జినోమ్ ఎడిటింగ్‌పై మీడియా పరిజ్ఞానం అరకొరే!
x

జినోమ్ ఎడిటింగ్‌పై మీడియా పరిజ్ఞానం అరకొరే!

కార్పొరేట్ కథనాలు వండివార్చుతూ రైతుల్ని మభ్యపెడుతున్నారా?


జినోమ్ ఎడిటింగ్ (విదేశీ జీన్స్ కాకుండా స్వదేశంలోనే ఏదైనా పంట జన్యువులను (జీన్స్) మార్పిడి చేయడం)పై మీడియాలో అసత్య, అర్థసత్య కథనాల ప్రసారం, ప్రచారం జరుగుతోందని, అరకొర జ్ఞానంతో వార్తలను రాసి రైతుల్ని గందరగోళంలోకి నెట్టవద్దని ICAR ఐసీఏఆర్ (భారత వ్యవసాయ పరిశోధన మండలి గవర్నింగ్ బాడీ మాజీ సభ్యుడు, విజిల్ బ్లోయర్ వేణుగోపాల్ బాదరవాడ విజ్ఞప్తి చేశారు. జన్యు మార్పిడికి (జెనిటికల్లీ మోడిఫైడ్) జినోమ్ ఎడిటింగ్ కి తేడా ఉందని, ఆ విషయం తెలియకుండానే “జి నోమ్ ఎడిటింగ్” ఒక కొత్త సాంకేతికత అంటూ రాయడాన్ని కూడా ఆయన ప్రశ్నించారు.

అసలింతకీ జినోమ్ ఎడిటింగ్ అంటే ఏమిటీ?

