న్యూ ఇయర్ వేళ గిగ్ వర్కర్ల మెగా స్ట్రైక్
x

న్యూ ఇయర్ వేళ గిగ్ వర్కర్ల మెగా స్ట్రైక్

న్యూ ఇయర్ వేడుకల సమయంలో, డిమాండ్ ఎక్కువగా ఉండే వేళలో యాజమాన్యాలపై ఒత్తిడి!


దేశవ్యాప్తంగా యాప్ ఆధారిత సంస్థల్లో పనిచేస్తున్న గిగ్ వర్కర్లు మరోసారి ఆందోళన బాట పట్టారు. తమ దీర్ఘకాలిక డిమాండ్ల సాధన కోసం నూతన సంవత్సర వేడుకల రోజైన డిసెంబర్ 31న పీక్ అవ‌ర్స్‌లో ఫోన్‌లు స్విచ్చ్ ఆఫ్ చేసిస‌మ్మె చేశారు. మ‌ధ్యాహ్నాం, సాయంత్రం, రాత్రి మూడు స‌మ‌యాల్లో మెరుపు స‌మ్మె చేశారు. ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ యాప్-బేస్డ్ ట్రాన్స్‌పోర్ట్ వర్కర్స్ (IFAT), తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్‌ఫామ్ వర్కర్స్ యూనియన్ (TGPWU) వంటి ప్రధాన కార్మిక సంఘాలు ఈ సమ్మెకు నాయకత్వం వహించాయి. స్విగ్గీ, జొమాటో, బ్లింకిట్, జెప్టో, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి ప్రముఖ సంస్థల డెలివరీ భాగస్వాములు ఈ సమ్మెలో పాల్గొంటున్నారు.

"కార్మికుల భద్రతను ప్రమాదంలో పడేసే '10 నిమిషాల డెలివరీ' విధానాన్ని తక్షణమే రద్దు చేయాలని గిగ్ వర్కర్లు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. దీంతో పాటు, ప్రతి డెలివరీకి (4 కిలోమీటర్ల వరకు) కనీసం రూ.35 చెల్లించాలని, రైడ్-హెయిలింగ్ సేవలకు కిలోమీటర్‌కు కనీసం రూ.20 ఇవ్వాలని కోరుతున్నారు. సరైన కారణం లేకుండా తమ ఐడీలను బ్లాక్ చేయడాన్ని నిరసిస్తూ, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రమాద బీమా, ఆరోగ్య బీమా, పెన్షన్ వంటి సామాజిక భద్రతా పథకాలను అమలు చేయాలి," అని IFAT జాతీయ ప్రధాన కార్యదర్శి షేక్ సలావుద్దీన్ 'ఫెడ‌ర‌ల్ తెలంగాణా'తో తెలిపారు.

"న్యూ ఇయర్ వేడుకల సమయంలో, డిమాండ్ ఎక్కువగా ఉండే వేళలో సమ్మె చేయడం ద్వారా యాజమాన్యాలపై ఒత్తిడి పెంచి, తమ డిమాండ్లను పరిష్కరించుకోవాలని తాము భావిస్తున్నాం. ఫ్లాష్ స్ట్రైక్ అంటే ఒక నిర్దిష్ట ప్రాంతంలోని కార్మికులు ఒకటి లేదా రెండు గంటల పాటు యాప్‌లను లాగ్ ఆఫ్ చేసి డెలివరీలు నిలిపివేయడమని" సలావుద్దీన్ వివరించారు. పండుగలు, వేడుకల సమయంలో సమ్మెకు దిగితేనే.. తమ ఆందోళన గురించి ప్రభుత్వం పట్టించుకొంటుందని ఐఎఫ్‌ఏటీడబ్ల్యూ ప్రతినిధులు తెలిపారు.

గిగ్ వర్కర్ల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం ఇటీవల కొత్త లేబర్‌ కోడ్‌లో కొన్ని నిబంధనలు పొందుపరిచింది. ఈ నేపథ్యంలో గిగ్ వర్కర్లు సమ్మెకు దిగారు. కొత్త లేబర్ కోడ్ ప్రకారం అగ్రిగేటర్లు తమ వార్షిక టర్నోవర్‌లో 1 నుండి 2 శాతం (కార్మికులకు చెల్లించే మొత్తంలో 5 శాతం వరకు ) సామాజిక భద్రత నిధికి కేటాయించడం తప్పని సరిచేసింది.

గిగ్ వర్కర్స్ డిమాండ్స్ ఏంటి?

1. పారదర్శకమైన , న్యాయమైన వేతనం

2. “10 నిమిషాల డెలివరీ” మోడల్‌ను విత్‌డ్రా చేయాలి

3. సరైన ప్రాసెస్ లేకుండా అకౌంట్ బ్లాకింగ్‌ చేయకూడదు

4. మంచి సేఫ్టీ సామగ్రి , ప్రమాద బీమా కల్పించడం

5. అల్గారిథమిక్ వివక్షత లేకుండా హామీ ఇవ్వబడిన పని కేటాయింపుదీనితో పాటు బలమైన యాప్, టెక్నికల్ సపోర్ట్‌తో పాటు పేమెంట్స్ ఫెల్యూర్,జాబ్ సెక్యూరిటీ వంటి సమస్యల పరిష్కారానికి గ్రీవెన్స్ ఏర్పాటు చేయాలి. హెల్త్ ఇన్సూరెన్స్,యాక్సిడెంట్ కవరేజీ, పెన్షన్ బెనిఫిట్స్ అందించాలని గిగ్ వర్కర్స్ డిమాండ్ చేస్తున్నారు.

Read More
Next Story