
Andhra pickels with Trump.. (graphics)
ట్రంప్ టారిఫ్ 'మోజు'.. ఆంధ్రాపచ్చళ్లకు 'బూజు'
ట్రంప్ దెబ్బతో కుప్ప కూలిన ‘పచ్చళ్ల కొరియర్’ వ్యాపారం
‘గోంగూరా! చికెనా!! ఏమేమి ప్యాక్ చేయమంటారు? చికెనైతే మా ఊళ్లో పెంచిన కోళ్లే.. కేజీ రూ.900, బోన్ లెస్ రూ.1,400, గోంగూరైతే అరకిలో రూ.650.. అరెశలు కిలో రూ.900.. అన్నీ ఫ్రెష్‌పేనండీ..’ విజయవాడ గుణదల రింగురోడ్డు సమీపంలోని ఓ దుకాణదారు మరో కస్టమర్‌తో మాట్లాడుతున్నాడు.
‘ఏ ప్యాకింగ్ కావాలండీ, అమెరికాకా, యూకేకా.. యూఎస్ ప్యాకింగ్ లో మేమే స్పెషల్..’ హైదరాబాద్ ఎస్సార్‌నగర్‌లో ఓ ఇంటి ఇల్లాలితో ఒక చిరు వ్యాపారి.
‘హలో.. ఫెడెక్స్ ఏజెన్సీ వాళ్లేనా.. మా అడ్రసు పంపుతున్నానండి.. అమెరికాకి కొరియర్ చేయాలి, ఎప్పుడొస్తారు..’ హైదరాబాద్ కేపీహెచ్బీ 4వ ఫేజ్లోని ఓ ఇంటి యజమాని అభ్యర్థన.
ఇప్పుడు ఇవన్నీ గతం.
12 లక్షల మందికి పైగా తెలుగువాళ్లు...
2024 నాటికి అమెరికాలో తెలుగు మాట్లాడే వారి సంఖ్య 12.3 లక్షలకు చేరింది. 2016లోని 3.2 లక్షలతో పోలిస్తే దాదాపు నాలుగింతలు పెరిగింది. వీరిలో సగానికి పైగా విద్యార్థులు, ఉద్యోగులు. 2019 కోవిడ్ కాలంలో లక్షన్నర మందికి పైగా తెలుగు విద్యార్థులు అమెరికాకు చేరారు.
చదువు కోసం వెళ్లిన ప్రతి విద్యార్థీకి నెలకో రెండు నెలలకో తెలుగు రాష్ట్రాల నుంచి ఏదో ఒక ఫుడ్ ప్యాకెట్ వెళ్ళేది. హైదరాబాద్ ఎయిర్ కార్గో లెక్కల ప్రకారం 2018–19లో 1.2 లక్షల ఫుడ్ పార్సిల్స్ అమెరికాకు వెళ్ళితే, 2021–22 నాటికి అవి 2.45 లక్షలకు పెరిగాయి. పెద్ద పెద్ద కొరియర్ కంపెనీలు ప్రత్యేకంగా ఫుడ్ ప్యాకేజింగ్ సర్వీసులు మొదలుపెట్టి, పచ్చళ్ల ఎగుమతిని పెద్ద వ్యాపారంగా మలిచాయి.
అమెరికాకు వెళ్లే ప్రతి కొరియర్‌లో గోంగూర, మామిడికాయ, కొబ్బరి కారం, పల్లీ కారం, మటన్ పికిల్స్ మొదలు అరిసెలు, బొబ్బట్లు, మురుకులు వరకు ఎన్నో తినుబండారాలు ఉండేవి. “హైదరాబాద్ నుంచి గోంగూరో, మటన్ పికెలో వచ్చిందంటే ఇక ఆ గదంతా పండగే” అని విద్యార్థులు చెబుతుండేవారు.
చిన్న వ్యాపారానికి పెద్ద ఎకానమీ..
ఒకప్పుడు తెలుగు రాష్ట్రాల నుంచి అమెరికాకు వెళుతున్న పచ్చళ్ల వ్యాపారం ఏడాదికి ఉజ్జాయింపుగా రూ.400–500 కోట్లు మధ్య ఉండేదని తెలుగు అసోసియేషన్ల అంచనా.
