారు. కానీ గత మూడు సంవత్సరాలు ఏడాదికి కనీసం ఒక్కటైన భారీ వర్షం కురిసి చెరువులు నిండాయని, ఇప్పుడు కనీసం అలా కురుస్తుందా అనే సందేహం అన్నదాతల్లో వ్యక్తమవుతోంది.
ఐఎండీ ఏం చెబుతోంది..
దేశంలో అకాల వర్షాలు కురవడానికి ప్రధాన కారణం బంగాళఖాతంలో ఏర్పడిన అల్పపీడనమే ప్రధాన కారణమని వెల్లడించింది. ఉపరితలం ఆవర్తన ప్రభావం వల్ల దేశంలోని వివిధ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నట్లు వెల్లడించింది. ఈ ఏడాది సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదు అవుతుందని వివిధ వాతావరణ సంస్థలు అంచనా వేస్తున్నాయి.
అయితే అన్నదాతలు వీటిని నమ్మకుండా తమ అనుభవాలను మాత్రమే పరిగణలోని తీసుకుంటున్నారు. సకాలంలో వర్షాలు కురిసి మంచి పంటలు పండాలని వరుణ దేవుడిని మొక్కుకుంటున్నారు.
Next Story