
11 జిల్లాల్లో ఫ్లాష్ ఫ్లడ్స్ ?
గడచిన 24 గంటల్లో కామారెడ్డి, మెదక్ జిల్లాల్లోని పలుప్రాంతాల్లో కుంభవృష్టి దెబ్బకు అనేక ప్రాంతాలు జలమయమైపోయాయి
రాబోయే 24 గంటల్లో తెలంగాణలోని 11 జిల్లాల్లో ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చే అవకాశముందని వాతావరణ శాఖ నిపుణులు హెచ్చరిస్తున్నారు. గడచిన 24 గంటల్లో కామారెడ్డి(Kamareddy), మెదక్(Medak) జిల్లాల్లోని పలుప్రాంతాల్లో కుంభవృష్టి(Heavy Rains) దెబ్బకు అనేక ప్రాంతాలు జలమయమైపోయాయి. బాధితులను సహాయకచర్యలు చేపట్టేందుకు ఎన్డీఆర్ఎఫ్(NDRF), ఎస్డీఆర్ఎఫ్(SDRF) బృందాలకు తోడు స్ధానిక పోలీసులు రంగంలోకి దిగినా పెద్దగా ఉపయోగాలు కనబడటంలేదు. ఎందుకంటే జిల్లాల్లోని చాలా ప్రాంతాలు ముఖ్యంగా లోతట్టుప్రాంతాలు భారీవర్షాలకు ముణిగిపోయాయి. లోతట్టు ప్రాంతాలో నివసిస్తున్న జనాలందరు సురక్షిత ప్రాంతాలకు తరలివెళుతున్నారు. కామారెడ్డి, మెదక్ జిల్లాలోని చాలా ప్రాంతాల్లో గడచిన 24 గంటల్లో సగటున వర్షపాతం 400 మిల్లీమీటర్లుగా నమోదైంది. పై రెండు జిల్లాల చరిత్రలో 24 గంటల్లో ఎప్పుడూ ఈ స్ధాయిలో కుంభవృష్టిపడింది లేదు.
48 గంటలుగా వాతావరణంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావం కారణంగా విపరీతమైన వర్షాలు కురుస్తున్నాయి. రోడ్లు, చెరువులు, కాల్వలు ఏకమైపోయాయి. రోడ్లు చాలాచోట్ల కొట్టుకుపోయాయి. పొలాల్లోకి భారీఎత్తున వర్షపు నీరు చేరటంతో వరి, వేరుసెనగ, పత్తి పంటలు చాలా ప్రాంతాల్లో ముణిగిపోయాయి. కామారెడ్డి, నిమాజాబాద్, నిర్మల్, జగిత్యల్, అసిఫాబాద్, మెదక్, ములుగు, సిద్ధిపేట్, హన్మకొండ, సంగారెడ్డి, వికారాబాద్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు ఫ్లాష్ ఫ్లడ్ హెచ్చరికలు జారీ అయ్యాయి. మరో 14 జిల్లాలకు ఎల్లో, ఆరెంజ్ హెచ్చరికలు కూడా జారీ అయ్యాయి. వర్షాలు ఏ స్ధాయిలో కురుస్తున్నాయంటే ఈరోజు ఉదయం కామారెడ్డి, మెదక్ జిల్లాల్లో హెలికాప్టర్లో పర్యటించాలని అనుకున్న ఎనుముల రేవంత్ రెడ్డి పర్యటన కూడా రద్దయ్యింది. వర్షాల కారణంగా దెబ్బతిన్న ప్రాంతాల్లో రేవంత్ ఏరియల్ సర్వే చేయాలని అనుకున్నారు. అయితే ఎడతెరిపిలేకుండా కురుస్తున్న భారీవర్షాల కారణంగా వాతావరణం అనుకూలించక ఏరియల్ సర్వేను రేవంత్ రద్దుచేసుకున్నారు.
కామారెడ్డి, మెదక్ లో కుంభవృష్టి
చెరువుగా మారిపోయిన కామారెడ్డి జిల్లాలోని లోతట్టు ప్రాంతాలు. లోతట్టు ప్రాంతాల్లో పరిస్ధితి ఒకలాగుంటే పట్టణాల్లోని పరిస్ధితులు మరోరకంగా ఉన్నాయి. చాలా ప్రాంతాల్లో వర్షాల కారణంగా మోకాలి లోతు ముణగిపోయాయి. మరికొన్నిచోట్ల రోడ్లపైన, కాలనీల్లో నడుములోతు నీళ్లుచేరాయి. కనీవినీ ఎరుగని వర్షం కురుస్తుండటంతో జన జీవనం అతలాకుతలమైపోతోంది. గడచిన 24 గంటలుగా కురుస్తున్న వర్షాలు క్లౌడ్ బరస్టును మించిపోయాయి. కామారెడ్డి చరిత్రలోనే ఇలాంటి వర్షాలు లేవు. రెండురోజుల్లో 400 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని కామారెడ్డి కలెక్టరేట్ ప్రకటించింది. ఊరిలోకి నీళ్ళొచ్చాయా లేకపోతే నీళ్ళల్లోనే ఊరు నిర్మించుకున్నారా అన్నట్లుగా తయారైంది పరిస్ధితి. దోమకొండ, పిట్ల, నాగిరెడ్డిపేట, ఎల్లారెడ్డి, జుక్కల్ ప్రాంతాల్లోని చెరువులు పొంగి పొర్లుతున్నాయి. ఎన్డీఆర్ఎప్, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాల్లో చిక్కుకుపోయిన 300 మందిని రక్షించి సహాయ శిబిరాలకు తరలించారు.