2015–2020 మధ్య తెలంగాణ, ఆంధ్రలోని హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, రాజమహేంద్రవరం, భీమవరం, విశాఖపట్నం వంటి పట్టణాల్లో కనీసం 1500–2000 చిన్న ప్యాకింగ్ యూనిట్లు ఏర్పడ్డాయి. ప్రతి యూనిట్ రోజుకు 50–100 జాడీల పచ్చడి తయారు చేసేది. ICMR–NIN (హైదరాబాద్) 2019 స్టడీ ప్రకారం 10–12 వేల మహిళలు ప్రత్యక్షంగా ఉపాధి పొందారు.
ఆంక్షల దెబ్బ
కానీ ఇటీవలి కాలంలో పరిస్థితి మారిపోయింది.
అమెరికా FDA (Food & Drug Administration) కఠినమైన ఆహార భద్రతా నిబంధనలు తీసుకువచ్చింది.
మాంసంతో పచ్చళ్లపై పూర్తి నిషేధం.
ఫుడ్ ఐటెంలకు ల్యాబ్ సర్టిఫికేషన్ తప్పనిసరి.
USPS (US Postal Service) ద్వారా హోమ్‌మేడ్ ఫుడ్ పార్సెల్స్‌కి పరిమితులు.
టారిఫ్‌లు పెరగడంతో ఒక్కో ప్యాకెట్ కొరియర్ ఛార్జీ ₹5000 దాటింది.
ఇప్పుడేం జరుగుతోందంటే..
'అమ్మా నీరజా.. (పేరు మార్చాం) గుంటూరు నుంచి పండుమిర్చి పచ్చడి తెప్పించా.. పంపనా..' అమెరికాలో ఉంటున్న కూతురితో ఓ తల్లి..
'వద్దమ్మా.. ఇక్కడంతా గొడవగా ఉంది.. అవసరమైనపుడు నేనే చెప్తాలే.. కాస్త ఎక్కువైనా ఇక్కడ కొనుక్కోవడమే బెటరనుకుంటా..' తల్లితో ఓ కుమార్తె...
'ఐదారు నెల్లుగా పచ్చళ్లు పంపడం తగ్గిందండీ.. ఏవో పన్నులు, తనికీలు అంటున్నారట. పచ్చళ్లు కొనేవాళ్లూ లేరూ, ప్యాకింగ్ చేయించే వాళ్లూ లేరు..' తిరుపతికి చెందిన ఓ పచ్చళ్ల వ్యాపారి..
'కొరియర్ల వ్యాపారం తగ్గింది. అవేవో రూల్స్ వచ్చాయంట.. దీంతో అమెరికాకి బిజినెస్ తగ్గింది..' గచ్చిబౌలీలోని ఓ కొరియర్ ఏజెంట్..
ఈ ఆంక్షలతో తెలుగు రాష్ట్రాల్లో పుట్టిన వందలాది చిన్న పచ్చళ్ల తయారీ కేంద్రాలు క్రమంగా మూతపడ్డాయి. “అమెరికాకు పంపే పరిస్థితి లేకపోవడంతో, బిజినెస్ దాదాపు 60% తగ్గిపోయింది. సెంటర్ మూసేయాల్సి వచ్చింది” అని విజయవాడలోని ఓ పచ్చళ్ల తయారీదారు వాపోయారు.
తాజా టారిఫ్‌లతో గుదిబండ
2025 ఆగస్టు 27 నుంచి యుఎస్ ఇండియన్ గూడ్స్‌పై 50% టారిఫ్ అమలులోకి వచ్చింది (ముందుగా 25%, దానిపై అదనంగా 25%). చిన్న పార్సిల్స్‌పైనా పన్నులు పెరిగాయి.
“De minimis” ($800 duty-free) సడలింపు కూడా ఆగస్టు 29 నుంచి నిలిపిపోయింది.. అంటే చిన్న ప్యాకెట్లకైనా డ్యూటీ/ఫీజు తప్పనిసరి.
అమెరికా కస్టమ్స్ నియమాల ప్రకారం అసిడిఫైడ్ ఫుడ్స్ (పచ్చళ్లను కలుపుకొని) కఠిన ప్రమాణాలకు లోబడి, తప్పు లేబులింగ్ ఉంటే సీజ్/రిజెక్షన్ రిస్క్ పెరిగింది.
అందుకే ఇప్పుడు అమెరికాలో తల్లిదండ్రులకు పిల్లలు చెబుతున్నారు: “హోమ్‌మేడ్ పచ్చళ్లు పంపకండి. డ్యూటీలు, సీజ్ సమస్యలు వస్తాయి.”
