లేఖ రాసి కెసిఆర్ చేసిన నాలుగు తప్పులు
x
Justice Narasimhareddy and KCR

లేఖ రాసి కెసిఆర్ చేసిన నాలుగు తప్పులు

లేఖరాసి కేసీయార్ నాలుగు తప్పులుచేశారని సమాచారం. కేసీయార్ చేసిన ఆ నాలుగు తప్పులు ఏమిటో చూద్దాం.


జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ కు కేసీయార్ రాసిన లేఖ సంచలనంగా మారింది. కేసీయార్ హయాంలో ఛత్తీస్ ఘర్ తో జరిగిన విద్యుత్ ఒప్పందం, యాదాద్రి, భద్రాద్రి విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటులో భారీ అవినీతి జరిగిందనే ఆరోపణలు అందరికీ తెలిసిందే. ఆరోపణలపై విచారించేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ ఏర్పాటుచేసింది. కమిషన్ ఇచ్చిన నోటీసులను కేసీయార్ లెక్కచేయలేదు. లెక్కచేయకపోగా ఎదురు జస్టిస్ నరసింహారెడ్డిపైనే బురదచల్లేశారు. కమిషన్ పై కేసీయార్ ధ్వజమెత్తిన విషయమై రాజకీయంగా మంటలు మొదలయ్యాయి. కమిషన్నే తప్పుపడుతు కేసీయార్ లేఖ రాయటంపై కేంద్రమంత్రి బండి సంజయ్ చాలా సీరియస్ అయ్యారు. కేసీయార్ ను వెంటనే అరెస్టుచేయాలని బండి డిమాండ్ చేశారు. ఈ విషయాన్ని పక్కనపెట్టేస్తే లేఖరాసి కేసీయార్ నాలుగు తప్పులుచేశారని సమాచారం.

కేసీయార్ చేసిన ఆ నాలుగు తప్పులు ఏమిటో చూద్దాం.

1. మొదటిది కమిషన్ను కించపరిచే విధంగా లేఖ రాయటం.

2. లేఖలో డైరెక్టుగా కమిషన్ ఛైర్మన్ జస్టిస్ నరసింహారెడ్డి వ్యక్తిత్వాన్ని కించపరచటం.

3. కమిషన్ ఛైర్మన్ గా పనికిరావని డిసైడ్ చేసిన కేసీయార్ జస్టిస్ ను ఛైర్మన్ పదవిలోనుండి తప్పుకోమని డిమాండ్ చేయటం

4. కమిషన్ కు లేఖ రాయటమే కాకుండా ఆ లేఖను మీడియాకు లీక్ చేయటం.

ఇదే విషయమై ’తెలంగాణా ఫెడరల్‘ తో జస్టిస్ బీ చంద్రకుమార్ మాట్లాడుతు ‘ఎవరినైనా పిలిపించి విచారించే అధికారం కమిషన్ కు ఉంద’న్నారు. ‘సివిల్ కోర్టుకు ఎలాంటి అధికారాలు ఉంటాయో విచారణ కమిషన్ కు కూడా అలాంటి అధికారాలే ఉంటాయ’ని స్పష్టంచేశారు. ‘ఏ అంశానికి సంబంధించి కమిషన్ విచారణ జరుపుతోందో ఆ శాఖలకు సంబంధించిన ప్రతి అధికారిని విచారణకు పిలిపించవచ్చు, అలాగే ప్రతి ఫైలు, రికార్డును కమిషన్ స్వాధీనం చేసుకుని పరిశీలించవచ్చ’న్నారు.

