ఢిల్లీ వర్శిటీ మాజీ ప్రొఫెసర్ సాయిబాబా కన్నుమూత
x

ఢిల్లీ వర్శిటీ మాజీ ప్రొఫెసర్ సాయిబాబా కన్నుమూత

ఢిల్లీ యూనివర్శిటీ మాజీ ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబా తీవ్ర అనారోగ్యంతో శనివారం రాత్రి కన్నుమూశారు.హైదరాబాద్ నిమ్స్ లో చికిత్స పొందుతూ సాయిబాబా తుదిశ్వాస విడిచారు.


ఢిల్లీ యూనివర్శిటీ మాజీ ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబా తీవ్ర అనారోగ్యంతో శనివారం రాత్రి కన్నుమూశారు.హైదరాబాద్ నిమ్స్ లో చికిత్స పొందుతూ సాయిబాబా మృత్యువాత పడ్డారు. మావోయిస్టులతో సంబంధాలున్నాయని పోలీసులు అరెస్టు చేసి జైలులో పెట్టారు. ఆయన వయసు 57 సంవత్సరాలు. ఆయనకు భార్య వసంత, కుమార్తె మంజీర ఉన్నారు. కూతురు హైదరాబాద్ లోని ఎఫ్లూ (EFLU) లో చదువుతున్నారు.

2014వ సంవత్సరంలో సాయిబాబాను పోలీసులు అరెస్ట్ చేశారు. తొమ్మిదేళ్ల పాటు ఆయన జైలులోనే గడిపారు. జైలులో ఉన్న సమయంలో ఈయన ఆరోగ్యం దెబ్బతింది. మావోయిస్టులతో సంబంధాలున్నాయనే కేసులో సాయిబాబా నిర్దోషిగా బాంబే హైకోర్టు నాగపూర్ బెంచ్ ఈ ఏడాది మార్చి నెలలో తీర్పు ఇచ్చింది. దానితో జైలు నుంచి విడుదలయ్యారు.ఉగ్రవాద కార్యకలాపాల నిరోధక చట్టం కింద సాయిబాబాపై మహారాష్ట్ర పోలీసులు కేసు పెట్టారు.ఈ కేసులో గడ్చిరోలి జిల్లా సెషన్స్ కోర్టు అతనితో పాటు మరొక ముగ్గురికి జీవిత ఖైదు విధించింది. మరొక వ్యక్తి విజయ్ ను తొలిసారి నేరంచేశాడన కఠిన కారాగార శిక్ష మాత్రం విధించారు. ఈ కేసును బాంబే హైకోర్టు 2022లోనే కొట్టివేసింది. అయితే మహారాష్ట్ర ప్రభుత్వం దీనిపై సుప్రీంకోర్టుకు అప్పీలు చేయగా అతని విడుదలలో జాప్యం జరిగింది.

అమలాపురం సాయిబాబా జన్మస్థలం
సాయిబాబా 1967వ సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలో పేద రైతు కుటుంబంలో జన్మించారు. పోలియో కారణంగా అయిదేళ్ల వయసు నుంచి వీల్ ఛైర్ ను ఉపయోగిస్తున్నారు. ఆయన ఢిగ్రీ వరకు అమలాపురంలోనే చదువుకున్నారు. తర్వాత హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ నుంచి ఇంగ్లీష్ లో ఎమ్మే చేశారు. తర్వాత ఢిల్లీ యూనివర్శిటీ నుంచి డాక్టరేట్ పూర్తి చేశారు.
విద్యార్థి దశ నుంచి ఆచన విప్లవరాజకీయాలలో చురుకుగా పాల్గొంటూ వచ్చారు. ఆయన మొదట రాడికల్ విద్యార్థి సంఘంలో పనిచేశారు. తర్వాత రెవల్యూషనరీ డెమోక్రటిక్ ఫ్రంటులో క్రియాశీలంగా పనిచేశారు. బస్తర్ అడవుల్లో ఆదివాసీలకు వ్యతిరేకంగా సెక్యూరిటీ దళాలు, పోలీసుల సృష్టించిన సాల్వా జుడుమ్ కు వ్యతిరేకంగా, ఆపరేషన్ గ్రీన్ కు వ్యతిరేకంగా సాగిన ఉద్యమం అగ్రభాగాన ఉన్నారు.
ఉద్యోగం నుంచి తొలగింపు
ప్రొఫెసర్ సాయిబాబా ఢిల్లీ విశ్వవిద్యాలయంలోని రామ్ లాల్ ఆనంద్ కళాశాలలో ఆంగ్ల భాష బోధించారు.మావోయిస్టులతో సంబంధాలున్నాయనే కేసు నమోదుతో కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగం నుంచి 2021 న మార్చిలో తొలగించారు.
సిపిఐ నారాయణ సంతాపం

ప్రాఫెసర్ సాయిబాబా మరణంపట్ల భారత కమ్యూనిస్టు పార్టీ జాతీయ కార్యదర్శి వర్గ సభ్యుడు డాక్టర కె నారాయణ ప్రగాడ సంతాపం తెలిపారు.

నిజజీవితంలో వికలాంగుడయినా ప్రభుత్వ నిర్బంధాన్ని ఎదిరించి రాజీలేని పొరాటంలో విజయం సాధించారని ఆయన సందేశంలో పేర్కొన్నారు . పోరాటయోధులు సాయిబాబా బౌతికంగా మనతో లేకపోయినా ఉద్యమ రీత్యా మనతోనేవున్నారని చెబుతూ వారికుటుంబసభ్యులకు సానుభూతి తెలిపారు.




Read More
Next Story