రూ.11,500కోట్ల బడ్జెట్ ఉన్నా సర్కారు దవాఖానాల్లో ఉచిత మందులేవి?
తెలంగాణలోని సర్కారు దవాఖానాల్లో పేద రోగులకు మందులు అందటం లేదు.రోగులకు డాక్టర్లు ప్రిస్కిప్షన్ రాసి చేతులు దులుపుకుంటున్నారు. మందులు కొనలేక అవస్థలు పడుతున్నారు.
తెలంగాణలో బస్తీ దవాఖానా నుంచి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, జిల్లా కేంద్ర ఆసుపత్రి, హైదరాబాద్ నగరంలోని గాంధీ, ఉస్మానియా, ఫీవర్ ఆసుపత్రుల దాకా మందుల కొరతతో పేద రోగులు నానా పాట్లు పడుతున్నారు.
- తెలంగాణ రాష్ట్రంలో 2024-25ఆర్థిక సంవత్సరంలో ఆరోగ్య, వైద్య, కుటుంబ సంక్షేమ శాఖకు రూ.11,500 కోట్లు కేటాయించినా సర్కారు ఆసుపత్రుల్లో మందుల కొరత పేద రోగులను అల్లాడిస్తూనే ఉంది.
పక్క దారి పట్టిన ప్రజారోగ్యం
తెలంగాణలో ప్రజారోగ్యం పక్క దారి పడుతోంది. భారత రాజ్యాంగంలోని అనుకరణ 47 ప్రకారం ప్రజల జీవన ప్రమాణాలు పెంచేందుకు ప్రజారోగ్యాన్ని మెరుగుపర్చడం ప్రభుత్వాల బాధ్యత. దీనికో కోసం తెలంగాణ సర్కారు ప్రభుత్వ దవాఖానాలను ఏర్పాటు చేసి వేలాదిమంది వైద్యులను నియమించినా, పేద రోగులకు సర్కారు వైద్యం సజావుగా అందకుండా పోతోంది. రోగుల నాడి పట్టుకొని చూసి వివిధ రోగాలకు డాక్టర్లు మందుల చీటి రాసిస్తున్నారు. కానీ సర్కారు దవాఖానాల్లో వారికి మందులను మాత్రం ఉచితంగా అందించడం లేదు. దీంతో పేద రోగులు ప్రైవేటు మెడికల్ స్టోర్లలో మందులు కొనలేక సతమతమవుతున్నారు.
పెద్ద ఆసుపత్రుల్లోనూ ఉచిత మందులేవి?
హైదరాబాద్ నగరంలో పేద రోగులకు వైద్యం అందించేందుకు ఏర్పాటు చేసిన గాంధీ, ఉస్మానియా , ఫీవర్ ఆసుపత్రుల్లోనూ ఉచిత మందులు లేవు. పేరుకు పెద్దాసుపత్రులైన రోగులకు కావాల్సిన మందులు మాత్రం అందుబాటులో లేవు. రోగులను పరీక్షించిన వైద్యులు మందుల చీటీ రాసి పంపిస్తున్నారు. గాంధీ ఆసుపత్రి ఆవరణలోనే ఉన్న ప్రైవేటు మెడికల్ స్టోర్లలో మందులు కొనుక్కోమని వైద్యులు చెబుతున్నారు.
ముందులకు పర్సంటేజీలు...
గాంధీలో పేరుకు జనరిక్ మందుల షాపు ఉన్నా అది ఎప్పుడూ మూతపడి ఉంటోంది. దీంతో రోగులు అధిక ధరలకు మందులు కొనాల్సి వస్తోంది. సర్కారు వైద్యులకు, ప్రైవేటు మందుల దుకాణాల యజమానులకు మధ్య ఉన్న పర్సంటేజీలతో వారు చీటీలు రాసి పంపిస్తున్నారు. మందులే కాదు గాంధీలో కొన్ని రకాల పరీక్షలు కూడా కాసులకు కక్కుర్తి పడి బయటి డయాగ్నోసిస్ సెంటర్లలో చేయించుకోమని పంపిస్తున్నారు.
సెంట్రల్ హెల్త్ స్కీం కింద...
కేంద్రప్రభుత్వ హెల్త్ స్కీం కింద కేంద్ర దవాఖానాల్లో వైద్యులు రోగులకు రాసిన మందులన్నీ ఉచితంగా అందిస్తుంటారు. ఒకవేళ కొన్ని రకాల మందులు లేకుంటే వాటిని బయట నుంచి వారే తెప్పించి ఇస్తారు. కేంద్ర హెల్త్ స్కీం కింద రోగులకు ఒక్క పైసా కూడా ఖర్చు పెట్టే పనిలేదు. కానీ రాష్ట్ర దవాఖానాల్లో మాత్రం మందుల కొరత ఎప్పుడూ ఉంటోంది.
ఉద్యోగులకు సజావుగా అందని మందులు
రాష్ట్ర ప్రభుత్వం ఈహెచ్ఎస్ కింద ప్రభుత్వ ఉద్యోగులకు, జేహెచ్ఎస్ కింద జర్నలిస్టులకు ఉచితంగా మందులు ఇచ్చేందుకు హైదరాబాద్ నగరంలో ఏర్పాటు చేసిన వెల్ నెస్ సెంటర్లలోనూ అన్ని రకాల మందులు అందుబాటులో ఉండటం లేదు.
