రుణమాఫీ జరగకపోవటానికి కారణాలు ఇవే
రుణమాఫీ అంతా పెద్ద మాయగా ప్రతిపక్షాలు బీజేపీ, బీఆర్ఎస్ నేతలు ఆరోపణలు, విమర్శలు గుప్పిస్తున్నారు. అర్హతలుండి కూడా చాలామందికి రుణమాఫీ కావటంలేదని మండిపోతున్నారు.
రుణమాఫీ అంశం ఇపుడు తీవ్ర చర్చనీయాంశమవుతోంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం రు. 2 లక్షల లోపు ఉన్న రైతు రుణాలను ప్రభుత్వం మాఫీ చేస్తుందని రేవంత్ రెడ్డి పదేపదే చెబుతున్నారు. ఇప్పటికి రెండు విడతల్లో సుమారు 18 లక్షల మంది రైతులకు రు. 12500 కోట్ల రుణాలు మాఫీ అయినట్లు ప్రభుత్వం ప్రకటించింది. మూడో విడత రుణమాఫీ రేవంత్ అమెరికా పర్యటన నుండి తిరిగి వచ్చిన తర్వాత అంటే ఈనెల 14 లేదా 15 తేదీల్లో జరిగే అవకాశముంది. కాంగ్రెస్ పార్టీ అంటేనే విశ్వసనీయతకు మారుపేరని, ఎన్నికల సమయంలో హామీ ఇచ్చినట్లుగానే రుణమాఫీ చేస్తున్నట్లు రేవంత్ తో పాటు మంత్రులు పదేపదే ప్రచారం చేసుకుంటున్నారు.
ఇదే సమయంలో రుణమాఫీ అంతా పెద్ద మాయగా ప్రతిపక్షాలు బీజేపీ, బీఆర్ఎస్ నేతలు ఆరోపణలు, విమర్శలు గుప్పిస్తున్నారు. అర్హతలుండి కూడా చాలామందికి రుణమాఫీ కావటంలేదని మండిపోతున్నారు. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం అన్నీ అర్హతులుండి రుణమాఫీ కాని రైతుల సంఖ్య సుమారు 8 లక్షలుంటుంది. తమకు అన్నీ అర్హతులుండి రుణమాఫీ కాకపోవటం అన్యాయమని వీళ్ళు నానా గోలచేస్తున్నారు. వివిధ సాంకేతిక కారణాలతో సుమారు 18 వేల మంది రైతులకు రుణమాఫీ కాలేదని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావే ప్రకటించారు. వీరికి అందాల్సిన రుణమాఫీ లబ్ది సుమారు 84 కోట్ల రూపాయలు. బ్యాంకుల్లో సాంకేతిక సమస్యలు సర్దుబాటు కాగానే వీళ్ళకంతా రుణమాఫీ అవుతుందని మంత్రి భరోసా ఇస్తున్నారు.
అయితే ఒక అధ్యయనం ప్రకారం అనేక కరణాలతో లక్షలమంది రైతులకు రుణమాఫీ జరగలేదు. ఈ కారణాల్లో రైతుల తరపున జరిగిన పొరబాట్లు, సాఫ్ట్ వేర్ లో దొర్లిన తప్పులు, బ్యాంకులపరంగా జరిగిన తప్పులు కూడా ఉన్నాయి. రైతుల తరపున పొరబాట్లలో కొన్నింటిని పరిశీలిస్తే కొన్ని విషయాలు బయటపడ్డాయి. అదేమిటంటే పట్టాదార్ పాస్ పుస్తకాల్లోను బ్యాంకు ఖాతాల్లో పేర్లలో తేడాలుండటం. ఉదాహరణకు పట్టాదార్ పుస్తకంలో సాలూరి రామయ్య అనుంటే బ్యాంకు ఖాతాలో ఎస్ రామయ్య అనుంది. పట్టాదారు పాస్ పుస్తకంలో బ్యాంకు ఖాతాలో పేరు వేర్వేరుగా ఉన్నట్లు రామయ్యకు తెలిసినా ఇంతకాలం పట్టించుకోలేదు. బ్యాంకులు కూడా దీన్ని లైటుగా తీసుకున్నాయి. ఇపుడు రుణమాఫీ విషయానికి వచ్చేటప్పటికి సమస్య కీలకంగా మారింది.
