
కవితకు నెటిజన్ల ఐదు ప్రశ్నలు
కవిత హెచ్చరికలకు రేవంత్ ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో తెలీదుకాని ఐదుగురు నెటిజన్లు మాత్రం చాలా ఘాటుగా స్పందించారు
సోషల్ మీడియాలో నెటిజన్లు చాలామంది ట్రోలింగులకు మాత్రమే పరిమితమవుతుంటారు. అయితే కొందరు నెటిజన్లు నేతలను ఉద్దేశించి సూటిగా వేస్తున్న ప్రశ్నలు సదరు నేతలను బాగా ఇబ్బందుల్లో పడేస్తున్నాయి. ఇపుడిదంతా ఎందుకంటే(Telangana Jagruthi) జాగృతి అద్యక్షురాలు కల్వకుంట్ల కవితను ఉద్దేశించి ఐదుగురు నెటిజన్లు సూటిగా ఐదు ప్రశ్నలు సంధించారు. ఆ ప్రశ్నలు చాలామందిని ఆలోచింపచేస్తున్నాయనటంలో సందేహంలేదు. ఇంతకీ విషయం ఏమిటంటే ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో అసువులుబాసిన శ్రీకాంతాచారి విగ్రహానికి కవిత(Kavitha) బుధవారం నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి (Revanth)ఎనుముల రేవంత్ రెడ్డిని ఉద్దేశించి కొన్ని డిమాండ్లు, కొన్ని హెచ్చరికలు చేశారు.
ప్రభుత్వ పథకాలకు ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ అనే పేర్లు పెడుతున్న రేవంత్ ప్రభుత్వానికి తెలంగాణ ఉద్యమంలో అమరులైన వీరులపేర్లు ఎందుకు గుర్తుకురావటంలేదని సూటిగా ప్రశ్నించారు. 2023 ఎన్నికల సమయంలో అమరుల కుటుంబాలకు గుర్తింపుకార్డులు, 250 గజాల ఇంటి స్ధలం, పెన్షన్లు ఇస్తామన్న హామీ ఏమైందని నిలదీశారు. ఇచ్చిన హామీలను డిసెంబర్ 9వ తేదీలోగా నెరవేర్చకపోతే తర్వాత జాగృతి ఆధ్వర్యంలో ప్రభుత్వ భూములను ఆక్రమించుకుని జాగృతి జెండాలు పాతుతుందని వార్నింగ్ ఇచ్చారు. ప్రభుత్వ పథకాలకు శ్రీకాంతాచారి లాంటి అమరుల పేర్లు పెట్టాలని డిమాండ్ చేశారు. 1200 మంది ప్రాణత్యాగం చేస్తేనే ప్రత్యేక తెలంగాణ వచ్చిందన్న విషయాన్ని రేవంత్ ప్రభుత్వం గుర్తుంచుకోవాలని చెప్పారు.
కవిత హెచ్చరికలకు రేవంత్ ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో తెలీదుకాని ఐదుగురు నెటిజన్లు మాత్రం చాలా ఘాటుగా స్పందించటం గమనార్హం.
1.కే. ప్రసాదరావు అనే నెటిజన్ మాట్లాడుతు ‘‘అప్పుడు పవర్లో మీరే కదా ఉన్నారు పథకాలకు అమరుల పేర్లు పెట్టాలని, పెన్షన్లు, గుర్తింపుకార్డులు ఇవ్వాలని మీ ఫాదర్, మీ బ్రదర్ కు ఎందుకు చెప్పలేదు మ్యాడమ్’’ అని నిలదీశాడు.
2.నాగరాజు స్పందిస్తు ‘‘రేవంత్ రెడ్డి గారి భూమి కాదు అక్రమంగా సంపాదించిన మీ అందరి భూముల్లో జెండాలు పాతి భూమిలేని వారందరికీ పంచండి’’ అని సలహా ఇచ్చాడు.
3.నల్లగంటి అంజయ్య మాట్లాడుతు ‘‘మీ భూములు అమ్మితే బంగారు కాదు వజ్రాలు అవుతుంది’’ అని ఎద్దేవా చేశాడు.
4.కలువల శ్రీనివాసరెడ్డి మాట్లాడుతు ‘‘అధికారంలో ఉన్నపుడు ఏదీ గుర్తుకురాదు, అధికారం పోయిన తర్వాత, పార్టీ నుండి గెంటేసిన తర్వాత కక్షపూరితంగా మాట్లాడుతున్నారు’’ అని అన్నారు. ‘‘నిజామాబాదులో ఎంపీగా మీకు అవకాశం వచ్చినపుడు ఎంపీ టికెట్టును అమరవీరుల కుటుంబాల్లో ఎవరికో ఒకరికి ఇవ్వాలని ఎందుకు సూచించలేదు’’ అని నిలదీశాడు. ‘‘మంత్రి పదవి కావాలనే ఆశతో ఎంఎల్సీ తీసుకున్నపుడు కూడా ఈ అవకాశాన్ని అమరుల కుటుంబాలకు ఇప్పించాలన్న ఆలోచన ఎందుకు రాలేదు’’ అని ప్రశ్నించాడు. ‘‘అధికారంలో ఉన్నపుడు దోచుకోవాలన్న ఆలోచన తప్ప ఉద్యమకారుల గురించి కాని బీసీ, బడుగుల గురించి ఒక్కరోజు కూడా కల్వకుంట్ల కవితగా స్పందించలేదు’’ అని నిష్టూరాలాడాడు.
5.ఇ. రాంబాబు అనే వ్యక్తి మాట్లాడుతు ‘‘1200 మంది బిడ్డల ఆత్మబలిదానాల వల్ల తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే, మరి బీఆర్ఎస్ వాళ్ళు మీ అయ్యవల్లే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని గొప్పలు చెప్పుకోవటం ఏమిటి సిగ్గులేకుండా’’ అని ఘాటుగా నిలదీశాడు. ‘‘పది సంవత్సరాలు అధికారంలో ఉన్న మీ అయ్య ఉద్యమకారులకు ఏమి న్యాయం చేసిండో ఒకసారి బహిరంగచర్చ పెట్టి పత్రికాముఖంగా ప్రకటిస్తే తెలంగాణ ప్రజలు మీ బాగోతాన్ని వింటారు’’ అని సలహా ఇచ్చాడు. ‘‘ఉద్యమంలో నష్టపోయింది ఆత్మబలిదానాల కుటుంబాలైతే లాభపడింది మీ కుటుంబం అంతేనా ? శ్రీకాంతాచారి కుటుంబానికి బీఆర్ఎస్ చేసిన మేలు ఏమిటి ? ఆ కుటుంబాన్ని మీ పార్టీ ఏ విధంగా ఆదుకున్నదో చెప్పాలి’’ అని గట్టిగా నిలదీశాడు. ‘‘అమరుల కుటుంబాలకు బీఆర్ఎస్ చేసిన మేలు ఏమిటో ప్రజలకు నిజాలు చెప్పి పుణ్యం కట్టుకోవాలని’’ అని సలహా కూడా ఇచ్చాడు రాంబాబు. నెటిజన్లు వేసిన పై ఐదు ప్రశ్నలకు కల్వకుంట్ల కవిత సమాధానం ఇస్తారా ?

