జీహెచ్ఎంసీలో నాలుగు కార్పొరేషన్లు, నలుగురు మేయర్లు
x

జీహెచ్ఎంసీలో నాలుగు కార్పొరేషన్లు, నలుగురు మేయర్లు

త్వరలో హైదరాబాద్ నగరం దశ, దిశ మారబోతోంది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌ను నాలుగు కార్పొరేషన్లుగా విభజించనున్నారు.నలుగురు మేయర్లు కానున్నారు.


హైదరాబాద్ నగరాన్ని విస్తరించి నాలుగు కార్పొరేషన్లుగా విభజించాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్, ముచ్చర్ల నగరాలుగా విభజించి అభివృద్ధికి బాటలు వేయనున్నారు. నాలుగో నగరమైన ముచ్చర్లలో ఆరోగ్య, క్రీడా హబ్ లు, ఏఐ సిటీలు నిర్మించాలని నిర్ణయించారు. నాలుగో సిటీలోనే స్కిల్ డెవలప్ మెంట్ యూనివర్శిటీని కూడా ఏర్పాటు చేయనున్నారు.ఫోర్త్ సిటీలో క్రికెట్ స్టేడియం, గోల్ఫ్ కోర్స్ కూడా ఏర్పాటు చేయనున్నారు.


గ్రేటర్ కార్పొరేషన్ ప్రతిపాదనలు తెరమరుగు
హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్ మెంట్ అథారిటీ పరిధిలోని ఏడు మున్సిపల్ కార్పొరేషన్లు, 30 మున్సిపాలిటీలను విలీనం చేసి హైదరాబాద్ కార్పొరేషన్ ను ఏర్పాటు చేయాలని మొదట ప్రతిపాదించినా, తాజాగా నాలుగు కార్పొరేషన్ల ప్రతిపాదనలు తెరమీదకు వచ్చాయి. దీంతో ఒకే అతిపెద్ద కార్పొరేషన్ ఏర్పాటు ప్రతిపాదనలు తెరమరుగయ్యాయి. హైదరాబాద్ నగరాన్ని నాలుగు మున్సిపల్ కార్పొరేషన్లుగా విభజించి అభివృద్ధి చేయాలనే ప్రతిపాదనలు తెరమీదకు వచ్చాయని సీనియర్ కార్పొరేటర్ పన్నాల దేవందర్ రెడ్డి ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు.

ఎన్నెన్నో ప్రాజెక్టులు
మూసీనది సుందరీకరణ, శాటిలైట్ టౌన్ షిప్ ల ఏర్పాటు, మెట్రో రైలు విస్తరణ, జీహెచ్ఎంసీ పునర్ వ్యవస్థీకరణ,కేబీఆర్ పార్కు, జూబ్లీ చెక్ పోస్టు ఫ్లైఓవర్లు,అండర్ పాస్ లు, ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణం, రీజనల్ రింగ్ రోడ్డు, హైకోర్టు భవన నిర్మాణం, ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కాంప్లెక్స్, ఉస్మానియా ఆసుపత్రి నూతన భవన నిర్మాణం వంటి 19 కీలక ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టనున్నారు.మూసీ రివర్ బెడ్ లోని ఆక్రమణలను తొలగించి మూసీ సుందరీకరణ చేపట్టనున్నారు. మురుగు నీటి శుద్ధీకరణ,మూసీ సుందరీకరణ ప్రాజెక్టు కోసం రూ.1.50లక్షల కోట్ల ప్రాజెక్టు చేపట్టనుంది.

2026లో నాలుగు కార్పొరేషన్లకు ఎన్నికలు
హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి చేయడంతోపాటు నాలుగు కార్పొరేషన్లుగా విభజించిన తర్వాత మున్సిపల్ ఎన్నికలు జరపాలని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం యోచిస్తోంది. హైదరాబాద్ నగరంలో గతంలో బీఆర్ఎస్ ప్రాబల్యం ఎక్కువగా ఉండేది. గోషామహల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి రాజాసింగ్ విజయం సాధించారు. ఆ తర్వాత జరిగిన లోక్ సభ ఎన్నికల్లో మల్కాజిగిరి నుంచి బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ విజయం సాధించారు. బీఆర్ఎస్, బీజేపీ ప్రాబల్యానికి తెరవేసేలా హైదరాబాద్ ను అభివృద్ధి చేయడం ద్వారా ప్రజల్లో కాంగ్రెస్ ప్రాబల్యాన్ని పెంచుకోవాలని ఆ పార్టీ వ్యూహం పన్నింది.

ఫోర్త్ సిటీ కాదు...ఫోర్ బ్రదర్స్ సిటీ : కేటీఆర్
ముచ్చర్ల కేంద్రంగా సీఎం రేవంత్ రెడ్డి ఏర్పాటు చేసేది ఫోర్త్ సిటీ కాదని, ఫోర్ బ్రదర్స్ సిటీ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శనివారం ఆరోపించారు. ఫార్మాసిటీ భూముల్లో ఫోర్త్ సిటీ, ఏఐ సిటీ ఎలా కడతారని ఆయన ప్రశ్నించారు. రేవంత్ కు కమీషన్ల పిచ్చి తప్ప సంక్షేమం పట్టదని ఆయన ఆరోపించారు.


Read More
Next Story