అన్నీ అజహరుద్దీన్ కే కావాలట
x
Mohammed Azharuddin

అన్నీ అజహరుద్దీన్ కే కావాలట

కనబడిన ప్రతి పదవిని తనకే కావాలనే మనస్తత్వం అజహరుద్దీన్ లో పెరిగిపోతోందని పార్టీ నేతలు సెటైర్లు వేస్తున్నారు


మాజీ క్రికెటర్ మహమ్మద్ అజహరుద్దీన్ వైఖరిపైన కాంగ్రెస్ పార్టీలో పెద్దఎత్తున చర్చ జరుగుతోంది. కనబడిన ప్రతి పదవిని తనకే కావాలనే మనస్తత్వం అజహరుద్దీన్ లో పెరిగిపోతోందని పార్టీ నేతలు సెటైర్లు వేస్తున్నారు. ఇపుడు విషయం ఏమిటంటే హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్సీయూ)(HCU) వివాదం అందరికీ తెలిసిందే. అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు జగన్మోహన్ రావుతో పాటు మరో ఐదుగురు అరెస్టయిన విషయం తెలిసిందే. అంటే అసోసియేషన్ కు ఇపుడు అధ్యక్షుడు లేడు. అందుకని తొందరలోనే ఎన్నికలు పెట్టాల్సిందే. ఎన్నికలు పెట్టేంతవరకు పోస్టును ఖాళీగా ఉంచేందుకు లేదుకదా. అందుకనే హెచ్సీయూ నిర్వహణ బాధ్యతలను తనకు అప్పగించాలని ప్రభుత్వాన్ని అడుగుతున్నాడు. బాధ్యతలు చేపట్టడానికి తాను సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించేశాడు. పగ్గాలను తనకు అప్పగిస్తే మొత్తం అసోసియేషన్ ను దారిలోకి తీసుకొస్తానని పెద్దపెద్ద మాటలు చెప్పేస్తున్నాడు.

పెద్ద మాటలు అని ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే హెచ్సీయూకి అజహర్(Azharuddin) కొత్తేమీకాదు. గతంలో అసోసియేషన్ ప్రెసిడెంట్ గా చేశాడు. అజహర్ అధ్యక్షుడిగా ఉన్నపుడు కూడా అవినీతి ఆరోపణలతో గబ్బుపట్టిపోయింది. మ్యాచుల టికెట్లను బ్లాకులో అమ్ముకోవటాలు, అసోసియేషన్ డబ్బును విచ్చలవిడిగా దుర్వినియోగం చేశాడనే ఆరోపణలు అజహర్ మీద కోకొల్లలు. ఆ ఆరోపణలపై విచారణ కూడా జరుగుతోంది. అంతటి ఘనచరిత్ర కలిగిన అజహర్ కూడా జగన్మోహన్ రావు ఆధ్వర్యంలో క్రికెట్ అసోసియేషన్ భ్రష్టుపట్టిపోయిందని తెగ బాధపడిపోతున్నాడు. క్రికెట్ అసోసియేషన్ను గబ్బుపట్టించటంలో ఎవరికి ఎవరూ తీసిపోరు.

అసోసియేషన్ బాధ్యతలను కాసేపు పక్కనపెట్టేస్తే జూబ్లీహిల్స్(Jubilee Hills) ఎంఎల్ఏ మాగంటి గోపీనాధ చనిపోయిన విషయం తెలిసిందే. తొందరలోనే అసెంబ్లీ నియోజకవర్గానికి ఉపఎన్నికలు తప్పవు. అన్నీపార్టీలు గట్టి అభ్యర్ధుల ఎంపికపై ఫోకస్ పెట్టాయి. 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్ధిగా పోటీచేసిన అజహర్ ఓడిపోయాడు. ఇపుడు ఉపఎన్నిక జరగబోతోంది కాబట్టి కాంగ్రెస్ టికెట్ తనకే కావాలని అజహర్ అడుగుతున్నాడు. తనకు గనుక టికెట్ ఇస్తే మంచి మెజారిటితో గెలుస్తానని ప్రకటించాడు.

కొద్దిరోజులు ముందుకుపోతే కాంగ్రెస్ మూడు ఎంఎల్సీ సీట్లను భర్తీచేసింది. అప్పట్లో తనను ఎంఎల్సీగా ఎంపికచేయాలని మాజీ క్రికెటర్ బాగా పట్టుపట్టాడు. ఢిల్లీలో అధిష్ఠానం దగ్గరకు వెళ్ళి ప్రయత్నాలు చేసుకున్నాడు. ఎన్ని ప్రయత్నాలుచేసినా చివరకు అజహర్ కు నిరాస తప్పలేదు. అంతకుముందు 2023 ఎన్నికల్లో జూబ్లిహిల్స్ టికెట్ కావాలని పట్టుబట్టి మరీ సాధించుకున్నాడు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడితే తనకే మంత్రిపదవి కావాలని కూడా గట్టిగా కోరినట్లు పార్టీవర్గాల సమాచారం. పార్టీ అధికారంలోకి వచ్చింది కాని అజహర్ ఓడిపోయాడు. దాంతో కొంతకాలం మౌనంగా ఉండి మళ్ళీ ఎంఎల్సీ తీసుకుని మంత్రివర్గంలో చేరాలని గట్టిగానే ప్రయత్నాలు చేసుకున్నాడు. అయితే అధిష్ఠానం ఎందుకనో పక్కనపెట్టేసింది. ఎంఎల్ఏ టికెట్, ఓడిపోగానే తర్వాత ఎంఎల్సీ పదవి, తర్వాత జూబ్లిహిల్స్ ఉపఎన్నికలో మళ్ళీ ఎంఎల్ఏ టికెట్, ఇపుడు హెచ్సీయూ బాధ్యతలు ఇలా ఏదికనబడినా అన్నీ తనకే కావాలని అజహర్ పట్టుబడుతుండటం ఆశ్చర్యంగా ఉంది.

Read More
Next Story