
ప్రజలకు గుడ్ న్యూస్ : కొన్ని వస్తువుల ధరలు తగ్గబోతున్నాయి
ఈశ్లాబును ఎత్తేస్తే దీని పరిధిలోకి వచ్చే నిత్యావసరాల ధరలన్నీ తగ్గుతాయి.
దేశంలోని ప్రజలు కేంద్రప్రభుత్వం నుండి ఒక గుడ్ న్యూస్ ను ఆశించవచ్చు. అదేమిటంటే నిత్యావసర వస్తువుల్లో కొన్నింటి ధరలు తగ్గబోతున్నట్లు సమాచారం. నిత్యావసర వస్తువుల ధరలు ఎందుకు తగ్గుతున్నాయ్ ? ఎందుకంటే జీఎస్టీలో అనేక శ్లాబులు ఉన్న విషయం తెలిసిందే. అలాంటి శ్లాబుల్లో 12 శాతం అనే శ్లాబు ఒకటుంది. ఈ శ్లాబుపరిధిలోకి కొన్ని నిత్యావసర వస్తువులు వస్తాయి. ఈశ్లాబును ఎత్తేస్తే దీని పరిధిలోకి వచ్చే నిత్యావసరాల ధరలన్నీ తగ్గుతాయి. ఒకవేళ ఏకారణం వల్లయినా 12 శాతం శ్లాబును తొలగించటం సాధ్యంకాకపోతే కనీసం మార్పలు అయినా చేయాలని కేంద్రప్రభుత్వం చాలా సీరియస్ గా ఆలోచిస్తున్నది. 12 శాతం శ్లాబును ఎత్తేయటం సాధ్యంకాకపోతే కనీసం 5 శాతానికి తగ్గించే విషయాన్ని పరిశీలిస్తోంది.
మనదేశంలో నిత్యావసరవస్తువుల ధరలు తగ్గటం అంటే అది ఎన్నికల సమయంలో మాత్రమే అని అందరికీ తెలిసిందే. అదేపద్దతిలో ఇపుడు జీఎస్టీ 12 శాతం పన్ను శ్లాబును ఎత్తేయాలన్నా లేదా తగ్గించాలని ఆలోచిస్తున్నా తొందరలో జరగబోయే పశ్చిమబెంగాల్ తదితర రాష్ట్రాలఎన్నికల్లో ఓట్లకోసమే అని అర్ధమవుతోంది. లేకపోతే ఎన్డీయే ప్రభుత్వానికి దేశంలోని మధ్య, దిగువ తరగతి కుటుంబాల కష్టాలు పట్టించుకునేంత తీరిక ఎక్కడుంది.
జీఎస్టీలో 12 శాతం శ్లాబులో మార్పులు తీసుకురావటం వల్ల కేంద్రప్రభుత్వానికి ఇపుడు వస్తున్న ఆదాయంలో భారీగా గండిపడుతుంది. నిపుణుల అంచనాల ప్రకారం రు. 50 వేల కోట్ల ఆదాయం తగ్గిపోతుంది. ఒక్కసారిగా రు. 50 వేల కోట్ల ఆదాయం పడిపోవటం అంటే చిన్న విషయంకాదు. ఆదాయం తగ్గుతుందని తెలిసినా కేంద్రం ఎందుకు శ్లాబులో మార్పులు తీసుకురావాలని చూస్తున్నది ? ఎందుకంటే శ్లాబులో మార్పుల వల్ల నిత్యావసరాల ధరలు తగ్గితే జనాల కొనుగోళ్ళు పెరుగుతాయన్నది అంచనా. కొనుగోళ్ళు పెరగటం అంటే జీఎస్టీ వసూళ్ళు పెరగటమే కదా ? అంటే ఇలా ధరలు తగ్గించి అలా కొనుగోళ్ళు పెంచి జీఎస్టీ ఆదాయాన్ని కేంద్రం బ్యాలెన్స్ చేసుకోబోతోందని అర్ధమవుతోంది.
తగ్గబోయే నిత్యావసరాలు ఇవేనా ?
టూత్ పేస్టులు, టూత్ పౌడర్లు, గొడుగులు, కుట్టుమిషన్లు, ప్రెషర్ కుక్కర్లు, ఇతర వంట సామాన్లు, ఎలక్ట్రిక్ ఐరన్ బాక్సులు, గీజర్లు, తక్కువ కెపాసిటి కలిగిన వాషింగ్ మెషీన్లు, సైకిళ్ళు, 1000 రూపాయలకు పైన ధరలుండే రెడీమేడ్ బట్టలు, రు. 500-వెయ్యిరూపాయల మధ్య ఉండే చెప్పులు, ఆల్ స్టేషనరీ ఐటమ్స్, వ్యాక్సీన్లు, సిరామిక్ టైల్స్, వ్యవసాయ పరికరాల ధరలు తగ్గే అవకాశాలున్నాయన్నది నిపుణుల అంచనా.