
పోటీ నుంచి తప్పుకున్న బీఆర్ఎస్ కార్పొరేటర్లు
పదేళ్ల నుంచి మొదటిసారి స్టాండింగ్ కమిటీలో కాంగ్రెస్ కార్పొరేటర్లు ఉండనున్నారు. బీఆర్ఎస్ లేకుండా ఎన్నికవుతున్న తొలి స్టాండింగ్ కమిటీ కూడా ఇదే.
జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నిక ఏకగ్రీవమైంది. పోటీలో నిలిచి ఇద్దరు బీఆర్ఎస్ కార్పొరేటర్లు చివరి క్షణంలో తమ నామినేషన్‌ను ఉపసంహరించుకున్నారు. దీంతో జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ మరోసారి ఏకగ్రవంగా ఎన్నికైంది. సంఖ్యాబలం లేకపోవడం వల్లే బీఆర్ఎస్ కార్పొరేటర్లు పోటీ నుంచి తప్పుకున్నారు. కమిటీ ఎన్నికకు ఎంఐఎం నుంచి 8మంది, కాంగ్రెస్ నుంచి ఏడుగురు, బీఆర్ఎస్ నుంచి ఇద్దరు నామినేషన్లు వేశారు. మొత్తం కలిపి స్టాండింగ్ కమిటీకి 17 నామినేషన్లు దాఖలయ్యాయి. స్టాండింగ్ కమిటీలో 15 మంది సభ్యులు ఉంటారు. ఈ పోటీ నుంచి బీఆర్ఎస్ తప్పుకోవడంతో ఎంఐఎం, కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపిక ఏకగ్రీవమైంది. గత పదేళ్ల నుంచి మొదటిసారి స్టాండింగ్ కమిటీలో కాంగ్రెస్ కార్పొరేటర్లు ఉండనున్నారు. అదే విధంగా బీఆర్ఎస్ లేకుండా ఎన్నికవుతున్న తొలి స్టాండింగ్ కమిటీ కూడా ఇదే.
అయితే జీహెచ్ఎంసీలో మొత్తం 150 మంది కార్పొరేటర్లు ఉంటారు. వారిలో 15మందితో స్టాండింగ్ కమిటీని ఏర్పాటు చేస్తారు. ఇందుకోసం నామినేషన్లను పిలిచి ఎన్నిక నిర్వహిస్తారు. ఈ ఏడాది ఈ పోటీలో మొత్తం 15మంది సభ్యులే ఉండటంతో కమిటీ ఎన్నికల ఏకగ్రీవమైంది. ప్రతి ఏడాదీ స్టాండింగ్ కమిటీ ఎన్నిక జరుగుతుంది. జీహెచ్ఎంసీలో పాలనాపరంగా, కొత్త ప్రాజెక్ట్‌లకు సంబంధించి నిర్ణయాలు తీసుకోవాలంటే మేయర్, డిప్యూటీ మేయర్ తర్వాత స్టాండింగ్ కమిటీ సభ్యుల ఆమోదం కూడా పొందాలి. గత పదేళ్లలో స్టాండింగ్ కమిటీ ఎన్నికలు జరగలేదు. ప్రతిసారి ఏకగ్రీవంగా కమిటీ ఏర్పాటు జరిగింది. కాగా ఈసారి బీజేపీ, బీఆర్ఎస్ సంఖ్యాబలం కొంత ఎక్కువగా ఉండటం, కొందరు కార్పొరేటర్లు కాంగ్రెస్‌లో చేరడం, మేయర్, డిప్యూటీ మేయర్ సైతం పార్టీ మారడంతో ఈ ఏడాది స్టాండింగ్ కమిటీ ఎన్నికలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఈ ఎన్నికల రసవత్తరంగా సాగనున్నాయని అంతా అనుకున్నారు. కానీ పోటీలో ఉన్న ఇద్దరు బీఆర్ఎస్ కార్పొరేటర్లు పోటీ నుంచి తప్పుకోవడంతో మరోసారి స్టాండింగ్ కమిటీ ఎన్నికల ఏకగ్రీవమైంది. మరోవైపు బీజేపీ ఈ పోటీకి దూరంగా ఉంది. దీంతో ఈ ఎన్నికల ఏకగ్రీవంగా మారింది.