కృష్ణమ్మకు జల కళ, నాగార్జునసాగర్ ఆయకట్టు రైతుల సంతోషం
x
శ్రీశైలం డ్యాం నుంచి వరదనీటి ప్రవాహం

కృష్ణమ్మకు జల కళ, నాగార్జునసాగర్ ఆయకట్టు రైతుల సంతోషం

కృష్ణమ్మకు జలకళతో నాగార్జునసాగర్ ఆయకట్టు రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. శ్రీశైలం జలాశయం నిండటంతో వస్తున్న నీటిని నాగార్జున సాగర్‌లోకి విడుదల చేశారు.


కృష్ణానదీ ఎగువ పరివాహక ప్రాంతంలో భారీవర్షాలు కురుస్తుండటంతో కృష్ణమ్మకు జలకళ సంతరించుకుంది. కర్ణాటక రాష్ట్రంలో విస్తారంగా కురుస్తున్న వర్షాలతో ఆల్ మట్టి, తుంగభద్ర డ్యాంల నుంచి దిగువకు వరదనీరు వదులుతున్నారు. దీంతో శ్రీశైలం జలాశయం పూర్తిగా నిండింది. ఎగువ నుంచి వస్తున్న భారీ వరదనీటిని దిగువకు వదులుతుండటంతో నాగార్జునసాగర్ జలాశయం నీటిమట్టం పెరుగుతోంది.

- నాగార్జునసాగర్ జలాశయ నీటిమట్టం గురువారం మధ్యాహ్నం సమయానికి 533 అడుగులకు చేరింది. ఈ ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా వరదనీటి రాకతో జలాశయ నీటిమట్టం పెరుగుతుంది.
- ఎన్నెస్పీలో 312.5 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం కాగా ప్రస్థుతం ఈ జలాశయంలో 170 టీఎంసీల నీరుంది. శ్రీశైలం నుంచి 2,08,917 క్యూసెక్కుల నీరు వస్తుండగా, 8,344 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.

ఎగువ నుంచి భారీగా వరదనీరు
శ్రీశైలం డ్యాం వద్ద 10 గేట్లు ఎత్తి 12 అడుగల మేర వరదనీటిని వదులుతున్నారు. శ్రీశైలం డ్యాంలోకి ఇన్ ఫ్లో 3,42,026 క్యూసెక్కులు కాగా 3,78,172 క్యూసెక్కుల నీటిని కిందకు వదులుతున్నారు. శ్రీశైలం జలాశయం నీటి మట్టం గురువారం 884.50 అడుగులకు చేరింది. శ్రీశైలం కుడి, ఎడమ జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు శ్రీశైలం జలాశయం వద్ద గురువారం కృష్ణమ్మకు జలహారతి ఇచ్చారు.

సాగర్ నిండితే పులిచింతలకు నీరు
పులిచింతల ప్రాజెక్టు జలాశయ నీటిమట్టం 103.71 అడుగులుంది. 1.11టీఎంసీల నీరు జలాశయంలో నిల్వ ఉంది. నాగార్జునసాగర్ ప్రాజెక్టు నిండితే గేట్లు ఎత్తి పులిచింతలకు వరదనీటిని వదులుతారు. జూరాల ఎగువ ప్రాజెక్టులకు 2.85 లక్షల క్యూసెక్కులు, నారాయణపూర్‌లో 3.30 లక్షల క్యూసెక్కులు, ఆల్మట్టికి 3.41 లక్షల క్యూసెక్కుల మేర వరదనీరు వస్తుంది. పరీవాహక ప్రాంతాల్లో కొనసాగుతున్న వర్షాల దృష్ట్యా వరదనీరు మరింతగా పెరిగే అవకాశం ఉంది.

కృష్ణమ్మకు చంద్రబాబు జలహారతి
శ్రీశైలం ప్రాజెక్టు వద్ద గురువారం ముఖ్యమంత్రి చంద్రబాబు కృష్ణమ్మకు జలహారతి ఇచ్చారు. కర్నూలు జిల్లా లోని తాగునీటి ఎత్తిపోతల పథకాల నిర్మాణానికి నీటిపారుదల శాఖకు నిధులు విడుదల చేసి రైతాంగాన్ని ఆదుకోవాలని కోరుతూ శ్రీశైలం పర్యటనకు వచ్చిన ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుకు కర్నూలు పార్లమెంట్ తెలుగుదేశంపార్టీ అధ్యక్షులు పాలకుర్తి తిక్కారెడ్డి వినతిపత్రం అందజేశారు.

సాగర్ ఎడమకాల్వకు రేపు నీటి విడుదల
నాగార్జునసాగర్ జలాశయంలోకి వరదనీరు భారీగా చేరుతుండటంతో శుక్రవారం సాయంత్రం 4 గంటలకు ఎడమకాల్వ నుంచి నీటిని విడుదల చేస్తామని రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చేసిన వినతిపై ఉత్తమ్ కుమార్ రెడ్డి నీటి విడుదలకు నిర్ణయం తీసుకున్నారు.


Read More
Next Story