లొంగిపోయిన ప్రభాకర్ రావు..
x

లొంగిపోయిన ప్రభాకర్ రావు..

ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.


మాజీ ఐపీఎస్ అధికారి ప్రభాకర్ రావు.. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం సిట్ అధికారుల ముందు లొంగిపోయారు. శుక్రవారం ఉదయం జూబ్లీహిల్స్ పీఎస్‌లో ఏసీపీ ఎదుట హాజరయ్యారు. వారం రోజుల పాటు ప్రభాకర్ రావును సిట్ అధికారులు విచారించనున్నారు. ఫోన్ ట్యాపింగ్ వివాదంలో కీలక ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయనను వారంరోజుల పాటు కస్టడీలోకి తీసుకోవడానికి సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది. ఈ కేసులో ధ్వంసం చేసిన హార్డ్‌డిస్కులు, ఐ-క్లౌడ్ అకౌంట్ పాస్‌వర్డ్ రికవరీ, అందులోని డేటా వెలికితీత, అలాగే ఫోన్ ట్యాపింగ్ వెనుక ఉన్న నిజాలు– ఎవరి ఆదేశాలతో అది జరిగిందన్న అంశాలపై దృష్టి నిలుపుతూ ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) కీలక సమాచారాన్ని సేకరించేందుకు సన్నద్ధమవుతోంది.

కోర్టు అనుమతి మేరకు SIT కస్టడీలో సమగ్ర విచారణ జరపనుంది. ఈ విచారణలో బయటకు వచ్చే వివరాలు కేసు దిశను ప్రభావితం చేసే అవకాశమున్నట్లు అధికారులు భావిస్తున్నారు. కస్టడీ విచారణ అనంతరం ఆయనను అధికారికంగా అరెస్టు చేసే అవకాశాలు కూడా ఉన్నాయని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి.

ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఇప్పటికే రాజకీయంగా, పరిపాలనాపరంగా తీవ్ర చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో, రాబోయే రోజుల్లో ఈ కేసులో మరిన్ని కీలక పరిణామాలు చోటుచేసుకునే అవకాశం కనిపిస్తోంది.

కీలకంగా మారనున్న కస్టోడియల్ విచారణ

ప్రభాకర్ రావు కస్టోడియల్ విచారణలో కీలక పేర్లు బయటకు వచ్చే అవకాశం ఉందని రాష్ట్రవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఎవరి ఆదేశాల మేరకు ఫోన్ ట్యాపింగ్ జరిగిందని, ఎవరెవరి ఫోన్లు ట్యాప్ చేశారు, ఎటువంటి సమాచారం రికార్డ్ చేశారు, ఎందుకు చేశారు అన్న అంశాలు బయటకు రావొచ్చని చర్చ జరుగుతోంది.

ఫోన్ ట్యాపింగ్ కేసులో జరుగుతున్న తాజా కస్టడీ విచారణ రాజకీయంగా మరోసారి ఆసక్తికర మలుపు తీసుకోనుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) చేపడుతున్న విచారణలో ఎవరి ఆదేశాల మేరకు ఫోన్ ట్యాపింగ్ జరిగిందన్న అంశం ప్రధానంగా నిలవనుంది.

ఎస్ఐబీ (SIB) యొక్క రెగ్యులర్ ఫంక్షనింగ్ సాధారణంగా ముఖ్యమంత్రి పర్యవేక్షణలో సాగుతుందన్న వాదనల నేపథ్యంలో, ఆ సమయంలో సీఎంగా ఉన్న కేసీఆర్ పేరు విచారణలో ప్రస్తావనకు వస్తుందేమో అన్న చర్చలు రాజకీయ వర్గాల్లో నెలకొన్నాయి. ఇదే సమయంలో, కాళేశ్వరం ప్రాజెక్ట్ మరియు విద్యుత్ కొనుగోళ్లలో జరిగిన అవకతవకల కేసుల్లో కేసీఆర్ పేరు వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో, ఫోన్ ట్యాపింగ్ కేసులో కూడా ఆయన పేరు బయటపడుతుందా అన్నది మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది.

ఇక ఈ కేసులో కస్టడీలో ఉన్న అధికారులు కేసీఆర్‌తో పాటు మరెవరెవరిని ప్రస్తావించగలరు, అలాగే లిఖితపూర్వక ఆదేశాల్లో ఏ ఉన్నతాధికారుల పేర్లు ఉండవచ్చు అన్న అంశాలు SIT దృష్టిని ఆకర్షిస్తున్నాయి. విచారణలో బయటకు వచ్చే వివరాలు కేసు దిశను ప్రభావితం చేసే అవకాశం ఉందని దర్యాప్తు వర్గాలు సూచిస్తున్నాయి. రాజకీయ, పరిపాలనా స్థాయిలో దుమారం రేపుతున్న ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో రాబోయే రోజులు మరిన్ని సంచలన పరిణామాలకు వేదిక కానున్నాయని పరిశీలకులు అంటున్నారు.

Read More
Next Story