
టైమైపోతుంటే.. GHMC కార్పొరేటర్ల స్టడీ టూర్లతో ఒరిగేదేమిటీ?
పైసాపైసా కూడబెట్టి రైతులకు రుణమాఫీ చేశామని చెబుతున్న సి.ఎం. రేవంత్ సర్కార్ ఇలాంటి దుబారా ఖర్చులను ప్రోత్సహిస్తుందా?
జీ.హెచ్.ఎం.సీ పరిస్థితి ఎలా ఉందంటే....
ఒక పక్క ఉద్యోగుల నెలవారీ జీతాలు చెల్లించలేక అల్లాడిపోతోంది. మరో వైపు కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించలేక పనులు ముందుకు సాగని పరిస్థితి. ఆర్థికంగా కుదేలు కావటంతో రొటీన్ మెయింటనెన్స్ గగనంగా మారిన సంగతి తెలిసిందే. పంజాగుట్ట, అమీర్‌పేట బల్దియా మార్కెట్ల ఆధునీకరణ కోసం టెండర్ల ప్రక్రియను చేపట్టి, ఏజెన్సీలు ఖరారైన తర్వాత వర్క్ ఆర్డర్లు ఇవ్వకుండా బ్రేక్ వేశారంటే జీహెచ్ఎంసీ ఆర్థిక సంక్షోభం తీవ్రతను అంచనా వేయవచ్చు.
ఖజానాలో చిల్లి గవ్వలేనప్పుడు పార్టీలకతీతంగా 146 మంది కార్పొరేటర్లు స్టడీ టూర్ ప్లాన్ చేసుకోవడం వివాదాస్పదమైంది. ఇతర పట్టణాల్లో పాలన ఎలా ఉందో "నేర్చుకోవడానికి" మరో స్టడీ టూర్‌కు సిద్ధమైయ్యారు. అహ్మదాబాద్, చండీగఢ్, కుల్లు-మనాలి వంటి నగరాల్లో ‘పాలన’ ఎలా ఉందో చూసి వస్తారట. ఇతర నగరాలు అనుసరిస్తున్న ఉత్తమ పద్ధతులను అధ్యయనం చేయడం, వాటిని హైదరాబాద్‌లో పునరావృతం చేయడం ఈ పర్యటన లక్ష్యం.
ఫ్లైటు ప్రయాణం, స్టార్ హోటళ్లలో విడిది, ట్రాన్స్ పోర్టు, రీక్రియేషన్‌తో పాటు ఇతరాత్ర ఖర్చులు కలిపి మొత్తం ఒక్కో కార్పొరేటర్‌కు కనిష్టంగా రూ.5 లక్షల వరకు ఖర్చు కానున్నట్లు అంచనా. టూర్‌కు మొత్తం రూ.7 కోట్ల నుంచి రూ.8 కోట్ల వరకు ఖర్చుకానున్నట్లు సమాచారం. ఈ నెల 29న జరిగిన స్టాండింగ్ కమిటీ సమావేశం, 146 మంది కార్పొరేటర్ల స్టడీ టూర్ ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది.
అయితే "జి.హెచ్.ఎం.సీ. కౌన్సిల్ పదవీ కాలం ఫిబ్రవరి10తో ముగుస్తుంది. అలాంటప్పుడు ఈ సమయంలో కార్పొరేటర్ల స్టడీ టూర్ ప్రజాధనం వృథా తప్పితే, ఎటువంటి ప్రయోజనం లేదని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ ప్రెసిడెంట్ పద్మనాభరెడ్డి, మున్సిపల్ అడ్మినిస్ర్టేషన్ డిపార్టుమెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీకి, బల్దియా కమిషనర్" కి లేఖ రాశారు.
"దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకున్నట్లు, బాధ్యతా రాహిత్యంగా జిహెచ్ ఎంసి కార్పొరేటర్లు వ్యవహరిస్తున్నారు. సిగ్గు శరం లేదనడానికి ఇది నగ్న ఉదాహరణ. వ్యవస్థ ఎంతగా దిగజారిపోయిందో వీళ్ల వ్యవహారశైలి అద్దం పడుతోంది," అని సెస్ రిటైర్డ్ ప్రొఫెసర్ రాంచంద్రయ్య ఫెడరల్ తెలంగాణాతో తెలిపారు.
గతంలో కార్పొరేటర్లు ఢిల్లీ, ఆగ్రా, జైపూర్, ఇండోర్, లక్నో, అసోం గౌహతి, షిల్లాంగ్ సిటీల్లో స్టడీ టూర్ పేరుతో పర్యటించారు. ఆ పర్యటనతో ఒరిగిందేమి లేదని, ఇప్పటి వరకు నివేదిక సమర్పించలేదనే విమర్శలు ఉన్నాయి. పైగా పదవీ విరమణకు కొన్ని వారాల ముందు ఇతర నగరాల నుంచి నేర్చుకోవాలనుకుంటున్నారు అనేది ఆసక్తికరంగా మారింది.
