సైబర్ నేరాల్లో ‘గోల్డెన్ అవర్’ అంటే ఏమిటో తెలుసా ?
x
Cyber crimes

సైబర్ నేరాల్లో ‘గోల్డెన్ అవర్’ అంటే ఏమిటో తెలుసా ?

గోల్డెన్ అవర్ అనే పదం బాగా పాపులరవుతోంది. ఏ రంగంలో అంటే సైబర్ నేరాల విషయంలో. ఈమధ్య కాలంలో సైబర్ నేరాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి.


గోల్డెన్ అవర్ అనే పదం ఈమధ్య చాలా పాపులరైపోతోంది. పదంలోనే గోల్డ్ అని ఉండటం వల్లే దాని ప్రాధాన్యత ఎంతో అర్ధమవుతోంది. ఈ గోల్డెన్ అవర్ అనే పదం ఎక్కువగా వైద్య పరిభాషలో వాడుతారు. గుండెపోటు, బ్రైన్ స్ట్రోక్ వచ్చిన వారి విషయంలో డాక్టర్లు ఎక్కువగా గోల్డెన్ అవర్ అని చెబుతుంటారు. గుండెపోటును కొంచెం జాగ్రత్తగా గమనిస్తే తెలుసుకోవచ్చు. బ్రైన్ స్ట్రోక్ అన్నది చాలామందికి తెలీదు. డాక్టర్లు గోల్డెన్ అవర్లో తేలేదని చాలా సింపుల్ గా చెప్పేస్తారు కాని బ్రైన్ స్ట్రోక్ వచ్చిన వ్యక్తి దాన్ని ఎలా గుర్తించాలన్న విషయాన్ని డాక్టర్లు కూడా వివరించి చెప్పరు.

ఇపుడు అసలు విషయంలోకి వస్తే మరో విషయంలో కూడా గోల్డెన్ అవర్ అనే పదం బాగా పాపులరవుతోంది. ఏ రంగంలో అంటే సైబర్ నేరాల విషయంలో. ఈమధ్య కాలంలో సైబర్ నేరాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. అందుబాటులోకి వస్తున్న సాంకేతికతను పాజిటివ్ గా ఉపయోగంచుకోవటం కన్నా నెగిటివ్ గానే ఎక్కువగా ఉపయోగపడుతోంది. సాంకేతికత పెరిగేకొద్దీ నేరగాళ్ళు కూడా పెరిగిపోతున్నారు. అందుకనే సైబర్ నేరాల బాధితుల సంఖ్య కూడా రోజురోజుకు పెరిగిపోతోంది. ప్రతిరోజు కోట్లాది రూపాయలను సైబర్ నేరగాళ్ళు బ్యాంకుల ఖాతాల నుండి కొల్లగొడుతున్నారు. దీన్ని అరికట్టేందుకు పోలీసులతో పాటు ప్రభుత్వ ఏజెన్సీలన్నీ ఏకతాటిపైకి వచ్చి ఒక వేదికను ఏర్పాటు చేసుకున్నాయి. ఆ వేదికే సిటిజన్ ఫైనాన్షియల్ సైబర్ ఫ్రాడ్ రిపోర్టింగ్ అండ్ మేనేజ్మెంట్ సిస్టమ్( సీఎఫ్ సీఎఫ్ ఆర్ఎంఎస్). ఇందులో సైబర్ పోలీసులు, బ్యాంకులు, పేమెంట్ గేట్వేలు (గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం లాంటివి), ఆర్బీఐ, నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కీలక భాగస్వాములుగా ఉన్నాయి.

బాధితులు తాము మోసపోయమని గ్రహించగానే కంగారుపడకుండా అర్జంటుగా 1930కి ఫిర్యాదుచేయాలి. తమకు వచ్చిన ఫోన్ నెంబర్, మాట్లాడింది ఎవరు ? తాము ఎంత డబ్బు చెల్లించాము, ఏ బ్యాంకు నుండి చెల్లింపులు జరిగాయి ? పేమెంట్ గేట్వే ఏమిటనే వివరాలను చెప్పాలి. ఒకవేళ ఫోన్ ఎంగేజ్ వస్తుంటే ఆలస్యం చేయకుండా సైబర్ క్రైం పోర్టల్ https://cybercrime.gov.in లో ఫిర్యాదు చేయాలి. ఇక్కడ గోల్డెన్ అవర్ అంటే ఏమిటంటే మోసపోయామని గ్రహించిన గంటలోపే అన్న విషయాన్ని బాధితులు గుర్తుంచుకోవాలి. మోసపోయిన గంటలోపు పై నెంబర్ కు ఫోన్ చేసి ఫిర్యాదుచేసినా లేదా వెట్ సైట్లో ఫిర్యాదు చేసినా వెంటనే పైన చెప్పిన ఏజెన్సీలన్నీ ఒక్కసారిగా యాక్టివేట్ అవుతాయి. బాధితులు ఇచ్చిన వివరాల ఆధారంగా వెంటనే అవసరమైన బ్యాంకులను సైబర్ క్రైం అధికారులు కాంటాక్టు చేస్తారు.

