ఆహార దినోత్సవం వేళ హడలెత్తించిన ఫుడ్ సేఫ్టీ అధికారులు
ప్రపంచ ఆహార దినోత్సవ వేళ తెలంగాణ ఫుడ్ సేఫ్టీ టాస్క్‌ఫోర్స్ బృందం హోటళ్లలో ఆకస్మిక తనిఖీలతో హడలెత్తించింది.హోటల్ స్టోర్ రూంలో బొద్దింకలు. పురుగులు కనిపించాయి
ప్రపంచ ఆహార దినోత్సవం సందర్భంగా మెరుగైన జీవితం, మంచి భవిష్యత్తు కోసం ఆహార హక్కు నినాదాన్ని ఆహార వ్యవసాయ సంస్థ ప్రకటించింది. ప్రజలకు సురక్షితమైన ఆహారం అందించడమే లక్ష్యంగా తెలంగాణ ఫుడ్ సేఫ్టీ టాస్క్ ఫోర్స్ అధికారుల బృందం హైదరాబాద్ నగరంలోని పలు హోటళ్లలో ఆకస్మిక తనిఖీలు చేసి హడలెత్తించింది. నగరంలోని కొండాపూర్ శరత్ సిటీ మాల్‌లో ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించి అపరిశుభ్రతకు నిలయాలుగా మారిన హోటళ్లపై కేసులు నమోదు చేశారు.
ఛట్నీస్ హోటల్ స్టోర్ రూంలో బొద్దింకలు, నల్లపురుగులు
ఛట్నీస్ హోటల్ స్టోర్ రూంలో బొద్దింకలు, నల్లపురుగులు దర్శనమిచ్చాయి.ప్రముఖ ఛట్నీస్ హోటల్ లో తనిఖీల్లో పలు లోపాలు వెలుగుచూశాయి. ఎఫ్ఎస్ఎస్ఏఐ లైసెన్సు ప్రదర్శించలేదు. ఈ హోటల్ ముడిసరుకు నిల్వ చేసే ప్రాంతంలో బొద్దింకలు కనిపించాయి. గోధుమ పిండి, రవ్వల బస్తాల్లో నల్ల పురుగులు వెలుగు చూశాయి. ఆహార పదార్థాలతోపాటు శానిటరీ లిక్విడ్లు కలిపి నిల్వ చేశారు. మనుషులు తినేందుకు వీలుకాని కుళ్లిన ఉల్లిపాయలు, క్యాబేజి కనిపించింది. హోటల్ వాష్ ఏరియా తీవ్ర దుర్గంధం వెదజల్లుతుంది.హోటల్ లో పనిచేస్తున్న ఫుడ్ హ్యాండ్లర్లకు శిక్షణ ఇవ్వలేదు. కూరగాయలు కోసేందుకు ఇనుపకత్తులు వాడుతుండటం కనిపించింది.
కొండాపూర్ అల్పాహార్ హోటల్ లో...
కొండాపూర్ ప్రాంతంలోని శరత్ సిటీ మాల్ లోని అల్పాహార్ హోటల్ లో అపరిశుభ్ర పరిస్థితులు కనిపించాయి.లైసెన్స్ ప్రదర్శించలేదు. హోటల్ లో డస్ట్‌బిన్‌లు తెరిచి ఉన్నట్లు గుర్తించారు.వండిన ఆహారాన్ని మూతలతో కప్పి ఉంచలేదు.కూరగాయలను కటింగ్ కోసం ఇనుప లోహపు కత్తులు ఉపయోగించారు.ఫుడ్ హ్యాండ్లర్లకు శిక్షణ లేదు.
ఆహార భద్రత, నాణ్యత, ప్రమాణాలపై దృష్టి
సమతుల ఆహారాన్ని సురక్షితంగా ఉండటమే కాకుండా పోషకమైనదిగా కూడా ఉండాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వరల్డ్ ఫుడ్ ఇండియా ఈవెంట్ 2024లో తన సందేశంలో పేర్కొన్నారు. ఆహార భద్రత, నాణ్యత, ప్రమాణాలపై దృష్టి సారించడం యొక్క ప్రాముఖ్యతను ప్రధాని నొక్కిచెప్పారు.దేశంలో ఆహార భద్రత మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడానికి చర్యలు తీసుకున్నారు. ఆహార భద్రత,ప్రమాణాలపై 28 ప్రధాన నిబంధనలతో, దేశవ్యాప్తంగా 257 ఫుడ్ టెస్టింగ్ లేబొరేటరీలను ఏర్పాటు చేశారు. 261 మొబైల్ ఫుడ్ ల్యాబ్‌ల ద్వారా దేశంలోని మారుమూల ప్రాంతాలకు ఆహార భద్రత పరీక్షలు నిర్వహిస్తున్నారు. పురుగుమందులను అధికంగా వినియోగించడం వల్ల ఆహారంలో భారీ లోహాలు ఉండటం ఆందోళన కలిగిస్తోంది.
Next Story