కేసీఆర్ విసిరిన రాయి ఆయనకే తగులుతోందా??
x

కేసీఆర్ విసిరిన రాయి ఆయనకే తగులుతోందా??

మనం పైకి విసిరిన రాయి తిరిగొచ్చి మనకే తగలడం అంటే ఇదేనేమో. కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు ఫిరాయింపులను బాగా ప్రోత్సహించారు.


మనం పైకి విసిరిన రాయి తిరిగొచ్చి మనకే తగలడం అంటే ఇదేనేమో. కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు ఫిరాయింపులను బాగా ప్రోత్సహించారు. ప్రతిపక్షాలను బలహీన పరిచి, కొన్ని నియోజకవర్గాల్లో ఆయ పార్టీలకు పోటీలో నిలబెట్టేందుకు సరైన అభ్యర్థి కూడా లేకుండా చేసి రాష్ట్రంలో తిరుగులేని శక్తిగా ఎదిగారు.

సరిగ్గా ఇప్పుడు అదే పరిస్థితి బీఆర్ఎస్ పార్టీకి ఎదురైనట్టు కనిపిస్తోంది. పార్లమెంటు ఎన్నికల వేళ అభ్యర్థులే కరువైన పరిస్థితి నెలకొంది. ఓవైపు 2023 అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన ఎమ్మేల్యేలు, మరోవైపు సిట్టింగ్ ఎంపీలు ఒక్కొక్కరిగా పార్టీని వీడడం శ్రేణులను కలవర పెడుతోంది.

ఐదుగురు సిట్టింగ్ ఎంపీలు ఒకరి తర్వాత ఒకరు రాజీనామా చేసి బీజేపీ, కాంగ్రెస్ బాటపట్టడం కారుకి భారీ కుదుపు అనే చెప్పవచ్చు. ముందుగా జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ బీజేపీలో చేరారు. ఆయన అదే నియోజకవర్గ బీజేపీ అభ్యర్ధిగా నిలబడనున్నారు. నాగర్ కర్నూల్ ఎంపీ పోతుగంటి రాములు బీజేపీలో చేరి కొడుకుకి టికెట్ ఇప్పించుకున్నారు. పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ నేత, వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోగా.. ఈరోజు చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి కూడా బీఆర్ఎస్ కి రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరారు.

కాగా, పలు సందర్భాల్లో కేసీఆర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం త్వరలోనే కూలిపోతుందని ఎద్దేవా చేశారు. భవిష్యత్తులో ఏమైనా జరగొచ్చని పార్టీ శ్రేణుల్లో జోష్ నింపారు. దీంతో పదునైన రాజకీయ వ్యూహాలు రచించే సామర్థ్యం ఉన్న కేసీఆర్ ఎలాగైనా బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తారని ఒకానొక దశలో అనుమానాలు వ్యక్తం అయ్యాయి.

కానీ, వారి పార్టీ నుండే ఎమ్మేల్యేలు, ఎంపీలు జంప్ అవడం కార్యకర్తలను ఆందోళనకి గురి చేస్తోంది. మరోవైపు అవినీతి చేశారంటూ నేతలపై కేసులు పెరగడంతో పార్టీ బలహీన పడుతుందేమో అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఇదిలా ఉండగా, లిక్కర్ కేసులో కవిత అరెస్టుతో సింపతీ రాకపోగా మరింత డ్యామేజ్ చేసింది. ఎన్నికల స్టంట్ అని, బీజేపీ - బీఆర్ఎస్ ఒకటే అని ఎత్తిచూపడంలో కాంగ్రెస్ విజయం సాధించింది. దీంతో పార్లమెంటు ఎన్నికల్లో కారు మూడో స్థానానికి పడిపోవచ్చని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు .

Read More
Next Story