
రేవంత్ లో కోర్టు కేసుల భయం
న్యాయస్ధానాల్లో ఎవరూ కేసులువేయకుండా చూడాలని కులసంఘాల పెద్దలకు చెప్పారు.
బీసీ రిజర్వేషన్లకు ఆర్డినెన్స్ జారీచేయాలని క్యాబినెట్లో నిర్ణయం చేయించిన ఎనుముల రేవంత్ రెడ్డిని కేసుల భయం వెంటాడుతున్నట్లుంది. అందుకనే బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా కోర్టుల్లో కేసులు పడకుండా చూడాలని తనను కలసిన బీసీ సంఘాల నేతలకు రేవంత్(Revanth) చెప్పారు. సామాజిక సామరస్యం దెబ్బతినకుండా చూడాలని ముఖ్యమంత్రి సంఘాల నేతలతో చెప్పారు. రిజర్వేషన్లు సాధించుకునేంతవరకు బీసీ వర్గాలు సమన్వయంతో పనిచేయాలన్నారు. న్యాయస్ధానాల్లో ఎవరూ కేసులువేయకుండా చూడాలని కులసంఘాల పెద్దలకు చెప్పారు. ప్రభుత్వం, కులసంఘాలన్నీ కలిసి బీసీ రిజర్వేషన్ల(BC Reservations)కోటాకు కాపుకాయాలని రేవంత్ పిలుపిచ్చారు. అయినా రేవంత్ అమాయకుడు కాకపోతే ప్రభుత్వం తీసుకురావాలని అనుకుంటున్న ఆర్డినెన్స్ పై ఎవరైనా కేసులు వేయాలని అనుకుంటే ముందుగా ప్రభుత్వానికో లేకపోతే కులసంఘాల నేతలకో చెప్పి వేస్తారా ?
స్ధానికసంస్ధల ఎన్నికల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్ల అమలుకు ప్రత్యేక ఆర్డినెన్స్(Ordinance for BC reservations) తీసుకురావాలని రేవంత్ క్యాబినెట్ నిర్ణయించిన విషయం అందరికీ తెలిసిందే. మామూలుగా అయితే క్యాబినెట్ తీసుకున్న ఆర్డినెన్స్ నిర్ణయం కోర్టు సమీక్షలో నిలబడదు. ఎందుకంటే మొత్తం రిజర్వేషన్లు 50 శాతానికి మించకూడదని గతంలో సుప్రింకోర్టు చెప్పింది. సుప్రింకోర్టు తీర్పుకు తాజాగా రేవంత్ క్యాబినెట్ నిర్ణయం పూర్తి వ్యతిరేకం. ఎలాగంటే ఇపుడు ఎస్సీలకు 8 శాతం, ఎస్టీలకు 10శాతం, బీసీలకు 22శాతం రిజర్వేషన్ అమల్లో ఉంది. దీని ప్రకారం రిజర్వేషన్లు 50శాతం సరిపోతుంది కాబట్టి ఇబ్బంది రావటంలేదు.
అయితే బీసీలకు ఇపుడున్న 22శాతం రిజర్వేషన్లకు బదులు మరో 20శాతం కలిపి మొత్తం 42శాతం రిజర్వేషన్లు అమలుచేయాలని రేవంత్ క్యాబినెట్ ఆర్డినెన్స్ తీసుకురావాలని డిసైడ్ చేసింది. 22శాతానికి అదనంగా 20శాతం కలిపి మొత్తం 42శాతం రిజర్వేషన్లు అమలుచేయాలన్న నిర్ణయమే సుప్రింకోర్టు తీర్పుకు వ్యతిరేకం. ఎవరైనా రేవంత్ క్యాబినెట్ నిర్ణయాన్ని సవాలుచేస్తు కోర్టులో కేసు వేస్తే కచ్చితంగా ఆర్డినెన్స్ నిర్ణయాన్ని కొట్టేస్తుంది. ఈ విషయం రేవంత్ తో పాటు బీసీకులసంఘాల నేతలందరికీ బాగా తెలుసు. అందుకనే తనను కలిసిన బీసీ సంక్షేమసంఘం జాతీయ అధ్యక్షుడు, బీజేపీ రాజ్యసభ ఎంపీ ఆర్ కృష్ణయ్య(MP Krishnaiah) తదితరులతో మాట్లాడుతు కోర్టులో ఎవరూ కేసులు వేయకుండా చూడాలని చెప్పారు. అంటే దీని అర్ధం ఏమిటి ? ఎవరైనా కోర్టులో కేసు వేస్తే ఆర్డినెన్స్ చెల్లదని రేవంత్ కు బాగా తెలుసన్న విషయం అర్ధమవుతోంది.
కృష్ణయ్య బెదిరిస్తున్నారా ?