అలాగే కొందరు రైతుల ఆధార్ కార్డులు బ్యాంకు ఖాతాలతో అనుసంధానం కాలేదు. బ్యాంకు ఖాతాలను ఆధార్ కార్డలతో లింకేజి చేసుకోమని ప్రభుత్వం చెబుతున్నా రైతులు పట్టించుకోలేదు. అలాగే కొందరి పేర్లు ఆధార్ కార్డులో ఒకలాగ, బ్యాంకు ఖాతాలో మరోలాగ ఉన్నాయి. ఉదాహరణకు మహబూబ్ నగర్ జిల్లాలోని గండీడ్ లో ఉండే భగవంత్ అనే రైతు పేరు ఆధార్ కార్డులో సండ్రాస్ భగవంత్ అనుంది. అదే పాస్ పుస్తకంలో ఎస్ భగవంత్ అని మాత్రమే ఉంది. దాంతో రుణమాఫీకి రూపొందించిన ప్రత్యేక సాఫ్ట్ వేర్ భగవంత్ పేరును తీసుకోలేదు. ఆధార్ కార్డులో పేరు, బ్యాంకు ఖాతాలో పేరు వేర్వేరుగా ఉన్నట్లు భగవంత్ కు తెలిసినా ఇంతకాలం పట్టించుకోలేదు. రుణమాఫీకి బ్యాంకు ఖాతాలు, రేషన్ కార్డులు, ఆధార్ కార్డులు చాలా అవసరమని ప్రభుత్వం మొదటినుండి చెబుతునే ఉన్నది.
రుణాలు తీసుకున్న కొందరు చనిపోయారు. అయితే ఆ విషయలను రైతులు బ్యాంకులకు తెలియజేయలేదు. దాంతో రుణాలేమో చనిపోయిన వారిపేరుతో ఉన్నా బ్యాంకుల్లో వారసులు డెత్ సర్టిఫికేట్ ఇవ్వలేదు. అలాగే రేషన్ కార్డులు, ఆధార్ కార్డుల నుండి వాళ్ళ పేర్లు తొలగించలేదు. దాంతో ఇపుడు రైతురుణమాఫీ అమల్లోకి వచ్చేటప్పటికి సమస్యలు బయటపడుతున్నాయి. ఎందుకంటే రైతురుణమాఫీ జరగాలంటే రుణాలు తీసుకున్న వాళ్ళే దరఖాస్తుల్లో సంతకాలు చేయాల్సుంటుంది. రుణాలు ఒకరు తీసుకుని రుణమాఫీకి మరొకరు దరఖాస్తు ఇస్తే ప్రభుత్వం ఎలాగ అనుమతిస్తుంది ? మరికొందరు రైతుల ఆధార్ కార్డుల్లో పేర్లకు, బ్యాంకు పాస్ పుస్తకాల్లో పేర్లకు తేడాలున్నాయి. రుణం తీసుకున్నది, ఇపుడు దరఖాస్తు ఇచ్చింది ఒకే రైతు. అయితే బ్యాంకు, ఆధార్ కార్డుల్లోని పేర్లలో అక్షరదోషాల కారణంగా రుణమాఫీని సాఫ్ట్ వేర్ అంగీకరించలేదు.
రుణాలు తీసుకున్న వాళ్ళ పరంగా జరిగిన ఇలాంటి పొరబాట్లను పక్కనపెట్టేస్తే ప్రభుత్వం రెడీచేసిన సాఫ్ట్ వేర్ కారణంగా మరికొందరు రైతులు నష్టపోయారు. లబ్దిదారుల పేర్లను జాబితాలో ఎక్కించేటపుడు జరిగిన పొరబాట్లు రైతులకు తలనొప్పిగా తయారైంది. అలాగే బ్యాంకుల నుండి రుణమాఫీ కోసం ప్రభుత్వానికి అందిన లబ్దిదారుల జాబితాలో కూడా తప్పులు జరిగాయి. దానివల్ల మరికొందరు రైతులు నష్టపోయారు. ఇలాంటి తప్పులు, పొరబాట్లు, సాఫ్ట వేర్ ఎర్రర్స్ ను సరిచేయాలంటే సమయం పడుతుంది. రుణమాపీ విషయంలో తొందరలోనే ప్రభుత్వం బ్యాంకులు, అధికారులతో గ్రామసభలు నిర్వహిస్తామని చెబుతోంది. కాబట్టి గ్రామసభలు మొదలయ్యేలోగా రైతులు తమ పక్షాన జరిగిన పొరబాట్లను సర్దుబాటు చేసుకోవాలి. అప్పుడు గ్రామసభల్లో ప్రభుత్వ, బ్యాంకు అధికారుల సమక్షంలో మిగిలిన తప్పులను సరిచేసుకుంటే రుణమాఫీ జరిగే అవకాశం ఉంది.