
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల డీఏ బొనాంజ
1.18 కోట్ల మంది ఉద్యోగులు, పెన్షనర్లకు దీపావళి కానుక
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు నరేంద్ర మోదీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. దీపావళి కానుకగా కరవు భత్యాన్ని (డీఏ - Dearness Allowance) 3 శాతం పెంచేందుకు కేంద్ర క్యాబినెట్ ఆమోద ముద్ర వేసింది. ఈ మేరకు కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ బుధవారం వెల్లడించారు.
ఏటా రెండుసార్లు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల డీఏ (DA)ను కేంద్రం సవరిస్తూ ఉంటుంది. పెరుగుతున్న నిత్యావసర ధరలకు పరిహారంగా ఉద్యోగులు, పెన్షనర్లకు ఈ కరవు భత్యాన్ని అందజేస్తారు. 3శాతం పెంపు నిర్ణయంతో 55 శాతంగా ఉన్న డీఏ 58 శాతానికి చేరనుంది.
DA–DR పెంపు వల్ల సుమారు 118 లక్షల మందికి ఊరట లభిస్తుంది. వీరిలో 49 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, 69 లక్షల మంది పింఛనుదారులు ఉన్నారు.
ఈ పెంపు 2025 అక్టోబర్ 1 నుంచి అమల్లోకి వస్తుంది. ప్రస్తుతం ఉన్న 55% DA/DR పై ఈ 3% చేరి 58% అవుతుంది. ఈ పెంపుతో ప్రభుత్వ ఖజానాపై సంవత్సరానికి సుమారు ₹10,083.96 కోట్లు అదనపు భారం పడనుంది.
కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది మార్చిలో 2% DA పెంపు ప్రకటించింది. అది జనవరి 1, 2025 నుంచి అమల్లోకి వచ్చింది. అప్పట్లో DA రేటు 55%కి చేరింది. ఇప్పుడు మరో 3% పెంపుతో అది 58%గా నిలిచింది.
ధరల పెరుగుదలతో (Inflation) ఉద్యోగులు, పింఛన్‌దారులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తొలగించడమే లక్ష్యంగా డీఏ పెంచినట్టు కేంద్రం ప్రకటించింది.
దీనివల్ల వేతన స్థాయిలపై నేరుగా ప్రభావం ఉంటుంది. ఖర్చుల పెరుగుదలలో కొంత ఊరట లభిస్తుంది.
పింఛన్‌దారుల కోసం: వృద్ధాప్యంలో పెరుగుతున్న ఆరోగ్య, దైనందిన ఖర్చులకు మద్దతు.
ప్రభుత్వం కోసం: రాజకీయపరంగా “సానుభూతి చర్య”గా నిలిచే అవకాశం. ఆర్థికపరంగా అయితే, పెరుగుతున్న రెవెన్యూ ఖర్చులో మరో అదనపు భారం.
7వ సెంట్రల్ పే కమిషన్ సిఫార్సుల ప్రకారం DA/DR సవరణలు కొనసాగుతున్నాయి. ధరల పెరుగుదల సమయంలో ఉద్యోగులు, రిటైర్డ్ సిబ్బందికి ఊరట కలిగించాలనే ఉద్దేశంతో కేంద్రం మరోసారి ముందడుగు వేసింది. అయితే ₹10 వేల కోట్లకు పైగా అదనపు ఖర్చు ఫిస్కల్ మేనేజ్‌మెంట్‌పై ఎంత ప్రభావం చూపుతుందో అనేది వచ్చే బడ్జెట్‌లో స్పష్టమవుతుంది.
ఇదిలాఉంటే.. దసరా, దీపావళి సందర్భంగా రైల్వే ఉద్యోగులకు బోనస్ చెల్లించేందుకు కేంద్ర క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. 78 రోజుల వేతనాన్ని ‘ఉత్పాదకతతో ముడిపడిన బోనస్’ (PLB) రూపంలో చెల్లించేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయంతో మొత్తం 10.91 లక్షల మంది ఉద్యోగులకు ప్రయోజనం చేకూరనుంది.
Next Story