మూడు కాలనీల్లో ముంపు సమస్య మటుమాయం
x
నాలా ఆక్రమణల తొలగిస్తున్న జేసీబీ

మూడు కాలనీల్లో ముంపు సమస్య మటుమాయం

హైదరాబాద్ నగరంలో భారీవర్షాలతో వరదముంపు ఏర్పడిన మూడు కాలనీల్లో హైడ్రా రంగంలోకి దిగి నాలాలను విస్తరించింది.


గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని మేడ్చ‌ల్ - మ‌ల్కాజిగిరి జిల్లా కూక‌ట్‌ప‌ల్లి మండ‌లంలోని ఏవీబీపురంలో నాలా ఆక్ర‌మ‌ణ‌ల‌ను హైడ్రా తొల‌గించింది.ప‌రికి చెరువు నుంచి కూక‌ట్‌ప‌ల్లి నాలాలో క‌లిసిన దీని వెడ‌ల్పు 10 మీట‌ర్లు కాగా, 3 మీట‌ర్ల‌కు పైగా నాలా భూమి క‌బ్జాకు గురైంది. ఈ నాలాపైన రెండు ష‌ట్ట‌ర్లు వెలిశాయి. నాలానే కాకుండా మ్యాన్‌హోల్‌పైన కూడా నిర్మాణాలు చేప‌ట్టారు.నాలా ఆక్ర‌మ‌ణ‌తో సాయిబాబాకాల‌నీ, హెచ్ ఏ ఎల్ కాల‌నీ, మైత్రిన‌గ‌ర్‌లో వ‌ర‌ద ముంచెత్తుతోంది. చినుకు పడితే చాలు పై నుంచి వ‌చ్చే వ‌ర‌ద సాఫీగా సాగ‌క‌ త‌మ ప్రాంతాలు నీట మునుగుతున్నాయ‌ని కాల‌నీవాసులు ఫిర్యాదు చేయ‌డంతో జ‌ల‌మండ‌లి అధికారులు కూడా ప‌రిశీలించారు. జ‌ల‌మండ‌లి అధికారుల నివేదిక మేర‌కు హైడ్రా ఈ కూల్చివేత‌లు చేప‌ట్టింది. దీంతో కాల‌నీవాసులు హ‌ర్షం వ్య‌క్తం చేశారు.


మా కాలనీలకు వ‌ర‌ద ముప్పు త‌ప్పించండి
నగరంలో బారీ వ‌ర్షాలు కురుస్తున్న వేళ‌ నాలాలు, చెరువుల క‌బ్జాల‌పై ఫిర్యాదుల సంఖ్య పెరిగింది. కాల‌నీల‌ను, ర‌హ‌దారుల‌ను వ‌ర‌ద ముంచెత్త‌డానికి కార‌ణ‌మవుతున్న క‌బ్జాల‌ను వెంట‌నే తొల‌గించాల‌ని హైడ్రాకు ఇచ్చిన ఫిర్యాదులో పలు కాలనీల వాసులు పేర్కొన్నారు. గొలుసుక‌ట్టు చెరువుల‌ను పున‌రుద్ధ‌రించ‌డం ద్వారా వ‌ర‌ద ముప్పును చాలావ‌ర‌కు త‌గ్గించ‌వ‌చ్చున‌ని చెబుతున్నారు.