విజయవాడ గుణదల రింగురోడ్డులో నుంచి కొంచెం లోపలికి వెళితే కనీసం బోర్డు కూడా లేని ఓ పచ్చళ్లు, స్వీట్ల తయారీషాపు ఐదారు నెలల కిందటి వరకు కూడా కిటకిటలాడుతుండేది. విదేశాలకు ప్రత్యేకించి అమెరికాకి వెజ్, నాన్ వెజ్ పచ్చళ్లు, అరిశలు, బూందీ ఇక్కడ కొని పంపించేవాళ్లు. ఇక్కడ కొంటే మిగతా వాళ్ల ప్యాకింగ్ రేటు కూడా తక్కువగా ఉండేది. ఇప్పుడా షాపు వద్ద అంతటి సందడీ లేదు, ఆనాటి ప్యాకింగులూ లేవు.
అమెరికాకి కొరియర్ సర్వీసుల వ్యాపారం బాగా సాగిన రోజుల్లో వీధివీధినా వెలిసిన వ్యక్తిగత ప్యాకింగ్, పార్శిల్ సర్వీసులు ఇప్పుడు కునారిల్లుతున్నాయి.
'ఆంధ్రా పచ్చళ్లు', 'స్వగృహ స్వీట్లు', 'అందంగా ప్యాకింగ్' లంటూ వెలిసిన బోర్డులు వెలిసిపోతున్నాయి. ట్రంప్ దెబ్బతో ఒకప్పుడు బూమ్‌లో ఉన్న వ్యాపారం ఇప్పుడు వెలవెలబోతోంది.
అమెరికా విధించిన ఆంక్షలతో 2024 నాటికి 50, 60 శాతం సెంటర్లు మూతపడ్డాయి. ఫార్మల్ ఎగుమతుల (కమర్షియల్ కార్గో) జాబితాలోని.. ఇండియా→యుఎస్ “పికిల్స్/చట్నీస్” HS కోడ్ కింద చూస్తే పెద్దమొత్తంలో పచ్చళ్లు వెళ్తున్నాయి అని ఉంది. ప్రైవేట్ ట్రేడ్ డేటాబేసు ప్రకారం ఈ ఏడాదిలో(2025) ఆగస్టు వరకు ఇండియా నుంచి యుఎస్‌కు 21,445 ‘పికిల్’ షిప్‌మెంట్‌లు మాత్రమే రికార్డ్ అయ్యాయి. దీన్ని బట్టి పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.
మున్ముందు ఏమవుతుందో చూడాలి..
ట్రంప్ విధించిన నిబంధనలు ఇప్పుడే అమల్లోకి వచ్చాయి. వీటి ప్రభావం ఎంత ఉంటుందో మున్ముందు చూడాలి. అయితే ఇప్పటికే పచ్చళ్లను విదేశాలకు పంపే వ్యాపారం తగ్గింది.
గతంలో మాదిరిగా ఇప్పుడు పంపడం లేదు అని స్వగృహ ఫుడ్స్ యజమాని CH. మధు బాబు చెప్పారు. దేశం కాని దేశంలో లేని పోని సమస్యలు ఎందుకనే సైకో ఫియర్ అందర్లోనూ నెలకొందని ఆయన చెప్పారు.
ఇక పచ్చళ్ల సీసాలు వెళ్లడం కలేనా...
ఒకప్పుడు ఇంటివంట రుచి అందించి, గ్రామీణ మహిళలకు ఉపాధి కల్పించిన పచ్చళ్ల కొరియర్ వ్యాపారం—ఇప్పుడు అంతర్జాతీయ ఆంక్షలతో కునారిల్లుతోంది.
టారిఫ్‌లు, సర్టిఫికేషన్ నిబంధనలు, కొరియర్ పరిమితులు వంటి వాటితో తల్లి పంపే గోంగూర పచ్చడి సీసా అమెరికాలోని పిల్లల గదికి చేరే రోజులు ఇప్పుడు కలలా మారాయి. మార్కెట్ లాజిక్ చెప్పేది ఒక్కటే—పచ్చళ్లు ఇకనుంచి గిఫ్ట్ కాకుండా, ఫ్యాక్టరీ సీల్ అయిన ‘కమర్షియల్ ప్రొడక్ట్’గానే వెళతాయి. ఈ మార్పు తెలుగు వలస సంస్కృతిలో పచ్చళ్ల శకానికి ముగింపుగా భావించాలేమో..
Next Story