నోటీసు అందుకున్న అధికారి విచారణకు రానని చెప్పేందుకు లేదన్నారు. ‘విచారణకు రావాలని సదరు అధికారిని ఆదేశించే అధికారం కమిషన్ కు ఉంటుంద2న్నారు. జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ విచారణకు హాజరవ్వనని కేసీయార్ చెప్పేందుకు లేదన్నారు. ‘కేసీయార్ ను గనుక విచారణకు పిలిపించాలని కమిషన్ గట్టిగా అనుకుంటే మరో నోటీసు ఇవ్వచ్చ2న్నారు. ‘అప్పటికీ విచారణకు రాకపోతే బెయిలబుల్ వారెంట్ ఇచ్చి విచారణకు రప్పించే అధికారం కమిషన్ కు ఉంద’న్నారు. ‘అప్పటికీ కేసీయార్ రాకపోతే నాన్ బెయిలబుల్ వారెంట్ జారీచేసి విచారణకు హాజరయ్యేట్లు చేసే అధికారం కూడా కమిషన్ కు ఉంద’ని చెప్పారు. ‘విచారణకు రమ్మని నోటీసులు ఇచ్చినపుడు రానని చెప్పటం, గైర్హాజరవ్వటం కూడా నేరమే అవుతుంద’న్నారు.

‘కమిషన్ విచారణకు హాజరవ్వటం కేసీయార్ కు ఇష్టంలేకపోతే అదే విషయాన్ని ప్రభుత్వానికి చెప్పాలే కాని నేరుగా కమిషన్ ఛైర్మన్ కు చెప్పకూడద2న్నారు. ‘ఏదన్నా అనారోగ్యం కారణంగా విచారణ తేదీని మార్చమని అడగచ్చుకాని ఏకంగా కమిషన్ అధికారాలను ప్రశ్నించే అధికారం కేసీయార్ కు లేద’న్నారు. జస్టిస్ నరసింహారెడ్డి వ్యక్తిత్వాన్ని కించపరిచే అధికారం కేసీయార్ కు లేదన్నారు. ‘ఒకవేళ కేసీయార్ లేఖను జస్టిస్ సీరియస్ గా తీసుకుంటే పరువునష్టందావా కూడా వేయచ్చ’ని జస్టిస్ చంద్రకుమార్ చెప్పారు. ఒక వ్యక్తిని కించపరుస్తు నిరాధారమైన ఆరోపణలు చేసే అధికారం ఇంకో వ్యక్తికి లేదన్న విషయాన్ని చంద్రకుమార్ స్పష్టంచేశారు. ఈ నేపధ్యంలో కేసీయార్ విషయంలో కమిషన్ ఏ విధమైన యాక్షన్ తీసుకుంటుందనే విషయమై సర్వత్రా చర్చజరుగుతోంది.

మరో ప్రముఖ లాయర్ పూసల వెంకట కృష్ణయ్య మాట్లాడుతు ‘కమిషన్ అంటే నతింగ్ బట్ కోర్టు’ అన్నారు. ‘కోర్టుకు ఎలాంటి అధికారాలు ఉంటాయో కమిషన్ కు కూడా అలాంటి అధికారాలే ఉంటాయ’ని చెప్పారు. ‘విచారణకు రానని చెప్పే అవకాశం కేసీయార్ కు లేద’న్నారు. ‘విచారణకు పిలిపించాలని కమిషన్ అనుకుంటే ముందు నాన్ బెయిలబుల్ వారెంట్ అవసరమైతే నాన్ బెయిలబుల్ వారెంట్ కూడా జారిచేసి అరెస్టుచేసే అధికారం కమిషన్ కు ఉంద’న్నారు. ‘కమిషన్ను తప్పుపడుతు కేసీయార్ లేఖరాసే అవకాశం కేసీయార్ కు కమిషనే ఇచ్చింద’న్నారు. ‘విచారణకు సంబంధించిన అంశాలను కమిషన్ మీడియాతో మాట్లాడకుండా ఉండుంటే బాగుండేద’న్నారు. మీడియాతో మాట్లాడటానికి కమిషన్ ఛైర్మన్ రాజకీయ నేతో లేదా బ్యూరోక్రాటో కాదన్నారు. ‘ఛైర్మన్ తన విచారణ పూర్తిచేసి రిపోర్టును ప్రభుత్వానికి ఇచ్చినపుడు అక్కడినుండి మీడియాలో వివరాలు వచ్చుంటే బాగుండేద’ని కృష్ణయ్య అభిప్రాయపడ్డారు.

Read More
Next Story