హైడ్రా ప్ర‌జావాణికి 39 ఫిర్యాదులు

హైడ్రా ప్ర‌జావాణికి మొత్తం 39 ఫిర్యాదులంద‌గా ఇందులో నాలాలు, చెరువుల క‌బ్జాలపైనే ఎక్కువ సంఖ్య‌లో ఉన్నాయ‌. ఇదే స‌మ‌యంలో పార్కులు, ప్ర‌భుత్వ భూములు, ర‌హ‌దారుల ఆక్ర‌మ‌ణ‌ల‌పైనా ఫిర్యాదులందాయి.సంతోష్‌న‌గ‌ర్ డివిజ‌న్‌లోని ఐఎస్ స‌ద‌న్ ప్రాంతాన్ని వ‌ర‌ద నీరు ముంచెత్తుతోంద‌ని స్థానికుల నుంచి ఫిర్యాదు అందింది. లంగర్‌హౌస్‌లోని బాపూఘాట్‌, టోలీచౌక్ వంతెన ప‌రిస‌రాల్లో వ‌ర్షం వ‌స్తే ఇబ్బందిగా మారింద‌ని పేర్కొన్నారు. సోమాజిగూడ య‌శోధ ఆసుప‌త్రి ప‌రిస‌రాల్లో నీరు నిలిచిపోవ‌డంతో పైన ఉన్న పంజాగుట్ట ప్రాంతంలోని ప‌లు కాల‌నీలకు ఇబ్బందిగా ప‌రిణ‌మించింద‌ని పేర్కొన్నారు.జూబ్లీ హిల్స్‌లోని సీవీఆర్ న్యూస్ వ‌ద్ద వ‌ర‌ద నీరు నిలుస్తుందని.. ప‌క్క‌నే ఉన్న కేబీఆర్ పార్కులోకి మ‌ళ్లిస్తే స‌మ‌స్య ప‌రిష్కార‌మవుతుంద‌ని జ‌ర్న‌లిస్టు కాల‌నీ ప్ర‌తినిధులు ఫిర్యాదు చేశారు.

ఎన్నెన్నో ఫిర్యాదులు
నాచారం పారిశ్రామిక వాడ‌లో సింగం చెరువు తండా నుంచి సింగం చెరువులోకి వెళ్లే నాలాను క‌బ్జా చేయ‌డంతో వ‌ర‌ద త‌మ నివాసాల‌ను ముంచెత్తుతోంద‌ని అక్క‌డి నివాసితులు హైడ్రాకు ఫిర్యాదు చేశారు. గ్రామ రికార్డుల మేర‌కు స‌ర్వే చేసి నాలా క‌బ్జాల‌ను తొల‌గించాల‌ని విజ్ఞ‌ప్తి చేశారు.
-మేడ్చ‌ల్ - మ‌ల్కాజిగిరి జిల్లా మేడిప‌ల్లి మండ‌లం ప‌ర్వ‌తా పూర్ సాలార్‌జంగ్ కంచ్‌లోని వివిధ స‌ర్వే నంబ‌ర్ల‌లో 38 ఎక‌రాల వ‌ర‌కూ ప్ర‌భుత్వ సీలింగ్ భూములుంటే.. అక్క‌డ ఆక్ర‌మ‌ణ‌ల ప‌ర్వం కొన‌సాగుతోంద‌ని.. హైడ్రా వెంట‌నే అక్క‌డ ప‌రిశీలించి క‌బ్జాల‌ను ఆపాల‌ని స్థానిక నివాసులు ఫిర్యాదు చేశారు.
- కాప్రా, ఈసీఐఎల్ క్రాస్‌రోడ్స్ వంపుగూడ‌లోని గోపాల్‌రెడ్డి న‌గ‌ర్ లే ఔట్ హుడా అనుమ‌తి పొందింది. 30 ఎక‌రాల‌లో వేసిన లే ఔట్ ప్ర‌కారం పార్కులు, ప్ర‌జావ‌స‌రాలు, ర‌హ‌దారుల‌కు ఉద్దేశించిన స్థ‌లాలను మళ్లీ ప్లాట్లుగా అమ్ముకుంటున్నార‌ని గోపాల్‌రెడ్డి న‌గ‌ర్ వెల్ఫేర్ సొసైటీ ఫిర్యాదు చేసింది. గ‌తంలో లే ఔట్ వేసిన వారి వార‌సులే ఈ క‌బ్జాల‌కు పాల్ప‌డుతున్నార‌ని పేర్కొన్నారు.
- కుత్బుల్లాపూర్ మండ‌లం జ‌గద్గిరిగుట్ట‌లోని శ్రీ ల‌క్ష్మీవెంక‌టేశ్వ‌ర స్వామి దేవ‌స్థానానికి చెందిన రెండున్న‌ర ఎక‌రాల భూమిని స్థానిక నాయ‌కురాలు క‌బ్జా చేసిందంటూ.. అక్క‌డి నివాసితులు హైడ్రాకు ఫిర్యాదు చేశారు. వెంట‌నే ఆ భూమిని కాపాడి దేవ‌స్థానానికి అప్ప‌గించాల‌ని కోరారు.



