
పేరుమోసిన రెస్టారెంట్లు.. లోపల మాత్రం అంతా చెత్తచెత్త..
నగరంలో మరోసారి తనిఖీలు స్టార్ట్ చేసిన ఫుడ్ సేఫ్టీ అధికారులు.
పైనపటారం లోనలొటారం అని తెలుగు సామెత ఒకటి ఉంది. దీనికి ప్రస్తుతం హైదరాబాద్‌లోని పలు రెస్టరాంట్లు ప్రతిబింబాల్లా మారుతున్నాయి. బయటకేమో పేరుమోసిన ప్రముఖ రెస్టరాంట్లు.. లోపల ఫుడ్ తయారీ ప్రదేశం చూస్తే కడుపులోది దేవుకొస్తుంది. అంత చెత్తగా ఉంటుంది. వంటకాలకు వినియోగిస్తున్ను ముడిసరుకు నాణ్యత, పరిసరాల పరిశుభ్రత ఇవి ఇసుమంతైనా కనిపించడం లేదని అధికారులు అవాక్కవుతున్నారు. మొన్నటి వరకు వరుసగా అనేక రెస్టరాంట్లపై దాడులు చేసిన ఫుడ్ సేఫ్టీ అధికారులు కాస్తంత గ్యాప్ తీసుకున్నట్లు ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ రెస్టారెంట్లపై తమ వేట మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే తాజాగా అబ్సల్యూట్ బార్బిక్‌క్యూ ఔట్లెట్స్‌లో సోదాలు చేశారు. బంజారాహిల్స్, గచ్చిబౌలి ఔట్‌లెట్స్‌లలోని కిచెన్, స్టోర్ రూమ్స్‌ను అధికారులు తనిఖీ చేశారు. ఈ క్రమంలోనే ఫుడ్ సేఫ్టీ నిబంధనలను ఈ రెస్టారెంట్లు గాలికి వదిలేశాయని గుర్తించారు. కిచెన్ పరిసరాలు బొద్దింకలు, ఈగలతో అపరిశుభ్రంగా ఉన్నాయని అధికారులు తెలిపారు.
కుళ్ళిపోయిన ఫ్రూట్స్..
అంతేకాకుండా ఇనార్బిట్ మాల్‌లో ఉన్న అబ్సల్యూట్ బార్బిక్‌క్యూలో కుళ్లిపోయిన పండ్లను సర్వ్ చేస్తున్నట్లు తేలింది. మేడిపల్లి ఔట్ లేట్‌లో ఎక్స్పైర్ అయిన ఫుడ్‌ను మళ్లీ వేడి చేసి వినియోగిస్తున్నట్టు వెల్లడైంది. ఏ.ఎస్.రావు నగర్ ఔట్ లెట్ లోని స్టోర్ రూమ్‌లో ఎలుకలు తిరుగుతున్న దృశ్యాలు కనిపించాయని పేర్కొన్నారు. నిర్వహకులు ఫ్లోర్ పైనే ఫుడ్ ఐటమ్స్ స్టోర్ చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. తనిఖీల అనంతరం రెస్టరాంట్ నిర్వహాకులకు అధికారులు నోటీసులు జారీ చేశారు. ఆహారపదార్థాలు, ముడిసరుకుల నుంచి శాంపిల్స్‌ను సేకరించారు. వాటిని పరీక్షల నిమిత్తం ల్యాబ్‌కు పంపారు. అబ్సల్యూట్ బార్బిక్ క్యూ ఔట్‌లెట్లు శుభ్రత, నాణ్యత పరంగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని అధికారులు తేల్చారు. రెస్టరాంట్ ఏదైనా ఫుడ్ సేఫ్టీ నిబంధనలు పాటించకపోతే కఠిన చర్యలు ఉంటాయని అధికారులు స్పష్టం చేశారు.