బాధితులు ఇచ్చిన బ్యాంకు ఖాతాను సైబర్ క్రైం అధికారులు బ్యాంకు అధికారులకు చెప్పి ఆ ఖాతాలో నుండి డబ్బు ఇతర ఖాతాల్లోకి బదిలీకాకుండా నిలిపేస్తారు. బాధితుడి ఖాతానుండి డబ్బు బదిలీని అనుమానస్పద లావాదేవీ’గా పరిగణించి వెంటనే బ్యాంకు ఖాతాను స్తంబింపచేస్తుంది. దాంతో అసలు డబ్బు బదిలీ కాకుండా లేదా పోయిన డబ్బు పోగా మిగిలిన డబ్బు పోకుండా బాధితుడి ఖాతాలోనే ఆగిపోతుంది. ఇదంతా ఎప్పుడు జరుగుతుందంటే బాధితులు గంటలోపు ఫిర్యాదుచేస్తే మాత్రమే. సైబర్ నేరాల్లో గోల్డెన్ అవర్ అంటే ఎంత కీలకమో బాధితులు అర్ధంచేసుకోవాలి. డబ్బు మోసపోయామని తెలియగానే బాధితులు ఏమిచేస్తారంటే ముందుగా బ్యాంకు అధికారులను సంప్రదిస్తారు. అయితే బ్యాంకు అధికారులు ఏమీ చేయలేరు. అందుకనే వాళ్ళు సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేయమని ఉచిత సలహా ఇచ్చి చేతులు దులిపేసుకుంటారు. బ్యాంకు నుండి బాధితులు సైబర్ క్రైం సెల్ ఎక్కడుందో తెలుసుకుని అక్కడికి వెళ్ళేటప్పటికి పుణ్యకాలం అంటే గోల్డెన్ అవర్ దాటిపోతుంది.

అందుకనే బాధితులు కంగారు పడకుండా వెంటనే పైన చెప్పిన నెంబర్ కు ముందు ఫోన్ చేయాలి. సైబర్ సెల్ లోని అధికారులు బాధితుల వివరాలను నోట్ చేసుకుని వెంటనే ప్రాసెస్ మొదలుపెట్టేస్తారు. ఒకవేళ ఫోన్ కలవకపోతే వెంటనే వెబ్ సైట్లో ఫిర్యాదు చేసినా చాలు అధికారులు వెంటనే యాక్షన్లోకి దిగేస్తారు. బాధితులిచ్చిన మొబైల్ నెంబర్ ఆధారంగా వాళ్ళే కాంటాక్టులోకి వస్తారు. దీనివల్ల ఏమవుతుందంటే టైం ఆదా అయి గోల్డెన్ అవర్లోపే ఫిర్యాదు చేసినట్లవుతుంది. దీని వల్ల బాధితులకు చాలా ఉపయోగముంటుంది. మోసపోయినట్లు గ్రహించిన గంటలోపే ఫిర్యాదు చేసిన బాధితుడు రవికి చాలావరకు న్యాయం జరిగింది. నేరగాళ్ళకు భయపడిన రవి సుమారు రు. 1.10 కోట్లు చెల్లించుకున్నాడు. తర్వాత తాను మోసపోయినట్లు గ్రహించగానే ముందుగా 1930కి ఫోన్ చేసి ఫిర్యాదు చేశాడు. దాంతో పైన చెప్పిన ఏజెన్సీలన్నీ రంగంలోకి దిగటంతో రవి బ్యాంకు ఖాతా స్తంబించిపోయింది. దాని ఫలితంగా కోటి రూపాయలు రవి ఖాతాలోనే నిలిచిపోయాయి. అంటే రవి ఖాతా నుండి నేరగాళ్ళు రు. 10 లక్షలు మాత్రమే తీసుకోగలిగారు.

రవి సకాలంలో ఫిర్యాదు చేయటంతోనే మొత్తం రు. 1.10 కోట్లకు బదులు కేవలం 10 లక్షల రూపాయలు మాత్రమే పోయాయి. మొత్తం రు. 1.10 కోట్లు పోవటం కన్నా పది లక్షల నష్టంతో బయటపడటంతో రవి చాలా సంతోషించాడు. ఇదే విషయమై తెలంగాణా సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ శిఖాగోయేల్ మాట్లాడుతు ‘అపరిచితులు ఫోన్ చేసి మనీల్యాండరింగులో ఇరుక్కున్నారని, డ్రగ్స్ రవాణాలో ఇరుక్కున్నారని ఫోన్ చేస్తే భయపడవద్ద’న్నారు. ‘నిజంగానే తమకు మనీల్యాండరింగ్, డ్రగ్స్ వ్యవహారాలతో సంబంధం ఉందా అని ఆలోచించాల’న్నారు. ‘నేరగాళ్ళు చెప్పింది విని బెదిరిపోకుండా కాస్త ఓపికగా ఆలోచిస్తే వచ్చిన ఫోన్ మోసగాళ్ళ నుండి అని అర్ధమైపోతుంద’ని చెప్పారు. దాంతో ఆ ఫోన్ కు స్పందించ వద్దని సూచించారు. ‘ఒకవేళ రిపీటెడ్ గా ఫోన్లు వస్తుంటే తమకు ఫిర్యాదు చేయాల’ని చెప్పారు. ‘మోసపోయిన తర్వాత 1930కి ఫిర్యాదు చేయటం కన్నా అసలు డబ్బులు పంపకపోవటమే మంచిద’న్నారు. ‘ఒకవేళ బెదిరిపోయి డబ్బు పంపిన తర్వాత మోసపోయామని గ్రహించిన గంటలోపు తమకు ఫిర్యాదు చేస్తే చాలావరకు ఉపయోగం ఉంటుందని బాధితులు గ్రహించాల’ని సూచించారు. తమ సెల్, పైన చెప్పిన ఏజెన్సీలన్నీ బాధితులకు సాయం చేయటం కోసమే 24 గంటలూ పనిచేస్తుంటాయన్న విషయాన్ని శిఖా గోయెల్ చెప్పారు.

Read More
Next Story