హైదరాబాద్‌కు మంచి రోజులు వస్తాయా?..త్వరలో గ్రేటర్ సిటీ కార్పొరేషన్
x
హైదరాబాద్ సిటీ కార్పొరేషన్

హైదరాబాద్‌కు మంచి రోజులు వస్తాయా?..త్వరలో గ్రేటర్ సిటీ కార్పొరేషన్

హైదరాబాద్ మహా నగరానికి మంచి రోజులు రాబోతున్నాయి.ఏడు మున్సిపల్ కార్పొరేషన్లు, 30 మున్సిపాలిటీలను విలీనం ద్వారా హైదరాబాద్ గ్రేటర్ సిటీ కార్పొరేషన్ ఏర్పాటు కానుంది.


తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డి ఆదేశంతో హైదరాబాద్ గ్రేటర్ సిటీ కార్పొరేషన్ (హెచ్‌జీ‌సీసీ) ఏర్పాటుకు మున్సిపల్ శాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు. రాష్ట్ర మున్సిపల్ అధికారులు గ్రేటర్ సిటీ కార్పొరేషన్ ఏర్పాటుకు అసెంబ్లీలో కొత్త బిల్లు ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ బిల్లుతో జీహెచ్ఎంసీ సిటీ కార్పొరేషన్ కానుంది.

- గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ తెలంగాణ రాష్ట్ర రాజధానితోపాటు అతిపెద్ద నగరం. హైదరాబాద్‌ నగరంలో 7.9 మిలియన్ల జనాభాతో 650 కిలోమీటర్ల విస్తీర్ణంతో భారతదేశంలోని అతిపెద్ద మున్సిపల్ కార్పొరేషన్లలో ఒకటిగా నిలిచింది.
- హైదరాబాద్ మెట్రో డెవలప్మెంట్ అథారిటీ పరిధిలో ఉన్న అన్ని మున్సిపల్ కార్పొరేషన్లు,మున్సిపాలిటీలను గ్రేటర్ హైదరాబాద్ లో విలీనం చేయాలని తెలంగాణ ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది.
- హెచ్ఎండిఏ పరిధిలోని ప్రాంతాలన్నీ కలిపి ఒకే కార్పొరేషన్ ఏర్పాటు చేయడం లేదా నాలుగు వైపులా నాలుగు కార్పొరేషన్లు ఏర్పాటు చేయాలని తెలంగాణ సర్కార్ యోచిస్తోంది.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ యోచన
ప్రస్తుతం హెచ్ఎండిఏ పరిధిలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ తో పాటు ఏడు మున్సిపల్ కార్పొరేషన్లు,30 మున్సిపాలిటీలు ఉన్నాయి. వీటన్నిటిని కలిపి హైదరాబాద్ గ్రేటర్ సిటీ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తోంది. గ్రేటర్ సిటీ కార్పొరేషన్ ఏర్పాటు సాధ్యం కానీ పరిస్థితిలో నాలుగు వైపులా ఈస్ట్,వెస్ట్ ,నార్త్ ,సౌత్ పేరిట నాలుగు కార్పొరేషన్లు ఏర్పాటు చేసే ప్రతిపాదనలపై తెలంగాణ ప్రభుత్వం యోచిస్తోంది. నాలుగు సిటీ కార్పొరేషన్లు ఏర్పాటు చేసి పాలనను వికేంద్రీకరిస్తే బాగుంటుందని జీహెచ్ఎంసీ సీనియర్ కార్పొరేటర్ పన్నాల దేవెందర్ రెడ్డి ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. నగర పరిధిని పెంచడం వల్ల ప్రజలకు సుపరిపాలన అందించేలా చూడాలని ఆయన సూచించారు.

