
మళ్ళీ కోర్టుకెళ్లిన గాలి.. ఈసారి దేనికోసమంటే..!
తనకు చంచల్ గూడ జైలులో ఏ’ క్లాస్ సౌకర్యాలు కల్పించాలని గాలి అభ్యర్థించారు.
ఓబుళాపురం మైనింగ్ కేసులో గాలి జనార్ధన్ రెడ్డికి నాంపల్లి కోర్టు ఏడేళ్ల జైలు శిక్ష విధించింది. ఆయనకు వాస్తవానికి యావజ్జీవ శిక్ష వేయాల్సి ఉండగా.. ఇప్పటికే ఆయన చాలా కాలం జైలులో ఉండటంతో ఆ సమాన్ని కూడా పరిగణలోకి తీసుకుని న్యాయస్థానం ఏడేళ్ల జైలు శిక్ష విధించింది. కాగా తాజాగా గాలి జనార్ధన్ రెడ్డి మరోసారి కోర్టును ఆశ్రయించారు. జైలులో తనకు కావాల్సిన సౌకర్యాలపై నాంపల్లిలోని సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తనకు అదనపు సౌకర్యాలు కల్పించడానికి అనుమతించాలని ఆయన తన పిటిషన్‌లో పేర్కొన్నారు. తనకు చంచల్ గూడ జైలులో ఏ’ క్లాస్ సౌకర్యాలు కల్పించాలని పేర్కొన్నారు. ఆయన పిటిషన్ ప్రస్తుతం రిజిస్ట్రీ పరిశీలనలో ఉంది.
అదనపు సౌకర్యాలు అంటే.. జైలులో సపరేట్ రూమ్, బెడ్, టీవీ, ఎయిర్ కూలర్ ఇంకా వీలయితే ఏసీ ఇలా సకల సౌకర్యాలు కల్పిస్తారు. ఇందుకు ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయదు. కోర్టు అనుమతిస్తే అన్ని సౌకర్యాలకు గాలి జనార్ధన్ రెడ్డే ఖర్చు పెట్టుకుంటారు. కానీ జైలును ఒక స్పెషల్ అండ్ పర్సనల్ రూమ్‌గా మార్చుకుంటారు. కొందరు ప్రత్యేక వంట మనిషిని కూడా పెట్టుకుంటారు. అదే విధంగా ఇప్పుడు తనకు కూడా అదనపు సౌకర్యాలకు అనుమతి ఇవ్వాలని గాలి జనార్ధన్ రెడ్డి కోరారు.
శిక్ష తగ్గించిన కోర్టు..
నిజానికి గాలి జనార్ధనరెడ్డికి కోర్టు యావజ్జీవ శిక్షను విధించాల్సుంది. అయితే విచారణ సమయంలోనే గాలి కొంతకాలం జైలులో గడిపిన విషయాన్ని పరిగణలోకి తీసుకున్న కోర్టు శిక్షను ఏడేళ్ళుగా ఖరారుచేసింది. ఇదే విషయాన్ని జడ్జి చెప్పారు. శిక్షను ఖరారుచేయకముందే గాలి జడ్జితో మాట్లాడుతు తానుచేసిన సమాజసేవను, వయసును దృష్టిలో ఉంచుకుని తక్కువ శిక్షను విధించమని రిక్వెస్టు చేసుకున్నాడు. దానికి జడ్జీ బదులిస్తు యావజ్జీవ శిక్షను విధించాల్సున్నా గతంలోనే అనుభవించిన జైలు జీవితాన్ని దృష్టిలో పెట్టుకునే ఏడేళ్ళు శిక్ష విధించినట్లు తీర్పు తర్వాత వ్యాఖ్యానించారు. అలాగే అప్పట్లో గనుల శాఖకు డైరెక్టరుగా పనిచేసిన వీడీ రాజగోపాల్ కు అదనంగా మరో నాలుగేళ్ళు శిక్ష విధించారు. ఎందుకంటే గనుల శాఖ డైరెక్టరుగా ఉంటు ప్రభుత్వ సంపదను కాపాడి, ప్రభుత్వానికి ఆదాయం తీసుకురావాల్సిన పోస్టులో ఉండి అవినీతికి పాల్పడినందుకు అవినీతి నిరోదక శాఖ(ఏసీబీ) చట్టం కింద అదనంగా 4 ఏళ్ళు శిక్షను విధించినట్లు కోర్టు ప్రకటించింది. విచారణ సమయంలో లింగారెడ్డి అనే నిందితుడు మరణించటంతో ఆయన్ను తప్పించారు. కోర్టు తీర్పు తర్వాత గాలి తరపు లాయర్ మాట్లాడుతు సీబీఐ కోర్టు తీర్పును తాము పై కోర్టులో చాలెంజ్ చేస్తున్నట్లు చెప్పారు. హయ్యర్ కోర్టులో అప్పీల్ చేసుకునే హక్కు తమ క్లైంట్లకు ఉందని లాయర్ చెప్పారు.