ఈ సారి గ్రూప్- 1 కి గండాలు రాకుండా చూడు దేవుడా?
x

ఈ సారి గ్రూప్- 1 కి గండాలు రాకుండా చూడు దేవుడా?

తెలంగాణలో ఇంతకుముందు ప్రకటించిన గ్రూప్ 1 పోస్టులకు అదనంగా 60 పోస్టులను కలిపి కొత్త నోటిఫికేషన్ జారీ చేస్తామనే సీఎం ప్రకటన నిజమవుతుందా? నిరుద్యోగులు ఏమంటున్నారు.?


‘మరో 60 పోస్టులతో కలిపి గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇస్తాం’సీఎం రేవంత్ రెడ్డి నిరుద్యోగులకు ఇచ్చిన హామీ. రెండు సంవత్సరాల క్రితం అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా దాదాపు 10 సంవత్సరాల తరువాత గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇవ్వడానికి అనుమతించింది. అప్పటి వరకూ ఎప్పుడులేని విధంగా 503 పోస్టులతో ఈ నోటిఫికేషన్ రావడంతో నిరుద్యోగులంతా సంబరపడిపోయారు. కానీ పేపర్ లీకేజీలు, నిబంధనల మేరకు నిర్వహించకపోవడంతో గ్రూప్ 1 ఉద్యోగం సాధించాలనుకున్న వారి కలలు అన్నీ ఊహలుగా మిగిలిపోయాయి.

తెలంగాణ రాష్ట్రం సాధించుకుందే నీళ్లు, నిధులు, నియామకాలు కోసం. కానీ అందులో కీలకమైన నియామకాల్లో ప్రభుత్వం విఫలమయినట్లు స్థానిక యువత బలంగా విశ్వసించింది. ముఖ్యంగా రెండో విడత బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడ్డాక ఈ నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపించింది.

టీఎస్పీఎస్సీలో అసమర్థులైన వారికి అవకాశం కల్పించి, ఏ మాత్రం శ్రద్ధ పెట్టకుండా పరీక్ష నిర్వహణకు ఏర్పాట్లు చేశారని పరీక్షలను నిర్వహించిన విధానాన్ని బట్టి ప్రజలకు అర్థం అయింది. పరీక్ష నిర్వహించిన తరువాత ఆరు నెల్లకు గ్రూప్ 1 పేపర్ లీక్ అయినట్లు బయటపడడంతో రాష్ట్రం మొత్తం దిగ్ర్భంతికి గురైంది.

చేసిన తప్పును సరిదిద్దుకునేందుకు నడుంబిగించినట్లు కనిపించిన టీఎస్పీఎస్సీ, రెండోసారి గ్రూప్ 1 ప్రిలిమ్స్ నిర్వహిస్తామని ప్రకటించింది. అయితే నిబంధనలను తుంగలో తొక్కి తూతూమంత్రంగా పరీక్ష నిర్వహించడంతో ఈ సారి హైకోర్టు పరీక్షను రద్దు చేసింది.

ఎప్పుడు వివాదాలే..

ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో 2011లో అప్పటి ఏపీపీఎస్సీ గ్రూప్ 1 నోటిఫికేషన్ ను విడుదల చేసింది. మొదట ప్రిలిమ్స్, తరువాత మెయిన్స్ ను కమిషన్ వేగంగా పూర్తి చేసింది. అయితే ప్రిలిమ్స్ లో కొన్ని ప్రశ్నల్లో తప్పులున్నాయని, మా అభ్యంతరాలను కమిషన్ పట్టించుకోలేదని కొంతమంది అభ్యర్థులు న్యాయస్థానాలను ఆశ్రయించారు. ఇలా వివాదం సుప్రీంకోర్టు వరకూ చేరింది.

ఈ లోపు ఆంధ్రప్రదేశ్ నుంచి విడివడి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం అయింది. తరువాత కొన్ని సంవత్సరాలకు సుప్రీంకోర్టు తీర్పు నిస్తూ ఏపీపీఎస్సీ నిర్వహించిన మెయిన్స్ ను రద్దు చేసింది. తరువాత నిర్వహించాల్సిన మెయిన్స్ నిర్వహణలో తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వాలు మొండి వాదనలతో నిరుద్యోగులతో ఆటలాడుకున్నాయి.

చివరకు తెలంగాణ 2017లో పరీక్ష నిర్వహించింది. అయితే తరువాత ప్రకటించిన ఫలితాల్లో కూడా అనేక అనుమానాలు తలెత్తాయి. మొదట ఫలితాలు వెలువడిన తరువాత కమిషన్ సాప్ట్వేర్ లో సమస్య వల్ల ర్యాంకులు తారుమారు అయ్యాయని మరోసారి ఫలితాలు ప్రకటించింది. వీటిపై అనుమానాలు వ్యక్తం అయ్యాయి. ఒకే సెంటర్ లో రాసిన పదిహేను మందికి గ్రూప్ 1 ఉద్యోగాలు వచ్చాయని ఆరోపణలు వచ్చాయి. నిజం ఏంటో ఎవరికీ తెలియదు. వీటిని నివృత్తి చేసే పని కూడా ఎవరూ చేయలేదు.

కనీసం ఎన్నికల ముందయినా?

2018 లో కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్తున్నప్పుడు అయినా గ్రూప్ 1 నోటిఫికేషన్ వస్తుందేమో అని నిరుద్యోగులు ఆశగా చూశారు. కానీ ప్రభుత్వం మాత్రం దీనిపై మౌనం వహించింది. ఎన్నికల్లో గెలిచిన తరువాత 2019 సార్వత్రిక ఎన్నికల ముందు అయిన ఉద్యోగ ప్రకటన వస్తుందని అనుకున్నారు.. కానీ అక్కడ కూడా నిరాశే ఎదురయింది. చివరికి 2022 ఏప్రిల్ తెలంగాణ లో తొలి గ్రూప్ 1 నోటిఫికేషన్ వచ్చింది.