పంటల్లో చిన్న మార్పులు చేసి వాటిని బలంగా తీర్చిదిద్దడం, తెగుళ్లు, ఇతరత్రా రోగాలు తట్టుకునేలా మార్చడాన్ని జినోమ్ ఎడిటింగ్ అంటుంటారు మామూలు పరిభాషలో.
ఈ మార్పుల్లో విదేశీ జన్యువులను పెట్టడం లేదు అనేది కొందరు శాస్త్రవేత్తలు చెబుతున్న మాట. అంటే GM పంటల్లాగ కాకుండా, “మన పంటల్లోనే ఉన్న జీన్స్ నే మార్చుతాం” అని చెబుతున్నారు. ప్రభుత్వం 2022–24 నుంచి ఈ పంటలపై కఠిన నియంత్రణలు లేకుండా చేస్తోంది. దీంతో పరీక్షలు, అనుమతులు, మంజూరీలు వేగంగా జరగొచ్చు. ఈ టెక్నాలజీ వల్ల దిగుబడి పెరుగుతుందని ICAR శాస్త్రవేత్తలు అంటున్నారు. ఉదాహరణకు “సాంబ మసూరి” వరి దిగుబడిలో 19% పెరిగిందని ఇటీవల ఓపత్రికలో వచ్చిన కథనం. దేశంలో 24 ప్రధాన పంటల్లో 178 జీన్లపై ప్రయోగాలు జరుగుతున్నాయి. ఇది పెద్ద పురోగతిగా ఐసీఏఆర్ శాస్త్రవేత్తలు కూడా చెబుతున్నారు.
ఒక్కమాటలో చెప్పాలంటే “జీనోమ్ ఎడిటింగ్ మంచిది, వేగంగా అభివృద్ధికి దారి తీస్తుంది” అనేది ఐసీఏఆర్ శాస్త్రవేత్తలతో పాటు జెన్యుమార్పిడి పంటలకు అనుకూలంగా ఉన్న వర్గాల వాదన.
మరి వేణుగోపాల్ లాంటి వారు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు?
వేణుగోపాల్ ఏమంటారంటే...
ఈ సాంకేతికత పూర్తిగా సేఫ్ కాదు. CRISPR లాంటి జీన్లు కట్ చేయడంలో తప్పు జరిగినా, అప్లికేషన్ లో లోపం జరిగినా పంటల్లో అనుకోని మార్పులు రావచ్చు. పోషక విలువల్లో మార్పు వస్తుంది, కొత్త రకాల అలెర్జీలు రావచ్చు. “మన జీన్లనే మార్చుతున్నాం” అని చెప్పడం ప్రమాదం తగ్గించదు అని ఆయన అంటున్నారు.
ఈ తరహా ఎడిటింగ్ జరగాలన్నా ముందు ప్రజాభిప్రాయాన్ని సేకరించాలి. ప్రభుత్వ ఆధ్వర్యంలోనే పరీక్షలు జరగాలి. పర్యావరణ అనుమతులు ఇవ్వాలి. గత రెండేళ్లలో ఇటువంటివి ఏమీ జరక్కుండానే genome-edited పంటలకు అనుమతులు ఇస్తున్నారన్నది వేణుగోపాల్ ఆరోపణ.
ఏదైనా జినోమ్ ఎడిటింగ్ పంటలకు అనుమతి ఇవ్వాలంటే పర్యావరణ శాఖ అనుమతి ఇవ్వాలి. దీర్ఘకాల పరీక్షలు జరగాలి. అలెర్జీ వంటి ఇతర పరీక్షలు నిర్వహించాలి. జనాభిప్రాయం కనుక్కోవాలి. రైతుల హక్కుల రక్షణకు పూచీ ఏర్పడాలి. ఇవేవీ లేకుండానే అనుమతులు ఇస్తున్నారని ఆయన ఆరోపిస్తున్నారు.
“ఇది శాస్త్రీయ పురోగతి కాదు, ప్రభుత్వం తన బాధ్యత నుంచి తప్పించుకోవడం” అని అంటున్నారు. జినోమ్ ఎడిటింగ్ వల్ల రైతుల విత్తన స్వేచ్ఛ ప్రమాదంలో పడుతుందన్నది ప్రధాన సమస్య.
ఈ కొత్త విత్తనాల యాజమాన్యం ఎవరిది?
రైతులు విత్తనాలు భద్రపరచగలరా?
కంపెనీలు తర్వాత పేటెంట్ తీసుకుంటే మామూలు రైతుల పరిస్థితి ఏమిటీ?
జీనోమ్ ఎడిటింగ్ పేరుతో భారతీయ పంటలు ప్రైవేట్ కంపెనీల చేతుల్లోకి వెళ్లే ప్రమాదం ఉంది అంటున్నారు వేణుగోపాల్. ఆయనే కాదు ఆయన లాంటి చాలామంది ఇదే అభిప్రాయంతో ఉన్నారు. ప్రముఖ పర్యావరణ వేత్త, ఖాదీ గ్రామీణ బోర్డు మాజీ సభ్యుడు డాక్టర్ దొంతి నరసింహారెడ్డి కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
సాంబ మసూరిలో “19% దిగుబడి పెరిగింది” అని ICAR శాస్త్రవేత్తలు చెప్పడానికి డేటా ఎక్కడ? అని వారు ప్రశ్నించారు.
వేణుగోపాల్ వాదన ప్రకారం- ICAR లో డేటా లేదు. దొడ్డిదారిన ప్రమోట్ అయిన అధికారులు రైతు వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ ఆరోపిస్తున్నారు.

GE పంటలపై డేటా ప్రజలకు ఇవ్వలేదని, పరీక్షల ఫలితాలు ఎక్కడా ప్రచురించలేదని, “డేటా లేకుండా చెప్పే దిగుబడి కథలు శాస్త్రం అవుతుందా” అని ఆయన ప్రశ్నిస్తున్నారు.

జీనోమ్ ఎడిటింగ్‌కు భద్రతా ముప్పు కూడా ఉందన్నది ఆయన వాదన. ఆయన ఇలా అంటున్నారు... "ఈ టెక్నాలజీ మంచి పనులతో పాటు తప్పుడు పనులకూ వాడొచ్చు. పంటల భద్రత జాతీయ భద్రత. కార్పొరేట్లు ఇచ్చే కథనాలను వండి వారిస్తే రైతులు నష్టపోతారు. మీడియాకి కూడా సామాజిక బాధ్యత ఉంది"
ప్రయోగాలు చేయడానికి భారతీయ రైతులు గిన్నీపిగ్స్ కాదని, భారతీయ జర్మీప్లాజం కార్పొరేట్ సంస్థల సంపత్తి కాదని, రాజ్యాంగ హక్కులను ఇది కాలరాస్తుందని, అందువల్ల ప్రభుత్వ ప్రత్యక్ష పర్యవేక్షణ తప్పనిసరి అని అంటున్నారు. ఈ నేపథ్యంలో నిజానిజాలు తెలుసుకోకుండా, డేటా లేకుండా రాయవద్దని మీడియాకు హితవు పలికారు.
Read More
Next Story