బీఆర్ఎస్ పై గాంధీ ఎదురుదాడి
x
Gandhi with Revanth

బీఆర్ఎస్ పై గాంధీ ఎదురుదాడి

పబ్లిక్ ఎకౌంట్స్ కమిటి ఛైర్మన్ పదవిని ప్రతిపక్షాలకు ఇచ్చే సంప్రదాయం ప్రకారమే అసెంబ్లీ స్పీకర్ తనకు ఇచ్చారని గాంధి అంటున్నారు.


శేరిలింగంపల్లి బీఆర్ఎస్ ఫిరాయింపు ఎంఎల్ఏ అరెకపూడి గాంధి పార్టీపై ఎదురుదాడి మొదలుపెట్టారు. పబ్లిక్ ఎకౌంట్స్ కమిటి ఛైర్మన్ పదవిని ప్రతిపక్షాలకు ఇచ్చే సంప్రదాయం ప్రకారమే అసెంబ్లీ స్పీకర్ తనకు ఇచ్చారని గాంధి అంటున్నారు. బీఆర్ఎస్ తరపున 2023 ఎన్నికల్లో శేరిలింగంపల్లిలో గెలిచిన గాంధి కొద్దిరోజుల క్రితం తన మద్దతుదారులతో కాంగ్సెస్ లో చేరారు. రేవంత్ రెడ్డి సమక్షంలోనే గాంధి కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకున్నారు. సాంకేతికంగా గాంధి బీఆర్ఎస్ ఎంఎల్ఏనే అయినప్పటికీ ఉంటున్నది మాత్రం హస్తంపార్టీలోనే అని అందరికీ తెలుసు.

ఎప్పుడైతే పీఏసీ ఛైర్మన్ పదవిని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ పిరాయింపు ఎంఎల్ఏ గాంధికి ఇచ్చారో బీఆర్ఎస్ నేతలకు మండిపోయింది. ఇదే విషయమై పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీమంత్రి, గజ్వేలు ఎంఎల్ఏ హరీష్ రావు తదితరులు స్పీకర్ చేసేన నియామకంపై నానా గోలచేస్తున్నారు. సాయంత్రం గవర్నరు జిష్ణుదేవ్ వర్మ ను కలిసి స్పీకర్ పై ఫిర్యాదు కూడా చేయబోతున్నారు. కారుపార్టీ ప్రజాప్రతినిధులు, నేతలు రెచ్చిపోతున్న తీరు చూసిన తర్వాత పీఏసీ ఛైర్మన్ పోస్టులో గాంధిని నియమించటం బీఆర్ఎస్ లో ఎంతటి చిచ్చుకు దారితీసిందో అర్ధమైపోతోంది.

ఇదే విషయమై గాంధి మాట్లాడుతు ప్రతిపక్షాలకు ఇవ్వాల్సిన పీఏసీ ఛైర్మన్ పోస్టు బీఆర్ఎస్ ఎంఎల్ఏ అయిన తనకు ఇవ్వటంలో తప్పేముందని చాలా అమాయకంగా ప్రశ్నించారు. తాను కాంగ్రెస్ లో చేరినట్లు బీఆర్ఎస్ నేతలు చెప్పటాన్ని కొట్టిపారేశారు. నియోజకవర్గం డెవలెప్మెంట్ కోసం, నిధుల కోసమే తాను రేవంత్ ను కలిశానని సమర్ధించుకుంటున్నారు. దేవాలయాల్లో ప్రముఖులకు కప్పే శాలువానే తనకు రేవంత్ కప్పారు కాని కాంగ్రెస్ పార్టీ కండువా కాదంటున్నారు. మూడుసార్లు గెలవటం, అతిపెద్ద నియోజకవర్గం కావటంతోనే పీఏసీ ఛైర్మన్ పదవిని తనకు ఇవ్వాలని స్పీకర్ కు అనిపించుంటుందని గాంధి అభిప్రాయపడ్డారు.

ఫిరాయింపుల గురించి మాట్లాడాలంటే బీఆర్ఎస్ గురించి కూడా చాలా మాట్లాడాల్సుంటుందన్నారు. ఈ విషయమై డిబేట్ కు కారుపార్టీతో తాను సిద్ధంగా ఉన్నట్లు కూడా చాలెంజ్ చేశారు. టీడీపీ తరపున గెలిచిన తనను పార్టీలో ఎలా చేర్చుకున్నారో చెప్పాలంటు కేసీఆర్ను నిలదీశారు.

ఎంఐఎంకు ఎలాగిచ్చారు ? దానం

పీఏసీ ఛైర్మన్ పదవిని గాంధికి ఇవ్వటంలో తప్పేమీ లేదని ఖైరతాబాద్ ఎంఎల్ఏ దానం నాగేందర్ అన్నారు. పీఏసీ ఛైర్మన్ పదవిని ప్రతిపక్షాలకు ఇవ్వటమే న్యాయం, రాజ్యాంగబద్ధమైతే మరి కాంగ్రెస్ ను కాదని ఆ పదవిని కేసీఆర్ ఎంఐఎంకు ఎలా కట్టబెట్టారని నిలదీశారు. బీఆర్ఎస్ తరువాత అసెంబ్లీలో అతిపెద్ద పార్టీ అయిన కాంగ్రెస్ కు పీఏసీ ఛైర్మన్ పదవి ఇవ్వకుండా ఎంఐఎంకు కేసీఆర్ ఎందుకిచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. అధికారంలో ఉన్నపుడు కేసీఆర్ చేసింది కరెక్టే అయితే ఇపుడు స్పీకర్ చేసింది కూడా కరెక్టే అని దానం అన్నారు.

Read More
Next Story