బీఆర్ఎస్ కార్పొరేటర్లు సస్పెన్డ్
x

బీఆర్ఎస్ కార్పొరేటర్లు సస్పెన్డ్

జీహెచ్ఎంసీ సర్వసభ్య సమావేశంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. బడ్జెట్‌పై చర్చించడానికి నిర్వహించిన సభ రసాభాసగా మారింది.


జీహెచ్ఎంసీ సర్వసభ్య సమావేశంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. బడ్జెట్‌పై చర్చించడానికి నిర్వహించిన సభ రసాభాసగా మారింది. కాంగ్రెస్, బీఆర్ఎస్ కార్మొరేటర్ల మధ్య తీవ్ర మాటలయుద్ధం జరిగింది. దీనిపై స్పందించిన మేయర్.. బీఆర్ఎస్ కార్పొరేటర్లను సస్పెన్డ్ చేశారు. దీంతో బీఆర్ఎస్‌కు చెందిన నలుగురు కార్పొరేటర్లను మార్షల్స్ బయటకు తీసుకెళ్లారు. అనంతరం జీహెచ్ఎంసీ సర్వసభ్య సమావేశం వాయిదా పడింది. అయితే సమావేశంలో బడ్జెట్‌ ఆమోదం పూర్తయిన వెంటనే ప్రజల సమస్యలపై చర్చ చేపట్టాలని బీఆర్ఎస్ డిమాండ్ చేసింది. కుదరదన్నప్పటికీ చర్చ జరగాల్సిందేనని పట్టబట్టింది. దీంతో కాంగ్రెస్, బీఆర్ఎస్ కార్పొరేటర్ల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. పరిస్థితులు చేయి దాటకముందే మార్షల్స్ జోక్యం చేసుకుని నలుగురు బీఆర్ఎస్ కార్పొరేటర్లను బయటకు తీసుకెళ్లారు. దీంతో మిగిలిన బీఆర్ఎస్ కార్పొరేటర్లు తీవ్ర ఆగ్రహానికి లోనయ్యారు. తమ పార్టీ కార్పొరేటర్ల విషయంలో వివక్ష ఎందుకంటూ మేయర్ పోడియాన్ని చుట్టుముట్టారు. తమ పార్టీ కార్పొరేటర్ల పట్ల నడుచుకున్న తీరుకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. బయటకు పంపిన కార్పొరేటర్లను సభలోకి తిరిగి తీసుకొచ్చి సమావేశాన్ని తిరిగి కొనసాగించాలని కోరారు.

దీంతో జీహెచ్ఎంసీ సభ గందరగోళంగా మారింది. ప్రజా సమస్యలపై చర్చించడానికి మేయర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినప్పటికీ.. బయటకు పంపిన తమ కార్పొరేటర్లను లోపలికి తీసుకురావాలని బీఆర్ఎస్ పట్టుబట్టింది. దీంతో చేసేదేమీ లేక తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూనే.. బయటకు తీసుకెళ్లిన కార్పొరేటర్లను లోపలికి తీసుకురావాలని మేయర్.. పోలీసులకు ఆదేశాలిచ్చారు. అదే సమయంలో బయట ఉన్న కార్పొరేటర్లు లోనికి రావడానికి నిరాకరించారు. అది కాస్తా మరో వాగ్వాదానికి దారితీసింది. దీంతో బీఆర్ఎస్ కార్పొరేటర్లందరినీ మేయర్ సస్పెండ్ చేశారు. తమ సస్పెన్షన్ వ్యతిరేకంగా బీఆర్ఎస్ కార్పొరేటర్లు.. కార్యాలయం ఎదుట బైఠాయించి నిరసన వ్యక్తం చేస్తున్నారు. అధికారం ఉందని ప్రశ్నించే గొంతులను అణచివేద్దామని అనుకుంటున్నారని, కానీ వారు ఎంత ప్రయత్నించిన బీఆర్ఎస్.. ప్రజల పక్షాన తన గొంతును వినిపిస్తూనే ఉంటుందంటూ విమర్శలు చేశారు.

బడ్జెట్ ప్రవేశపెట్టిన మేయర్..

గురువారం నిర్వహించిన జీహెచ్ఎంసీ సర్వసభ్య సమావేశంలో మేయర్ విజయలక్ష్మీ.. 2025-2026 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ ప్రవేశపెట్టారు. ముందుగా మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటాకు కౌన్సిల్ నివాళులు అర్పించింది. అదే సమయంలో సభలో గందరగోళం ఏర్పడటంతో చర్చ లేకుండానే బడ్జెట్‌కు కౌన్సిల్ ఆమోదం తెలిపింది. 2025-2026 ఆర్థిక సంవత్సరానికి రూ.8,440 కోట్ల బడ్జెట్‌కు ఆమోదం తెలిపింది కౌన్సిల్.

బిక్షాటన చేసిన బీజేపీ కార్పొరేట్లు

అయితే సర్వసభ్య సమావేశం సందర్భంగా బీజేపీ కార్పొరేటర్లు వినూత్నంగా నిరసన తెలిపారు. జీహెచ్ఎంసీ కార్యాలయానికి బీజేపీ కార్పొరేటర్లంతా కూడా బిక్షాటన చేస్తూ వచ్చారు. గోషామహల్ స్టేడియాన్ని కూల్చొద్దని, అక్కడ ఉస్మానియా ఆసుపత్రి నిర్మించొద్దంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగానే వారు బిక్షాటన చేస్తూ నిరసన వ్యక్తం చేశారు.

Read More
Next Story