మొత్తం 150 మంది కార్పొరేటర్లున్న జీహెచ్ఎంసీ కౌన్సిల్‌లో ప్రస్తుతం బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్, మజ్లిస్ పార్టీలకు చెందిన మొత్తం 146 మంది కార్పొరేటర్లున్నారు. మిగిలిన నాలుగు డివిజన్లలో ఎర్రగడ్డ, గుడిమల్కాపూర్ కార్పొరేటర్లు మృతి చెందగా, మెహిదీపట్నం, బహదూర్‌పురా డివిజన్ల నుంచి కార్పొరేటర్లుగా వ్యవహరిస్తున్న మాజీద్ హుస్సేన్ నాంపల్లి నియోజకవర్గం నుంచి మహ్మద్ మొబిన్ బహదూర్‌పురా అసెంబ్లీ సెగ్మెంట్‌ను ఎమ్మెల్యేలుగా గెలవటంతో ఆ రెండు డివిజన్లకు కార్పొరేటర్లు లేక ఖాళీగానే ఉన్నాయి. మొత్తం 146 మంది కార్పొరేటర్లు దేశంలోని రెండు మహానగరాలకు వారం రోజుల పాటు స్టడీ టూర్‌కు వెళితే ఖర్చు కోట్లలోనే అవుతుందంటూ అధికారులు అంచనాలేస్తున్నారు.
జీహెచ్‌ఎంసీ కార్పొరేటర్లు స్టడీ టూర్ల పేరిట విహార యాత్రలు చేయడం కొత్తేమీ కాదు. పారిశుద్ధ్యం, ఇంజనీరింగ్ రోడ్ పనులు, ఇతరత్రా అంశాల్లో అమలవుతున్న ఉత్తమ విధానాలను అధ్యయనం చేసేందుకని చెబుతుంటారు. ఈ టూర్లతో దుబారా తప్ప ఒరిగేదేమీ లేదు.
"దేశంలోని పలు నగరాల నుంచి మేయర్లు, కార్పొరేటర్లు, అధికారులు జీహెచ్‌ఎంసీలోని బెస్ట్ ప్రాక్టీసెస్‌ను అధ్యయనం చేయడానికి వస్తుండగా, జీహెచ్‌ఎంసీ కార్పొరేటర్లేమో పార్టీలకతీతంగా అందరూ, ఇతర నగరాలకు వెళ్లి నేర్చుకోవడానికే ఉబలాటపడుతున్నారు," అని అర్బన్ డవలప్‌మెంట్ అథార్టీ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కామ్రేడ్ భూపాల్ ఫెడరల్ తెలంగాణాతో తెలిపారు.
హైదరాబాద్ నగర పాలక సంస్థ గ్రేటర్‌గా రూపాంతరం చెందక ముందు నుంచే కార్పొరేటర్ల స్టడీ టూర్ల పరంపర ఉన్నా, వీటి వల్ల కార్పొరేషన్‌కు ఒరిగిదేమిటీ అని భూపాల్ ప్రశ్నిస్తున్నారు. "2002 నుంచి 2007 వరకున్న పాలక మండలి అప్పట్‌లో వంద సంఖ్యకే పరిమితమైన కార్పొరేటర్లు సింగపూర్, మలేషియా వంటి దేశాలకు స్టడీ టూర్లంటూ వెళ్లి, పక్షం రోజుల పాటు అక్కడ ఎంజాయ్ చేసి వచ్చారు. ఆ తర్వాత వచ్చిన పాలక మండలి కూడా నాగ్‌పూర్, ముంబై, అహ్మదాబాద్ వంటి ఇతర మహానగరాలకు స్టడీ టూర్లకు వెళ్లి వచ్చారు. కానీ వారు అక్కడ ఏఅంశంపై స్టడీ చేశారు, ఎంత సబ్జెక్టు సమకూర్చుకున్నారు అన్న విషయాన్ని కార్పొరేటర్లు గానీ, వారితో వెళ్లివచ్చిన ఆఫీసర్లు గానీ బయటకు చెప్పలేదు. పైగా ఆ వివరాలన్నింటినీ గోప్యంగా ఉంచేందుకు ప్రయత్నాలు చేసేవారు," అని భూపాల్ చెప్పారు.
అహ్మదాబాద్ నగరానికి వెళ్లిన అప్పటి పాలక మండలి సభ్యులు ఓ ప్రైవేటు సంస్థ శానిటేషన్ పనుల నిర్వహణపై అధ్యయనం నిమిత్తం వెళ్లారు. దేశంలోనే పలు నగరాలు శానిటేషన్ పనులు, ఘన వ్యర్థాల నియంత్రణ(సాలిడ్ వేస్ట్) మేనేజ్‌మెంట్‌లో ఆ సంస్థను బ్లాక్ లిస్టులో పెట్టినట్లు గుర్తించి, సిటీకి వచ్చారు. అయినా ఆ తర్వాత జీహెచ్ఎంసీ సిటీలోని పలు పనులను అదే సంస్థకు అప్పగించటం బహిరంగ రహస్యమే. పైసాపైసా కూడబెట్టి రైతులకు రుణమాఫీ చేశామని ఇటీవలే వ్యాఖ్యానించిన సి.ఎం. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇలాంటి దుబారా ఖర్చులను ప్రోత్సహిస్తుందా అనేది హైదరాబాద్‌లో హాట్ టాపిక్‌గా మారింది.