నిధుల మంజూరులో అసమానతలు
కొన్ని డివిజన్లలో లక్ష మంది జనాభా ఉండగా మరికొన్ని చోట్ల కేవలం 30 వేల మంది వరకే ఉన్నారు.ఈ నేపథ్యంలో మౌలిక వసతుల కల్పన కోసం కేటాయించే నిధులు అధిక జనాభా ఉన్న చోట,తక్కువ జనాభా ఉన్న చోట ఒకే తీరుగా కేటాయిస్తే కొన్ని ప్రాంతాలకు లాభం జరిగి కొన్ని ప్రాంతాలు నష్టపోతున్నాయని ప్రభుత్వం భావిస్తోంది. అందుకే సమానంగా జనాభా ఉండేలా డివిజన్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తుంది. సిటీ కార్పొరేషన్ ఏర్పాటైతే కేంద్రప్రభుత్వం నుంచి వచ్చే నిధులు పెరుగుతాయని, దీనివల్ల అభివృద్ధి పనులు వేగిరం అయ్యే అవకాశం ఉందని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి చెప్పారు.

పాలకవర్గాలకు ప్రత్యేక అధికారులు
ఇప్పుడున్న కార్పొరేషన్ లో మున్సిపాలిటీల పాలకవర్గాల పదవీకాలం పూర్తయిన వెంటనే వాటికి ప్రత్యేక అధికారులను నియమించాలని రేవంత్ సర్కార్ ఆదేశించింది. ఆ తర్వాతే విలీన ప్రక్రియపై ముందుకు వెళ్లాలని మున్సిపల్ అధికారులకు రేవంత్ రెడ్డి ఆదేశాలు ఇచ్చినట్లు సమాచారం. ఇలా అయితే న్యాయపరమైన ఇబ్బందులు ఉండవు అని ప్రభుత్వం భావిస్తుంది.
డిల్లీ విధానం అమలు
హైదరాబాద్ నగరంలో ఢిల్లీ తరహా విధానాన్ని అవలంబించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది.ఢిల్లీలో గతంలో మూడు మున్సిపల్ కార్పొరేషన్లు ఉండగా,రెండేళ్ల క్రితం వాటిని ఒకే కార్పొరేషన్ గా విలీనం చేశారు. ఆ విధానాన్ని ఇక్కడ కూడా అనుసరించేందుకు ప్రభుత్వం అధికారులతో సర్కారు సమాలోచనలు చేస్తుంది.

ప్రతిపాదిత విలీనం ఇలా...
ప్రతిపాదిత విలీనంలో నిజాంపేట్, బోడుప్పల్, మీర్‌పేట్-జిల్లేల్‌గూడ, బండ్లగూడ జాగీర్, బడంగ్‌పేట్, పీర్జాదిగూడ, జవహర్‌నగర్ మున్సిపాలిటీలున్నాయి.గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌లో ఏడు మున్సిపల్ కార్పొరేషన్లు, 30 మున్సిపాలిటీలను విలీనం చేసే అవకాశాలను పరిశీలించాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్‌మెంట్ అధికారులను ఆదేశించారు.

సిటీ కార్పొరేషన్ లో 2 కోట్లకు చేరనున్న జనాభా
ప్రస్తుతం 150 డివిజన్లు కలిసి కోటి జనాభాతో జీహెచ్‌ఎంసీని ఏర్పాటు చేశారు. ఏడు కార్పొరేషన్లు,30 మున్సిపాలిటీల్లో 60 లక్షల జనాభా నివాసం ఉంటోంది.హైదరాబాద్ సిటీ కార్పొరేషన్ ఏర్పాటైతే మొత్తం జనాభా మొత్తం 1.8 నుంచి 2 కోట్లకు చేరుకుంటుందని అంచనా.

