లక్ష్మీ నరసింహుడికి బంగారు ధగధగలు
x
Golden glow to Yadagiri Gutta Temple Vimana Gopuram

లక్ష్మీ నరసింహుడికి బంగారు ధగధగలు

బంగారుతాపడం పనులను దిగ్విజయంగా పూర్తిచేయాలని ఉన్నతాధికారులు కంకణం కట్టుకున్నారు.


యాదగిరిగుట్ట లక్ష్మీ నర్సింహస్వామి విమానగోపురం బంగారు ధగధగలతో మెరిసిపోబోతోంది. ఈనెల 19వ తేదీనుండి 23వ తేదీవరకు జరగబోయే ప్రత్యేక కార్యక్రమంలో విమానగోపురానికి చేసిన బంగారుతాపడాన్ని భక్తుల వీక్షణకు అవకాశం ఇవ్వబోతున్నారు. మహాకుంభ సంప్రోక్షణకు అవసరమైన ఏర్పాట్లను ఆలయ అధికారులు చేస్తున్నారు. విమానగోపురానికి బంగారుతాపడం(Golden glow) పనులు దాదాపు అయిపోవచ్చాయి. ఇంకో 20 శాతం తాపడంపనులు మాత్రమే మిగిలుంది. ఈపనులు 24 గంటలూ వేగంగా జరుగుతున్నాయి. మరో 48 గంటల్లో 20 శాతం పనులను కూడా పూర్తిచేసి బంగారుతాపడం పనులను దిగ్విజయంగా పూర్తిచేయాలని ఉన్నతాధికారులు కంకణం కట్టుకున్నారు.


19వ తేదీన ఉదయం 7.45 నిముషాలకు భగవద్ అనుజ్ఞస్వస్తివచన, శ్రీ విశ్వవారాధన, పుణ్యాహవచన, రక్షాబంధన, ఋత్విగ్వరణం, మృత్విగ్వరణం, పర్యగ్నీకరణ, తిరువీధిసేవ, యాగశాలప్రవేశం, అఖండ దీపారాధనతో విమానగోపుర మహాకుంభ సంప్రోక్షణ కార్యక్రమం మొదలవుతుంది. సాయంత్రం 6 గంటలకు శ్రీవిష్ణుసహస్రపారాయణం, ద్వారాధి కుంభార్చన, జంబ, కుంభ, మండల అగ్ని ఆరాధన, మూర్తిమంత్రహోమాలు, వారణామవారి హోమం, జలాభివాసం, నిత్యపూర్ణాహుతి, నివేధన, తీర్ధప్రసాద గోష్ఠి, తిరువీధిసేవ, ఆలయంలోకి ప్రవేశం జరుగుతుంది. గురు, శుక్రవారాల్లో అనేక కార్యక్రమాలు జరుగుతాయి. 22వ తేదీ శనివారం తిరువీధిసేవ, చతుస్ధాపార్చన, విమాన అభిష్టాన పరివార విశేషహోమం, ఏకశిలాకలశ స్నపనం, మూలమంత్రమూర్తి మంత్రహావర్షం, నిత్యపూర్ణాహుతి నివేధన, నిరాజన మంత్రపుష్పం, శాత్తుమరై జరుగుతుంది. నిత్యపూర్తిహుతి నివేధన, తీర్ధప్రసాదగోష్ఠి తిరువీధి సేవ ఆలయంలోకి వేంచేయటంతో కార్యక్రమం ముగుస్తుంది.


23వ తేదీ ఉదయం 11.54 గంటలకు విమానగోపురానికి కుంభాభిషేకం జరుగుతుంది. యాదగిరిగుట్ట(Yadagiri gutta Temple) శ్రీలక్ష్మీ నరసింహస్వామి దివ్యవిమానాన్ని బంగారుతాపడంలో 40 రకాల విగ్రహాలను బంగారుపూతతో తయారుచేశారు. విమానగోపురంపై బంగారు రేకులపై పంచవార సింహక్షేత్రం స్వామివారి వివిధ రూపాలను చెక్కారు. శ్రీవిష్ణుమూర్తి దశావతారాలు, శ్రీనరసింహస్వామివారి రూపాలను వివిధ ఎత్తుల్లో రూపొందించారు. అలాగే స్వామివారి గరుడ విగ్రహాలు నాలుగు, ఎనిమిది సింహావతారాలు చెక్కి మొత్తాన్ని స్వర్ణంతోనే తాపడంచేయించారు. యాదగిరి గుట్ట లక్ష్మీనరసింహస్వామి విమానగోపురమే దేశంమొత్తంమీద ఎత్తైన స్వర్ణతాపడం కలిగిన గోపురంగా చరిత్ర సృష్టించబోతోంది. విమానగోపురంతో పాటు ఆలయంపై 39 కలశాలకు కూడా స్వర్ణతాపడం చేశారు.

ఎంత బంగారం వాడారు


విమానగోపురం మొత్తాన్ని బంగారు తాపడం చేయించేందుకు రు. 20 కోట్ల విలువైన 68 కిలోల బంగారాన్ని ఉపయోగించారు. మొత్తం బంగారాన్ని ఆలయ అధికారులు భక్తుల నుండి కానుకలుగానే స్వీకరించారు. 50.5 అడుగుల ఎత్తయిన పంచతలరాజగోపురం చుట్టూ 10,759 చదరపు అడుగుల మేర స్వర్ణతాపడం చేయించారు. దేవాలయం పునర్నిర్మాణం పనులు మొదలుపెట్టేటప్పుడే విమానగోపురానికి స్వర్ణతాపడం చేయించాలని దేవస్ధానం ఉన్నతాధికారులు నిర్ణయించారు. 11 వేల కిలోల రాగితో ముందు రేకులను తయారుచేయించారు. రాగిరేకులను విమానగోపురంపైన గట్టిగా బిగించారు. ఆ రాగిరేకులపైన బంగారుతాపడం చేశారు. రాగిరేకులపైన కాకుండా నేరుగా విమానగోపురంపైన బంగారుతాపడం చేయించినా నిలవదు. అందుకనే ముందుగా విమానగోపురంపై రాగిరేకులను బిగించి వాటిపైన బంగారుతాపడం చేశారు. ప్రతి చదరపు అడుగు రాగిరేకు మీద 6 గ్రాముల బంగారాన్ని తాపడం చేయించారు.



ఇదేవిషయాన్ని యాదగిరిగుట్ట దేవస్ధానం ముఖ్యకార్యనిర్వహణ అధికారి ఏ భాస్కరరావు ‘తెలంగాణ ఫెడరల్’ తో మాట్లాడుతు విమానగోపురానికి బంగారుతాపడం పనులు శరవేగంతో జరుగుతున్నట్లు చెప్పారు. బంగారుతాపడం పనులు మరో 20 శాతం మాత్రమే మిగిలుందన్నారు. 19వ తేదీ అర్ధరాత్రికి ఈ పెండింగ్ పనులు కూడా పూర్తయిపోతాయన్న ఆశాభావాన్ని వ్యక్తంచేశారు. బంగారుతాపడం పనులు మొత్తం చెన్నై(Chennai)కి చెందిన కంపెనీ చేస్తోందన్నారు. రాగిరేకులు, వెండి తాపడం పనులను కూడా చెన్నై కంపెనీయే చూస్తోందని చెప్పారు.

Read More
Next Story