మూసీకి వరద తాకిడి
x

మూసీకి వరద తాకిడి

పరివాహక ప్రాంత వాసులను ఖాళీ చేయిస్తున్న గ్రేటర్ అధికారులు


తెలంగాణ రాష్ట్రంలో.. కురుస్తున్న వర్షాలకు నదులు, వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఈ నేపథ్యంలో మూసీ నదికి వరద తాకిడి పెరిగింది. మూసీ ఉగ్రరూపం దాల్చడంతో పరివాహక ప్రాంత వాసులను అధికారులు ఖాళీ చేయిస్తున్నారు. జంట జలాశయాల గేట్లు ఎత్తేయడంతో మూసీకి వరద ముంచుకొస్తుంది. ఉస్మాన్ సాగర్ 8 గేట్లు ఎత్తి 4100 క్యూసెక్కుల నీటిని, హిమాయత్ సాగర్ 3 గేట్లు ఎత్తి 2300 క్యూసెక్కుల నీటిని మూసీలోకి విడుదల చేస్తున్నారు. నీటిని క్రిందికి విడుదల చేయడంతో బాపుఘాట్, అత్తాపూర్, పురానాఫూల్, చాదర్ఘాట్, మూసారంబాగ్ వద్ద వరద ఉధృతి క్రమంగా పెరుగుతోంది. దీంతో మూసి పరివాహక ప్రాంతాల ప్రజలను గ్రేటర్ అధికారులు అప్రమత్తం చేశారు.

జంట జలాశయాల గేట్లు ఎత్తడంతో జియాగూడ 100 ఫీట్ రోడ్డుపై భారీగా వరద నీరు చేరుతోంది. దీంతో ఈ మార్గాన్ని అధికారులు మూసివేశారు. జియాగూడ పురానాపూల్ మార్గంలో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. పురానాపూల్ నుంచి హైకోర్టుకు వెళ్లే వాహనాలను కార్వాన్ నుంచి మళ్లించారు. కాగా, మూసారాంబాగ్ బ్రిడ్జ్‌పై కూడా ఇదే పరిస్థితి ఉంది. మూసి నది ఉధృతంగా ప్రవహిస్తుండటంతో బ్రిడ్జిని పూర్తిగా మూసి వేశారు. వరద ధాటికి బ్రిడ్జ్ పిల్లర్లు పూర్తిగా కృంగిపోయినట్లు అధికారులు తెలిపారు. అంబర్పేట, దిల్‌షుక్‌నగర్ రూట్లో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర అగచాట్లు పడ్డారు.

116 ఏళ్ల క్రితం మూసీ పొంగింది

మూసీ నది ఉగ్రరూపం దాల్చి 116 ఏళ్లు దాటింది. ఆనాడు మూసీ పొంగిపొర్లడంతో చాలామంది నీళ్లలో కొట్టుకుపోయారు. ఆరో నిజాం ప్రభువు హాయంలో వచ్చిన ఈ వరదల తాకిడిని నిలువరించడానికే ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ జంటజలాశయాలను నిర్మించారు. ప్రఖ్యాత ఇంజినీర్ మోక్ష గుండం విశ్వేశ్వరయ్య జంటజలాశయాలకు రూపకల్పన చేశారు మూసీ వరదలు ఎక్కువ కావడంతో ఉస్మానియా ఆస్పత్రి పక్కనే ఉన్న చింత చెట్టు చాలామంది ప్రాణాలు కాపాడింది. వరద ఎక్కువ కావడంతో ఈ చింతచెట్టుపై ఎక్కి కూర్చున్నారు. మూసీ వరదలకు ఈ చెట్టు సజీవ సాక్ష్యంగా నిలిచిపోయింది.


Read More
Next Story