అలా తెలంగాణ ఏర్పాటు అయ్యాక దాదాపు ఎనిమిది సంవత్సరాలకు తొలి గ్రూప్ 1 నోటిఫికేషన్, అది కూడా భారీ స్థాయిలో అంటే 503 పోస్టులతో ప్రకటన రావడంతో నిరుద్యోగులతో పాటు, టీచర్లు, ప్రైవేట్ ఉద్యోగులు సెలవులు, రాజీనామాలు చేసి హైదరాబాద్ చేరుకుని దొరికింది తిని, ప్రిపరేషన్ సాగించారు.

లీక్ లు, రద్దుతో పరేషాన్

రాకరాక పదేళ్లకు గ్రూప్ 1 నోటిఫికేషన్ రావడం, పరీక్ష తేదీలు సైతం ముందే కమిషన్ వెల్లడించడంతో నిరుద్యోగులు ఆశతో దీక్షగా చదివారు. "నేను ఎల్ఎల్ బీ చదువుతూనే గ్రూప్ 1 పరీక్షలకు సిద్దం అయ్యాను. కానీ మాటీమాటీకి పరీక్ష తేదీలు మార్చడంతో ఇటూ లాయర్ పరీక్షలను సరిగా రాయలేకపోయాను.. అటూ గ్రూప్ 1 రెండు సార్లు రద్దు అయింది" అని అశోక్ నగర్ లో ఓస్టడీ హాల్ లో చదువుతున్న అనిల్( పేరుమార్చాం) పలకరించగా చెప్పిన విషయమిది.

" చాలా సంవత్సరాల తరువాత ఉద్యోగ ప్రకటన వచ్చింది. ఇప్పుడు మిస్ అయితే మరోసారి నేను గ్రూప్ 1 రాయలేమో అనిపించింది. అందుకే లాయర్ చదువును పక్కన పెట్టాను" అని తన బాధను ఫెడరల్ తో పంచుకున్నారు. కనీసం ఇప్పుడయిన ఏ వివాదాలు లేకుండా పరీక్ష పూర్తి కావాలని కోరుకుంటున్నా ఆశాభావం వ్యక్తం చేశారు.

" నేను మానసికంగా చాలా కుంగిపోయాను. ఎన్నిసార్లు పరీక్ష రద్దు అవుతుంది. నాకు అస్సలు చదవాలని అనిపించడం లేదు" అని సంగారెడ్డి జిల్లాకు చెందిన మరో గ్రూప్ 1 అభ్యర్థిని పూర్వీ రెడ్డి( పేరు మార్చాం) అన్నారు. " ఇంట్లో వాళ్లని ఒప్పించి మరీ హైదరాబాద్ కు వస్తే పరిస్థితి ఇది" అని ఆందోళన వ్యక్తం చేశారు. కనీసం ఇప్పుడు ప్రకటించిన నోటిఫికేషన్ అయిన చెప్పిన సమయానికి పూర్తి చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.

సివిల్స్ సాధించలేని వారికీ గ్రూప్ 1 అనేది ఒక మంచి మార్గం. సివిల్స్ చాలాఖర్చుతో కూడుకున్నది. ముఖ్యంగా తెలుగులో అవసరమైన మెటీరియల్ కూడా అందుబాటులో ఉండదు. దాని బదులు గ్రూప్ 1 రాసి ఉద్యోగం సంపాదిస్తే కేంద్ర క్యాడర్ తో రిటైర్ కావచ్చు. సమాజంలో మంచి గుర్తింపు కూడా ఉంటుందని యువత ఎక్కువగా గ్రూప్ 1 పై దృష్టి పెడుతున్నారు.

నెలకు లక్షన్నర దాక వేతనం తీసుకోవడానికి అవకాశం ఉండడంతో డిగ్రీ పూర్తికాగానే యువత పోటీ పరీక్షల వైపు ముఖ్యంగా గ్రూప్స్ వైపు దృష్టి పెడుతున్నారు. ఇదే విషయమై అశోక్ నగర్ కు చెందిన ఓ కోచింగ్ సంస్థ డైరెక్టర్ మాట్లాడుతూ " ఇంతకుముందు జరిగింది చాలా బాధాకరం. పిల్లలు ఎలా కష్టపడుతున్నారో మేము కళ్లారా చూస్తున్నాం.

ఉద్యోగం వస్తుందనే నమ్మకంతో వందకు వంద శాతం తమ ఎఫర్ట్ పెడుతున్నారు, కానీ రెండు సార్లు పరీక్ష రద్దు కావడం ఎవ్వరు కలలో కూడా ఊహించలేదు. ఈ సారి ప్రభుత్వం చిత్తశుద్దితో పరీక్ష నిర్వహిస్తుందనే నమ్మకం మాకుంది" అని ఆయన ఫెడరల్ తో అన్నారు. ముందు నోటిఫికేషన్ రానివ్వండి. వచ్చాక మిగతా విషయాలు అని చెప్పారు.

ఇలా తెలంగాణలో చాలామంది గ్రూప్ 1 నోటిఫికేషన్ కోసం చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు. దేవుడి దయవల్ల కనీసం ఇప్పుడైన పరీక్షలు అనుకున్న సమయానికి పూర్తి కావాలని కోరుకుంటున్నారు.

Read More
Next Story