తెలంగాణని వేడెక్కిస్తున్న నాలుగు సంఘటనలు
x

తెలంగాణని వేడెక్కిస్తున్న నాలుగు సంఘటనలు

తెలంగాణాలో 24 గంటల్లో జరిగిన నాలుగు ఘటనలు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి. రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉన్నాయా అంటూ ప్రతిపక్షాలు ప్రభుత్వంపై విరుచుకుపడేలా చేస్తున్నాయి.


తెలంగాణాలో 24 గంటల్లో జరిగిన నాలుగు ఘటనలు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి. రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉన్నాయా అంటూ ప్రతిపక్షాలు ప్రభుత్వంపై విరుచుకుపడేలా చేస్తున్నాయి. ఒళ్లుగగ్గుర్పొడిచేలా హత్యలు, ఆరేళ్ళ చిన్నారిపై హత్యాచారం, వాటర్ ట్యాంకర్ డ్రైవర్ పై తల పగిలేలా దాడి జరగడంపై ఆందోళనలు నెలకొన్నాయి. వివిధ మాధ్యమాల ద్వారా సీఎం రేవంత్ రెడ్డిని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రతిపక్ష నేతలు, ప్రజలు నిలదీస్తున్నారు.

కర్రలతో కొట్టి చంపేశారు...

నారాయణ పేట జిల్లా ఉట్కూరు మండలంలో అందరూ చూస్తుండగానే సంజీవ్ అనే వ్యక్తిని కర్రలతో కొట్టి చంపడం స్థానికంగా కలవరం సృష్టించింది. చిన్న పొర్ల గ్రామంలో భూ తగాదాల విషయంలో గొడవ కాగా అవతలి ముఠా సంజయ్ పై కర్రలతో తీవ్రంగా దాడి చేశారు. 100 కి డయల్ చేసినా 2 గంటల వరకు పోలీసు అధికారులు రెస్పాండ్ కాకపోవడంతో తీవ్రంగా దాడికి గురైన సంజీవ్ మృతి చెందాడు. ఆయన కుటుంబసభ్యులు పోలీసుల నిర్లక్ష్యంపై తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఆరేళ్ళ బాలికపై హత్యాచారం...

గురువారం రాత్రి ఉమ్మడి కరీంనగర్ జిల్లా సుల్తానాబాద్ మండల శివార్లలో హృదయ విదారక ఘటన జరిగింది. ఆరేళ్ల బాలికపై రైస్ మిల్లు కార్మికుడు అత్యాచారం చేసి హత్య చేశాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉత్తరప్రదేశ్‌కు చెందిన నిందితుడు బలరాం మైథా రైస్‌మిల్లులో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. బాధితురాలి తల్లిదండ్రులు పక్కనే ఉన్న మమత రైస్‌మిల్లులో పనిచేస్తున్నారు.

బాలిక తల్లిదండ్రులతో కలిసి రైస్ మిల్లు ప్రాంగణంలో నిద్రిస్తుండగా... బలరాం బాలికను సమీపంలోని పొదల్లోకి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. రాత్రి నిద్ర లేచి చూసేసరికి బాలిక కనిపించకపోవడంతో తల్లిదండ్రులు బాలిక కోసం వెతకగా సమీపంలోని పొదల్లో మృతదేహం కనిపించింది. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న సుల్తానాబాద్ పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. కాగా, బాలికను బలరాం తన భుజాలపై ఎత్తుకుని వెళ్తున్న దృశ్యం రైస్‌మిల్లు ఆవరణలో అమర్చిన సీసీటీవీ కెమెరాలో రికార్డైంది.

కత్తులతో పొడిచి మర్డర్...

హైదరాబాద్ ఆసిఫ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గుర్తు తెలియని వ్యక్తులు కుతుబ్బుద్దీన్ అనే యువకుడిని కత్తులతో విచక్షణ రహితంగా పొడిచి పారిపోయారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న యువకున్ని స్థానికులు మెహిది పట్నం నాలనగర్ లోని ఆలివ్ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

వాటర్ ట్యాంకర్ డ్రైవర్ పై దాడి...

హైదరాబాద్ - అయ్యప్ప సొసైటీలో ఉన్న CGR స్కూల్ హాస్టల్లో వాటర్ నింపుతుండగా తమ వాహనం పోవడానికి లేకుండా అడ్డు పెడతావా అంటూ కొందరు యువకులు వాటర్ ట్యాంకర్ డ్రైవర్ సయ్యద్ సలీం ని తల పగిలేలా కొట్టారు. అయితే తనపై దాడి చేసింది రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డికి సంబంధించిన మనుషులని బాధితుడు ఆరోపించాడు. పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని.. సీఎం సోదరుడు కాబట్టి ఇంత వరకు ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదని బాధితుడు సయ్యద్ సలీం ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.




Read More
Next Story