ఆర్ఆర్ఆఱ్ వరకు హెచ్ఎండీఏ పరిధి
హెచ్‌ఎండీఏ పరిధిని రీజనల్‌ రింగ్‌ రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్‌) వరకు పొడిగించాలని ఇటీవల ముఖ్యమంత్రి అధికారులను కోరారు.2007లో వైఎస్ రాజశేఖరరెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం జీహెచ్‌ఎంసీని ఏర్పాటు చేసింది. నగరం యొక్క పరిమాణాన్ని 175 చదరపు కిలోమీటర్ల నుంచి 650 చదరపు కిలోమీటర్లకు విస్తరించారు. ఎల్బీనగర్, గడ్డిఅన్నారం, ఉప్పల్ కలాన్, మల్కాజిగిరి, కాప్రా, అల్వాల్, కుతుబుల్లాపూర్, కూకట్‌పల్లి, శేరిలింగంపల్లి, రాజేంద్రనగర్, రామచంద్రపురం, పటాన్‌చెరు మున్సిపాలిటీలు విలీనం అయ్యాయి.2018లో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ను ఎల్‌బి నగర్, చార్మినార్, ఖైరతాబాద్, సికింద్రాబాద్, శేరిలింగంపల్లి,కూకట్‌పల్లి అనే ఆరు జోన్‌లుగా విభజించారు.ఈ జోన్లలో ప్రతి ఒక్కటి 30 సర్కిల్‌లుగా విభజించారు.తరువాత వాటిని 150 వార్డులుగా విభజించారు.

తెరమరుగు కానున్న మున్సిపాలిటీలు
హైదరాబాద్‌ మెట్రో డెవల్‌పమెంట్‌ అథారిటీ (హెచ్‌ఎండీఏ) పరిధి మొత్తాన్ని కలుపుతూ హైదరాబాద్‌ గ్రేటర్‌ సిటీ కార్పొరేషన్‌ ఏర్పాటు చే యాలని సీఎం రేవంత్‌రెడ్డి చేస్తున్న ఆలోచనలు కార్యరూపం దాలిస్తే జిల్లా సమగ్ర స్వరూపం మారనుంది.ప్రస్తుత మున్సిపల్‌ కౌన్సిల్‌ల గడువు డిసెంబరు 2024 నాటికి ముగియనుంది. దీంతో భువనగిరి,పోచంపల్లి,చౌటుప్పల్‌ మునిసిపాలిటీలు హైదరాబాద్‌ గ్రేటర్‌ సిటీ కా ర్పొరేషన్‌లో విలీనం అవుతాయి.దీంతో మునిసిపాలిటీలు తెరమరుగు కానున్నాయి.

మారనున్న నేతల తలరాతలు
ప్రభుత్వ నిర్ణయం మేరకు సిటీ కార్పొరేషన్‌ ఏర్పాటైతే కౌన్సిలర్లు, చైర్మన్లు, సర్పంచ్‌లు కనుమరుగవుతారు. వారి స్థానంలో కార్పొరేటర్లు, మేయర్లు పాలనలోకి వస్తారు.దీంతో నేతల తలరాతలు మారనున్నాయి. ప్రస్తుతం 1200 ఓటర్లతో ఒక మునిసిపల్‌ వా ర్డు, 300 ఓటర్లతో గ్రామ పంచాయతీ వార్డులు ఉండగా కార్పొరేషన్‌ ఏర్పాటైతే ఒక్కో డివిజన్‌ పరిధిలో సుమారు 30వేల నుంచి 40వేల ఓటర్లు ఉంటారు.

పెరగనున్న ఆదాయం
ప్రభుత్వానికి ప్రధాన ఆదాయ వనరులలో ప్రధానమైనది స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ర్టేషన్‌ శాఖ.సిటీ కార్పొరేషన్ ఏర్పాటైతే రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం జోరుగా సాగనుంది. దీనివల్ల రిజిస్ర్టేషన్ల రూపంలో ప్రభుత్వానికి భారీ ఆదాయం లభిస్తుంది. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారాన్ని కొత్త పుంతలు తొక్కించే లక్ష్యంతో హైదరాబాద్‌ నగర పరిధిని విస్తరించేందుకు రూపొందిస్తున్న ప్రణాళికలో భాగంగానే హైదరాబాద్‌ గ్రేటర్‌ సిటీ కార్పోరేషన్‌ ఏర్పాటు లేదా ప్రతిపాదనలు అని చెబుతున్నారు.గ్రేటర్‌ సిటీ కార్పొర్పోరేషన్‌ ఏర్పాటుతో ఆయా ప్రాంతాల అభివృద్ధి, ఆదాయం పెంపు, మౌలి క వసతుల కల్పన సులువవుతుందని అధికారులు అంటున్నారు.


Read More
Next Story