గురుకుల విద్యార్థుల మెనూలో చేపలు
x
Fish Curry for students

గురుకుల విద్యార్థుల మెనూలో చేపలు

మధ్యాహ్న భోజనం పథకంలో...


గురుకుల విద్యార్థులకు మంత్రి పొన్నం ప్రభాకర్ శుభవార్త చెప్పారు. గురుకుల విద్యార్థుల మధ్యాహ్న భోజన మెనూలో చేపలు చేరాయి. ఇప్పటివరకు ఈ మెనూలో మటన్ , చికెన్ ఉండేది. ఈ రెండింటితో బాటు చేపలు చేర్చాలని నిర్ణయించినట్టు ఆయన తెలిపారు. శనివారం హుస్నాబాద్ లో మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి పర్యటించారు. ఈ సందర్బంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. గురుకుల విద్యార్థుల మధ్యాహ్నభోజన పధకంలో చేపల కూరతో భోజనాన్ని చేర్చాలని మత్స్య శాఖా మంత్రి వాకిటి శ్రీహరి తన దృష్టికి తీసుకొచ్చారన్నారు.

చేప పిల్లల పెంపకంలో గత ప్రభుత్వం పొరపాట్లు చేసిందని, చేప పిల్లల సైజు చిన్నగా ఉండటంతో కొంత ఇబ్బందులొచ్చాయని ఆయన అన్నారు. హుస్నాబాద్ కు 3 లక్షల చేప పిల్లలు ఇచ్చామని, మరో 60 వేల చేప పిల్లలు తెప్పించాలని మంత్రి శ్రీహరికి వినతి చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో పశు సంపద పెంపుకు గోపాల మిత్రలు విశేష కృషి చేసారని మంత్రి పొన్నం తెలిపారు. వారి సమస్య పరిష్కారానికి మంత్రి శ్రీహరి కృషి చేయాలని పొన్నం ప్రభాకర్ కోరారు.

హుస్నాబాద్ లో నిర్మించే వెటర్నరీ హస్పిటల్ నూతన భవనం అన్ని సౌకర్యాలతో నిర్మించాలని మంత్రి శ్రీహరిని పొన్నం కోరారు. అసంపూర్తిగా ఉన్న చేపల మార్కెట్ ను పూర్తి చేయాలని ఆయన మంత్రి వాకిటి శ్రీహరిని కోరారు. హుస్నాబాద్ లో వెటర్నరీ పోస్టు ను వెంటనే భర్తీ చేయాలని కోరారు. ఎల్లమ్మ చెరువును సందర్శించడానికి వచ్చే టూరిజం పర్యాటకులు అక్కడే చేపలు కొనుక్కోవడానికి చేపలమార్కెట్ ఉండాలని మంత్రి అభిప్రాయపడ్డారు. అక్కన్నపేట ఫోర్ లేన్ రోడ్డు కోసం 50 కోట్లు మంజూరయ్యాయని చెప్పారు.

Read More
Next Story