కామారెడ్డి పట్టణంలోని హౌసింగ్ బోర్డు కాలనీలోని పదుల సంఖ్యలో కార్లు కొట్టుకుపోయాయి. చాలా ఏరియాల్లో కరెంటులేదు. కామారెడ్డిలోని చాలా ఏరియాల్లో ఇళ్ళల్లోకి నీళ్ళు వచ్చేస్తుండటంతో జనాలు ఇళ్ళ పైకప్పు మీదకు ఎక్కేసి సహాయంకోసం ఎదురు చూస్తున్నారు. బొగ్గుగుడిసె వాగు, తిమ్మారెడ్డి వాగులో చిక్కుకున్న కొందరిని సహాయక సిబ్బంది రక్షించారు. పట్టణంలో రాజంపేట ఏరియాలోని ఒక ఇంటి గోడ కూలిపోయి ఒకమనిషి చనిపోయాడు. అశోక్ నగర్లో రైల్వేట్రాక్ పైకి నీళ్ళు చేరటంతో ట్రాక్ మొత్తం దెబ్బతిన్నది. ఈలైనులో వెళ్ళే కొన్ని రైళ్ళను దారిమళ్ళించి, మరికొన్నింటిని రద్దుచేశారు. కామారెడ్డి—సికింద్రాబాద్ రైళ్ళును దారిమళ్లించారు.
కామారెడ్డి కలెక్టరేట్ లో హెల్ప్ లైన్ ఏర్పాటు చేసి పరిస్ధితిని ఉన్నతాధికారులు సమీక్షిస్తున్నారు. మరో మూడురోజులు తెలంగాణ వ్యాప్తంగా భారీవర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. మొత్తం 11 జిల్లాలకు రెడ్ అలర్డ్ జారీచేసింది. 25 జిల్లాలకు ఎల్లో అలర్ట్. ఏరియల్ సర్వేద్వారా వివిధ జిల్లాల్లోని పరిస్ధితిని రేవంత్ సమీక్షించిస్తున్నారు. కామారెడ్డి జిల్లాలోని నిజాంసాగర్ ప్రాజెక్టుకు వరద పోటెత్తింది. మెదక్ జిల్లాలో కూడా ఇలాంటి పరిస్ధితే ఉందని సమాచారం. అందుకనే ఈరెండు జిల్లాల్లోని స్కూళ్ళకు ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. నిజామాబాద్ జిల్లాకేంద్రంలో కుంభవృష్టి పడుతోంది. కామారెడ్డిలో పలు కాలనీలు నీళ్ళ మధ్యలో ఇరుక్కుపోయాయి. కామారెడ్డిలోని ఐదు ప్రాంతాల్లో 200 మిల్లీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైంది. కామారెడ్డి, మెదక్ జిల్లాల్లో 170 పునరావాస కేంద్రాలను ప్రభుత్వ ఏర్పాటుచేసింది. మెదక్ జిల్లాలోని బాధితులను ఆదుకునేందుకు 100 ఆర్మీ దళాలు రంగంలోకి దిగాయి. పై రెండు జిల్లాల్లో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ దళాలు అవిశ్రాంతిగా సహాయచర్యలు అందించటంలో నిమగ్నమయ్యాయి.
తెలంగాణ యూనివర్సిటి పరిదిలోని అన్నీకాలేజీల్లో పరీక్షలను ప్రభుత్వం రద్దుచేసింది. భద్రాద్రి జిల్లాల్లో భారీవర్షాల కారణంగా సింగరేణి బొగ్గుతవ్వకాలు నిలిచిపోయాయి. కామారెడ్డి జిల్లాలోని రాజంపేట మండలం ఆరుగొండలో అత్యధికంగా 44 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. కామారెడ్డి జిల్లా కేంద్రంలో 30 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇపుడు కూడా కామారెడ్డి, మెదక్ జిల్లాలో కుంభవృష్టి కురుస్తున్నది.