రైతులకు శుభవార్త..ముందుగా ప్రవేశించిన రుతుపవనాలు
x
కేరళ తీరాన్ని తాకిన నైరుతి రుతుపవనాలు (ఫొటో క్రెడిట్ : ఫేస్ బుక్)

రైతులకు శుభవార్త..ముందుగా ప్రవేశించిన రుతుపవనాలు

రైతులకు వాతావరణశాఖ తీపి కబురు చెప్పింది. రెండు రోజులు ముందుగానే రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకాయి.మరో మూడు, రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లోకి ప్రవేశించనున్నాయి.


- ఈ వేసవిలో మండుతున్న ఎండలతో అల్లాడిన ప్రజలకు భారత వాతావరణశాఖ చల్లటి కబురు చెప్పింది. ఖరీఫ్ పంటల సాగుకు కీలకమైన రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకాయి.

- ప్రతీ ఏడాది కంటే రెండు రోజులు ముందుగానే నైరుతి రుతుపవనాలు దేశంలోకి ప్రవేశించాయి. అరేబియా సముద్రంతోపాటు తమిళనాడులో కొన్ని ప్రాంతాల్లో బంగాళాఖాతంలో రుతుపవనాలు వ్యాపించాయి.

రెండు, మూడు రోజుల్లో తెలుగురాష్ట్రాల్లోకి...
ఇటీవల వచ్చిన రెమాల్ తుపాన్ ప్రభావం వల్ల రుతుపవనాలు ముందుగా ప్రవేశించాయని ఐఎండీ అధికారులు చెప్పారు. మరో మూడు, నాలుగు రోజుల్లో రుతుపవనాలు తెలంగాణ;ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోకి ప్రవేశించనున్నట్లు హైదరాబాద్ ఐఎండీ అధికారలు చెప్పారు.
తెలంగాణలోకి రుతుపవనాల రాకకు సంకేతం కోకిల కూసింది...
తెలంగాణ రాష్ట్రంలోకి త్వరలో రుతుపవనాలు ప్రవేశించనున్నాయని కోకిల ముందే తెలిపింది. బర్డ్ వాచర్స్ కు కోకిల కనిపించడంతో రుతువపనాల ఆగమనానికి సూచిక అని హైదరాబాద్ బర్డ్ వాచర్స్ చెబుతున్నారు. జహీరాబాద్ సమీపంలో రుతుపవనాల పక్షిగా పేరొందిన పైడ్ క్రెస్టెడ్ కోకిల బర్డ్ వాచర్స్ కు కనిపించింది.హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాలకు రుతుపవనాల రాకకు సూచనగా భావించే పైడ్ క్రెస్టెడ్ కోకిల లేదా జాకోబిన్ కోకిల రాకను తాము చూసినట్లు పక్షి వీక్షకులు శ్రీనివాస్ కొల్లా, శ్రీరామ్ రెడ్డి తెలంగాణ’కు చెప్పారు.

రుతుపవనాల ఆగమనాన్ని బర్డ్ వాచర్స్ కు సూచించిన కోకిల


కోకిల కనిపించిన వేళ...

జహీరాబాద్ ప్రాంతంలో కోకిల కనిపించడంతో ముదురు బూడిద రంగులో ఉండే మేఘాలు వచ్చే పది రోజుల్లో తెలంగాణపై బాగా కమ్మేస్తాయని బర్డ్ వాచర్స్ చెప్పారు. ఆఫ్రికాకు చెందిన కోకిల రుతుపవనాల కంటే ముందుగా ఉత్తరం వైపునకు వలస పోతుంది. రుతుపవనాల గాలితో కోకిలలు ఉత్సాహంతో సంచరిస్తుంటాయని ఆధునిక పక్షి శాస్త్ర ఔత్సాహికులు చెబుతున్నారు. జహీరాబాద్ శివార్లలో చించోలి వైల్డ్ లైఫ్ శాంక్చురీకి వెళ్లే మార్గంలో కోకిలను గుర్తింనట్లు వైల్డ్‌లైఫ్ ఫోటోగ్రాఫర్ శ్రీనివాస్ కొల్లా చెప్పారు.శంషాబాద్ సమీపంలో వారం రోజుల క్రితం మరో వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ శ్రీరామ్ రెడ్డి కూడా కోకిలని గుర్తించి ఫొటో తీశారు.

తెలంగాణలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు
తెలంగాణలో శుక్రవారం నుంచి మూడు రోజులపాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారి మల్లికార్జున్ రెడ్డి ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. శనివారం నాడు తెలంగాణలోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆయన తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలోని జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం,ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట్,యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హెైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట్, జోగులాంబ గద్వాల్ జిలాల్లో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని మల్లికార్జునరెడ్డి వివరించారు.

ఆదివారం నాడు...
తెలంగాణ రాష్ట్రంలో ఆదివారం నాడు ఉరుములు, మెరుపులతో కూడిన ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం డైరెక్టర్ డాక్టర్ కె.నాగరత్న ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. నల్గొండ, సూర్యాపేట్, వరంగల్, హన్మకొండ, జనగాం,సిద్ధిపేట్, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హెైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్,సంగారెడ్డి, మెదక్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట్, జోగులాంబ గద్వాల్ జిలాల్లో అక్కడక్కడ ఓ మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని నాగరత్న పేర్కొన్నారు.

ఈదురుగాలులు వీచే అవకాశం
జూన్ 1, 2 తేదీల్లో తెలంగాణలో ఉరుములు, మెరుపులతో కూడిన ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని హైదరాబాద్ ఐఎండీ అధికారులు చెప్పారు. తెలంగాణలోని 29 జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో శనివారం ఉరుములు, మెరుపులతో కూడిన గాలులు గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారులు శుక్రవారం తెలిపారు.కొమరం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, యాదాద్రి భువనగిరి, హైదరాబాద్, సిద్దిపేట మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్ జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ అధికారులు వివరించారు.

ఒకవైపు వర్షాలు...మరోవైపు వేడిగాలులు
తెలంగాణ రాష్ట్రంలోని ఎనిమిది మండలాల్లో గురువారం వేడిగాలులు వీచాయి. మంచిర్యాలలోని భీమారంలో అత్యధికంగా 47.2 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. 20 మండలాలు, ముఖ్యంగా ఉత్తర తెలంగాణలో గురువారం 45.8 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. కాగజ్‌నగర్, ఆసిఫాబాద్, వేమన్‌పల్లి, బెల్లంపల్లి, హాజీపూర్, కాసిపేట్, కమాన్‌పూర్, సుల్తానాబాద్ మండలాల్లో 45.7 డిగ్రీల సెల్సియస్‌కు పైగా ఉష్ణోగ్రతలు నమోదైందని తెలంగాణ స్టేట్ డెవలప్‌మెంట్ ప్లానింగ్ సొసైటీ తన నివేదికలో తెలిపింది.



Read More
Next Story