మైత్రివ‌నం వ‌ద్ద వ‌ర‌ద ఉధృతిని ఆపేదెలా?

అమీర్‌పేట మెట్రో స్టేష‌న్, మైత్రివ‌నం వ‌ద్ద వ‌ర‌ద ఉధృతిని ఆపేదెలా అనే అంశంపై హైడ్రా దృష్టి పెట్టింది. ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డిగారి సూచ‌న‌ల మేర‌కు శాశ్వ‌త ప‌రిష్కారానికి ప్ర‌త్యేకంగా ట్రంకు లైను ఏర్పాటు చేయ‌డంతో పాటు తాత్కాలిక ఉప‌శ‌మ‌నానికి ఎలాంటి చ‌ర్య‌లు చేప‌ట్టాల‌నే అంశంపై హైడ్రా క‌స‌ర‌త్తు చేస్తోంది. ఈ క్ర‌మంలో హైడ్రా క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్‌ సోమ‌వారం అమీర్‌పేట మైత్రివ‌నం ప‌రిస‌రాల్లో వ‌ర‌ద కాలువ‌ల‌కు ఉన్న ఆటంకాల‌ను ప‌రిశీలించారు. అనంత‌రం కృష్ణాకాంత్ పార్కులోని చెరువును, వ‌ర‌ద కాలువ‌ల‌ను త‌నిఖీ చేశారు. జూబ్లీహిల్స్ రోడ్డు నంబ‌రు 10, వెంక‌ట‌గిరి, ర‌హ్మ‌త్‌న‌గ‌ర్‌, యూసుఫ్‌గూడ ప్రాంతాల నుంచి కృష్ణాకాంత్ పార్కు మీదుగా పారే వ‌ర‌ద కాలువ‌ల‌ను ప‌రిశీలించారు. కృష్ణకాంత్ పార్కులో ఉన్న చెరువును కూడా త‌నిఖీ చేశారు. పై నుంచి భారీఎత్తున వ‌స్తున్న వ‌ర‌ద‌ను కృష్ణాకాంత్ పార్కులోని చెరువుకు మ‌ళ్లిస్తే చాలావ‌ర‌కు వ‌ర‌ద ఉధృతిని క‌ట్ట‌డి చేయ‌వ‌చ్చున‌నే అభిప్రాయానికి హైడ్రా క‌మిష‌న‌ర్ వ‌చ్చారు.

పూడికను తొలగించండి
అమీర్‌పేట - సంజీవరెడ్డి న‌గ‌ర్ ప్ర‌ధాన ర‌హ‌దారిని వ‌ర‌ద నీరు దాటేందుకు వేసిన‌ పైపు లైన్ల‌లో ఉన్న ఆటంకాల‌ను గుర్తించేందుకు జీపీఆర్ ఎస్ (Ground Penetrating Radar survey) స‌ర్వే చేయాల‌ని హైడ్రా క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్‌గారు సూచించారు. దీని ద్వారా పైపులైన్ల‌లో పేరుకుపోయిన పూడిక‌ను గుర్తించ‌డం జ‌రుగుతుంద‌న్నారు. తొల‌గించ‌డానికి వీలు కాని ప‌క్షంలో బాక్సు డ్రైన్ల ఏర్పాటు అంశాన్ని ప‌రిశీలించ‌వ‌చ్చున‌న్నారు. అప్ప‌టి వ‌ర‌కూ మెట్రో స్టేష‌న్ కింద ఉన్న పైపులైన్ల‌లోంచి వ‌ర‌ద నీరు సాఫీగా సాగేందుకు ఎలాంటి ఆటంకాలు లేకుండా చూడాల‌ని హైడ్రా క‌మిష‌న‌ర్ సూచించారు.


Read More
Next Story