
రామానాయుడు, అన్నపూర్ణ స్టూడియోలకు నోటీసులు
ట్రేడ్ లైసెన్స్ ఎగ్గొడుతున్నట్టు జీహెచ్ఎంసీ ఆరోపణ
హైదరాబాద్ లోని అన్నపూర్ణ, రామానాయుడు స్టూడియోలకు శుక్రవారం జిహెచ్ ఎంసీ నోటీసులు జారీ చేసింది. పూర్తి స్థాయిలో ట్రేడ్ లైసెన్స్ ఫీజు చెల్లించాలని స్పష్టం చేసింది. హైదరాబాద్ లోని ఈ రెండు ప్రముఖ స్టూడియోలు కొన్ని సంవత్సరాలుగా తక్కువ ట్రేడ్ లైసెన్స్ ఫీజులు చెల్లిస్తున్నట్టు జీహెచ్ ఎంసీ సర్కిల్-18 అధికారులు గుర్తించారు. వ్యాపార విస్తరణ తక్కువగా ఉందని చూపిస్తూ ట్రేడ్ లైసెన్స్ ఫీజులను చెల్లించాల్సిన దానికంటే తక్కువగా చెల్లిస్తున్నాయని అధికారులు చెప్పారు. అన్నపూర్ణ స్టూడియో రూ.11.52 లక్షలు చెల్లించాల్సి ఉండగా , కేవలం రూ.49 వేలు మాత్రమే చెల్లిస్తుందన్నారు. అలాగే రామానాయుడు స్టూడియో రూ.1.92 లక్షలు చెల్లించాల్సి ఉండగా కేవలం రూ.1,900 చెల్లిస్తున్నట్టు అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో పూర్తిస్థాయి ట్రేడ్ లైసెన్స్ ఫీజు చెల్లించాలని జీహెచ్‌ఎంసీ ఆ నోటీసులో పేర్కొంది.
చెన్నైలో ఉన్న సినీ పరిశ్రమను ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లోని హైదరాబాద్ కు తరలించడానికి అప్పటి ప్రభుత్వం 1976లో అన్నపూర్ణ స్టూడియోకు భూమి కేటాయించింది. బంజారాహిల్స్ లో 22 ఎకరాలను కేటాయించింది. తర్వాతి కాలంలో రామానాయుడు స్టూడియో, పద్మాలయ స్టూడియోలకు భూములను కేటాయిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 1989లో ఈ స్టూడియోలకు చెరో ఏడున్నర ఎకరాలు కేటాయిస్తూ ప్రభుత్వం నిర్ణయించింది.