తగ్గిన ఆరోగ్య శాఖ బడ్జెట్
2024-25 ఆర్థిక సంవత్సరానికి తెలంగాణ ఆరోగ్య, వైద్య, కుటుంబ సంక్షేమ శాఖ బడ్జెట్‌లో అంతకుముందు సంవత్సరంతో పోలిస్తే నిధుల కోత పడింది.2024-25 ఆర్థిక సంవత్సరానికి తెలంగాణ ఆరోగ్య, వైద్య, కుటుంబ సంక్షేమ శాఖ ప్రస్తుత బడ్జెట్ రూ. 11,500 కోట్లు.2023-24 వ ఆర్థికసంవత్సరంలో వైద్యఆరోగ్యశాఖ బడ్జెట్ రూ.12,161 కోట్లు కాగా, ఈ ఆర్థిక సంవత్సరం నుంచి రూ.661 కోట్లు తగ్గింది.
కనీస మందులేవి?
తెలంగాణలోని సర్కారు దవాఖానాల్లో కనీసంగా ఉండాల్సిన మందులు కూడా దొరకడం లేదు.నొప్పులకు వినియోగించే ఎసిక్లోఫినాక్, బలం గోలీలైన బీ కాంప్లెక్స్ విత్ జింక్,యాంటీబయాటిక్స్ అయిన అమాక్సిలిన్ క్లావమ్ సిరప్,సెఫిక్సిమ్ సిరప్,గాయాలకు వినియోగించే పొవిడిన్ ఆయిట్‌మెంట్, అల్ ట్రా సౌండ్ జెల్లీ లాంటివి కూడా ఆసుపత్రుల్లో అందుబాటులో లేవు.
ప్రభుత్వ హెచ్చరికలు బేఖాతరు
సర్కారు ఆస్పత్రుల్లో రోగులకు బయటి మెడిసిన్స్ రాస్తే చర్యలు తప్పవని ప్రభుత్వం వైద్యులను హెచ్చరించినా వైద్యులు బేఖాతరు చేస్తున్నారు. కొందరు వైద్యులు అందుబాటులో ఉన్న ఔషధాలనే బయటకు రాస్తున్నారు.మందుల కొరతతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.మరి కోట్ల రూపాయల బడ్జెట్ ఏమవుతుందని సోషల్ యాక్టివిస్టు సోమ శ్రీనివాసరెడ్డి ప్రశ్నించారు.
కాలం చెల్లిన మందులు
తెలంగాణ రాష్ట్రంలోని సర్కారు దవాఖానాల్లో ఓ వైపు మందుల కొరత వేధిస్తోంది.ఒక వైపు మందుల కొరత ఉండగా మరోవైపు ప్రభుత్వ ఆస్పత్రుల్లో కోట్లాది రూపాయల విలువైన మందుల ఎక్స్‌పైరీ తేదీ ముగిసి వృథా అవుతున్నాయి.వైద్య ఆరోగ్యశాఖ లెక్కల ప్రకారం 2022వ సంవత్సరంలో అన్ని జిల్లాల్లోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో 550 విభాగాలకు చెందిన రూ.50 కోట్ల విలువైన ఔషధాల ఎక్స్‌పైరీ తేదీ ముగిసింది.కొన్ని ఔషధ కంపెనీలు తమ ఉత్పత్తుల ఎక్స్‌పైరీ గడువు సమీపిస్తే వాటిని వెనక్కు తీసుకుంటాయి.
అవసరం లేని మందుల కొనుగోలు
కానీ వైద్యశాఖలో కోట్ల రూపాయల ఔషధాలు ఎందుకు వృథా అవుతున్నాయన్నది ప్రశ్నార్థకంగా మారింది.ప్రభుత్వ ఆస్పత్రుల్లో అవసరాన్ని బట్టి వైద్య ఆరోగ్యశాఖ మందులను కొనుగోలు చేయాలి.అయితే,ఇష్టారాజ్యంగా ఔషధాల కొనుగోలు వ్యవహారం నడుస్తుందన్న ఆరోపణలున్నాయి.అవసరం ఉన్నా లేకపోయినా ఒకే రకమైన ఔషధాలను కొనుగోలు చేస్తున్నారు. వాటి ఎక్స్‌పైరీ దగ్గర పడుతున్న సమయంలో అక్కడి నుంచి జిల్లాల్లోని సెంట్రల్ మెడిసిన్ స్టోర్లకు పంపుతున్నారు.
సర్కారు దవాఖానాల్లో ఉచిత మందులు అందించండి : సీఎంకు ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ లేఖ
సర్కారు దవాఖానాల్లో ఉచిత మందులు అందింలని కోరుతూ ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డికి సోమవారం లేఖ రాసింది. ప్రభుత్వ పెద్ద ఆసుపత్రుల్లో ఏర్పాటు చేసిన ప్రైవేటు మందుల దుకాణాలను మూసివేయించి ప్రభుత్వం ఉచితంగా అన్ని రకాల మందులు, ఇంజక్షన్లను అందించేలా చర్యలు తీసుకోవాలని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ అధ్యక్షుడు యం పద్మనాభరెడ్డి కోరారు.
Next Story