సీఎంతో భేటీ తర్వాత కృష్ణయ్య మాట్లాడుతు ప్రజాస్వామ్యయుతంగా, రాజ్యంగబద్ధమైన వాటా 75 ఏళ్ళ తర్వాత బీసీలకు అందుతోందని సంతోషం వ్యక్తంచేశారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లకు ఎవరూ అడ్డుపడకూడదని విజ్ఞప్తిచేశారు. ఇక్కడవరకూ బాగానే ఉన్నా ఆ తర్వాత ఎంపీ మాట్లాడిందే ఆశ్చర్యంగా ఉంది. ఎంపీ ఏమన్నారంటే ఆర్డినెన్స్ జారీ నిర్ణయానికి వ్యతిరేకంగా ఎవరైనా కోర్టులో కేసులు వేసినా గెలిచేది బీసీలే అన్నారు. మరింత ధీమాగా ఉన్నపుడు ఎవరూ కేసులు వేయద్దన్న విజ్ఞప్తి ఎందుకు ? అలాగే బీసీల రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ఎవరైనా కోర్టులో కేసులు వేసినా, పార్టీలు ప్రోత్సహించినట్లు తెలిసినా వారిని బయటకు లాగుతామని వార్నింగ్ ఇచ్చారు. బీసీ ప్రజల కోర్టులో నిలబెట్టి ఆ పార్టీల భరతంపడతాము అంటు హెచ్చరించారు.
కేవియట్ వేస్తే ఏమవుతుంది ?
ఆర్డినెన్స్ కు మద్దతుగా ముందుజాగ్రత్తగా ప్రభుత్వం కోర్టులో కేవియట్ వేయాలని ఎంపీ కృష్ణయ్య, బీఆర్ఎస్ ఎంఎల్సీ కల్వకుంట్ల కవిత ప్రభుత్వానికి సూచించారు. అయితే కేవియట్ వేసినంత మాత్రాన ఏమిటి ఉపయోగం ? కేవియట్ వేసినంత మాత్రాన ఆర్డినెన్స్ అమల్లోకి వచ్చేస్తుందని అనుకునేందుకులేదు. కాకపోతే ఎవరైనా ఆర్డినెన్స్ జారీకి వ్యతిరేకంగా కోర్టులో కేసు వేస్తే డైరెక్టుగా కోర్టు ఆ పిటీషన్ను అడ్మిట్ చేసుకోదు. ముందుగా సదరు కేసు వివరాలను ప్రభుత్వానికి అందిస్తుంది. ప్రభుత్వ స్పందన తర్వాత ఆ కేసును అడ్మిట్ చేసుకుంటుంది. కేసుగనుక అడ్మిట్ అయితే ప్రభుత్వం జారీ చేయాలని అనుకుంటున్న ఆర్డినెన్స్ కు చట్టబద్దత ఏమిటన్నది కోర్టు తేలుస్తుంది.
పార్టీల స్పందన
క్షేత్రస్ధాయిలో డెవలప్మెంట్లను చూస్తుంటే ప్రభుత్వం జారీచేయాలని అనుకుంటున్న ఆర్డినెన్స్ కు వ్యతిరేకంగా డైరెక్టుగా ఏ పార్టీ కూడా కోర్టులో కేసు వేసే అవకాశం లేదనే అనుకోవాలి. ఎందుకంటే బీసీలకు 42శాతం రిజర్వేషన్ల ఆర్డినెన్స్ అన్నదే స్ధానికసంస్ధల ఎన్నికల్లో లబ్దికోసం. అలాంటిది ఆర్డినెన్సును వ్యతిరేకిస్తు ఏ పార్టీ అయినా కేసు వేస్తే సదరు పార్టీ బీసీలకు వ్యతిరేకి అన్న ముద్రపడుతుంది. అప్పుడు తొందరలో జరగబోయే ఎన్నికల్లో సదరు పార్టీకి బీసీలు ఓట్లు వేయకపోతే తీవ్రంగా నష్టపోయే అవకాశముంది. అందుకనే డైరెక్టుగా ఏ పార్టీ కూడా ఆర్డినెన్స్ ను వ్యతిరేకిస్తు కోర్టులో కేసు వేయదు. క్యాబినెట్ నిర్ణయాన్ని వ్యతిరేకంగా బీఆర్ఎస్, బీజేపీలు నోరెత్తకపోవటం ఇందులో భాగమనే అనుకోవాలి. ఒకవేళ ఎవరైనా ప్రైవేటు వ్యక్తులో లేదా సంస్ధలో కేసులు వేసినా వాళ్ళ వెనుక ఎవరున్నారన్న విషయం ఈజీగా తెలిసిపోతుంది. అయితే కోర్టులో కేసంటు దాఖలైతే ఆర్డినెన్స్ అమలుకు ఇబ్బందులు తప్పవు. అందుకనే రేవంత్ లో కేసులభయం బాగా పెరిగిపోతున్నట్లు అర్ధమవుతోంది. చివరకు ఏమవుతుందో చూడాల్సిందే.