రేషన్, ఆరోగ్యశ్రీ కార్డులకు మళ్ళీ అప్లై చేయాల్సిందేనా
కొత్త రేషన్ కార్డుల కోసం మరోసారి దరఖాస్తులను ఆహ్వానించాలని తెలంగాణ ప్రభుత్వం యోచిస్తోంది.
కొత్త రేషన్ కార్డుల కోసం మరోసారి దరఖాస్తులను ఆహ్వానించాలని తెలంగాణ ప్రభుత్వం యోచిస్తోంది. కొత్త రేషన్‌కార్డులు, కొత్త ఆరోగ్యశ్రీ కార్డుల కోసం వేర్వేరుగా దరఖాస్తులు చేసుకోవాలని, ఇక నుంచి విడివిడిగా మంజూరు చేస్తామని నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి బుధవారం శాసనమండలిలో ప్రకటించారు.
కౌన్సిల్‌లో అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ, దారిద్య్రరేఖకు దిగువన ఉన్న (బీపీఎల్) కుటుంబాలకు ప్రత్యేకంగా కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తామని ఉత్తమ్ స్పష్టం చేశారు. ఆరోగ్యశ్రీ కార్డుల జారీకి సంబంధించిన అర్హత ప్రమాణాలు ఇప్పటికీ క్యాబినెట్ సబ్ కమిటీ పరిశీలనలో ఉన్నాయన్నారు. “మేము నూతన రేషన్ కార్డుల మార్గదర్శకాలను రెండు వారాల్లో ఖరారు చేస్తాము. రేషన్ కార్డుదారులకు బియ్యంతో పాటు ఇతర నిత్యావసర సరుకులను సరఫరా చేసే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది. కొత్త రేషన్ కార్డులకు అర్హత ప్రమాణాలు క్యాబినెట్ సబ్‌కమిటీ సిఫార్సుల ఆధారంగా ఉంటాయి” అని ఆయన చెప్పారు.
కాంగ్రెస్ ఎమ్మెల్సీల సూచనలపై మంత్రి స్పందిస్తూ, కొత్త రేషన్ కార్డులు జారీ చేసే ముందు రాష్ట్ర ప్రభుత్వం దరఖాస్తుదారుల ఆదాయం, భూమి, ఇతర అంశాలను సమీక్షిస్తుందని చెప్పారు. కొత్తవి ఇచ్చే వరకు పాత రేషన్‌కార్డులు చెల్లుబాటు అవుతాయని హామీ ఇచ్చారు. కొత్త రేషన్ కార్డు కోసం దరఖాస్తు ఫార్మాట్ ఖరారు చేయబడుతోందన్న ఆయన... ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియను తాత్కాలికంగా నిలిపివేసారని తెలిపారు.
ప్రజా దర్బార్, ప్రజాపాలన కార్యక్రమాల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఇదివరకే దరఖాస్తులను స్వీకరించింది. కానీ పెండింగ్‌లో ఉన్న దరఖాస్తుల సంఖ్య, కొత్త రేషన్ కార్డుల జారీకి సంబంధిచిన తేదీని ఎందుకు ఖరారు చేయలేదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ సురభి వాణి నిలదీశారు. ప్రజలు కనీస అవసరాలు అందక ఇబ్బంది పడకుండా ప్రభుత్వం ఈ ప్రక్రియను వేగవంతం చేయాలని ఆమె కోరారు. సురభి వాణి ప్రశ్నలకి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పందిస్తూ.. రేషన్ కార్డుల జారీలో జాప్యం వల్ల ఎవరికీ ఇబ్బందులు కలగడం లేదని, ఏమైనా సమస్యలుంటే తగిన విధంగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.