గద్దర్ తిరస్కరించిన నంది అవార్డు కే ఆయన పేరేంటీ?
x

గద్దర్ తిరస్కరించిన "నంది అవార్డు' కే ఆయన పేరేంటీ?

తన ఆటపాటలతో సమాజంలో చైతన్యం నింపిన గద్దర్ పేరు మీద సినిమా అవార్డులు ఏమిటి? అయినా ఆయన ఆ అవార్డును తిరస్కరించారుగా.



-రమణాచారి*

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా, రాజకీయ లబ్ధి పొందేందే ఆలోచనతో హడావిడిగా గద్దర్ అవార్డు ను ప్రకటించింది. కానీ, సినిమా రంగంలో ఇచ్చే అవార్డు నంది అవార్డు పేరు మార్చి గద్దర్ అవార్డు గా ప్రకటించడం వలన వివాదాస్పదమైంది. సినిమా రంగానికి గద్దర్ కు పెద్దగా సంబంధం లేక పోవడం, దానిని ఆయన వ్యతిరేకించడం వలన కూడా అవార్డు ప్రకటన మరింత వివాదాస్పదంగా మారింది.

ప్రభుత్వానికి గద్దర్ మీద ప్రేమ, అభిమానం ఉంటే గద్దర్ పేరుతో ప్రత్యేకంగా ఒక అవార్డు ఏర్పాటు చేసి ఉంటే బాగుండేది. దానిని ఆయన అభిమానించే, పీడిత ప్రజల విముక్తి కోసం, చైతన్య పరిచే కళాకారులకు ,పాటలకు, రచనలకు ఇస్తే సముచితంగా ఉండేది. అవార్డును ,ఆయన విప్లవ జీవితానికి దగ్గరగా, పీడిత తాడిత ప్రజా జీవితాల్లో వెలుగులు నింపే అణగారిన జీవితాలను మార్పు తెచ్చే కళా ప్రదర్శనలకు పెద్ద పీటగా గౌరవించి ఇస్తామని ప్రకటిస్తే బాగుండేది. అప్పుడు ఆయనకు ఇచ్చే నిజమైన గౌరవంగా గుర్తింపు ఉండేది.

తొలితరం సినిమా ల కోసం అభ్యుదయ రచయితలు ఆరుద్ర , శ్రీశ్రీ వంటి వారు సినిమాల కోసం పాటలు, మాటలు వ్రాశారు కదా! మరి అలాంటప్పుడు గద్దర్ కూడా సినిమాలలో నటించారు కదా! పాటలు వ్రాసారు కదా. ఈ అవార్డు విషయంలో ఎందుకు ఇంత వివాదం అన్నది ప్రశ్న? ఆర్ట్ లవర్స్ నుండి జననాట్య మండలి, విప్లవోద్యమానికి గద్దర్ ను పరిచయం చేసిన దార్శనికుడు బి. నర్సింగరావు. తెలంగాణ సాయుధ పోరాట నేపథ్యంతో గౌతం ఘోష్ దర్శకత్వం వహించిన మాభూమి సినిమా లో గద్దర్ ఆడిపాడాడు. అంత్యంత కళాత్మకంగా బి. నర్సింగ రావు రూపొందించిన రంగుల కల లో కనిపించారు . ప్రత్యేక తెలంగాణ భూమికగా నిమ్మల శంకర్ దర్శకత్వంలో చిత్రించిన జై బోలో తెలంగాణ సినిమా పాట రచించి నటించడమే కాకుండా, తన ఆట- పాట తో ఉర్రూతలూగించారు. కాబట్టి సినిమా అవార్డు ఇస్తే తప్పు ఏమిటి? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. నాటి సినిమాల కాలపు సామాజిక పరిస్థితులు, చైతన్యం రగిలించే పాటలు, చిత్రీకరణ సమాజానికి ఆదర్శంగా, దోపిడీ -పీడనలపై తిరుగుబాటు బావుటా ఎగరేసేవిగా ఉండేవి.అందుకే సామాజిక మాధ్యమాల్లో ప్రతిభావంతమైన సినిమా బాటను అనివార్యంగా ఆరుద్ర, శ్రీ శ్రీ లు ఎంచుకున్నారు. ప్రస్తుతం వస్తున్న సినిమాలు అత్యధికంగా సామాజిక పెఢదోరణిలో వస్తున్నాయి . ఐటెం సాంగ్ లతో, హింసను ప్రేరేపించే విధంగా, యువతను నిర్వీర్యం చేసేవిధంగా ఉంటున్నాయి. సామాజిక బాధ్యత దూరం చేసి,కనుమరుగు చేస్తున్నాయి. అందుకే గద్దర్ పేరుతో ప్రత్యేక అవార్డు కై డిమాండ్ ముందుకొచ్చింది.

నంది అవార్డు ల విషయంలో మనం పరిగణలోకి తీసుకొని పరిశీలించాల్సిన మరో ముఖ్యమైన విషయం ఉంది. దర్శకరత్న దాసరి నారాయణరావు దర్శకత్వంలో వచ్చిన ఒరేయ్ రిక్షా (1995) సినిమాలో మల్లె తీగకు పందిరి ఓలె అనే పాటకు , నిమ్మల శంకర్ దర్శకత్వంలో వచ్చిన జైబోలో తెలంగాణ చిత్రం లో పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా! పోరు తెలంగాణమా! అనే పాటకు ప్రభుత్వం నందిఅవార్డులు ప్రకటించింది. గద్దర్ , నంది అవార్డులు తిరస్కరించాడు. ఈ విషయాలను పరిగణలోకి తీసుకోవడం ఎంతైనా అవసరం. ఇలాంటి ప్రత్యేక పరిస్థితుల్లో గద్దర్ పేరుతో ప్రత్యేక అవార్డు ఇస్తే బాగుంటుంది అని భావించడంమే తప్ప మరో కోణం లేదు.

బుద్ధిజీవులు శాస్త్రీయంగా ఆలోచన చేయాలి. గద్దర్ పేరుతో అవార్డు ఇవ్వడానికి ఎవరికీ అభ్యంతరం లేదు, ఉండాల్సిన అవసరమూ లేదు. గద్దర్ అవార్డు అనేది ఆయన ఆశయాలకు, ఆకాంక్షలకు ప్రతిబింబంగా ,సరైన న్యాయం చేసేదిగా ఉండాలన్నదే మెజారిటీ ప్రజల ఆలోచన. విషయాలను ఆసాంతం అవగాహన చేసుకుంటే నంది అవార్డు పేరు మార్చి- గద్దర్ అవార్డు గా ప్రకటించడం సమర్ధనీయం కాదన్నది స్పష్టం గా అర్ధమౌతుంది. ప్రత్యేకంగా గద్దర్ అవార్డు ఏర్పాటు చేసినప్పుడే సామాజిక ప్రయోజనం నెరవేరుతుంది .గద్దర్ ఆశయాలను, అభిప్రాయాలను గౌరవించినట్లవుతుంది .


(*చెన్నోజు రమణాచారి, విశ్రాంత ఉపాధ్యాయుడు, ప్రత్యేక తెలంగాణ ఉద్యమకారుడు)

Read More
Next Story