
హైదరాబాద్ కు కొత్తగా 2 వందేభారత్ రైళ్లు
తెలంగాణ మహారాష్ట్ర మధ్య ప్రయాణించేవారికి శుభవార్త
తెలంగాణ, మహారాష్ట్ర మధ్య ప్రయాణించే ప్రయాణికులకు ఇది శుభవార్త. ఈ మార్గంలో రెండు కొత్త వందే భారత్ రైళ్లను ప్రవేశపెట్టాలని రైల్వేశాఖ నిర్ణయించింది. ఎక్కువ దూరాన్ని తక్కువ సమయంలో రీచ్ కావడానికి వందేభారత్ రైళ్లు దోహదపడి ప్రయాణికుల ఆదరణ పొందాయి ఈ వందేభారత్ రైళ్లు. ఈ రెండు రైళ్లలో హైదరాబాద్ నుంచి పూణేకు ఒక రైలు, సికింద్రాబాద్ నుంచి నాందేడ్‌కు మరొకటి నడుస్తుంది. ఈ కొత్త రైళ్లు ప్రయాణ సమయాన్ని రెండు నుంచి మూడు గంటల వరకు ఆదా చేయనున్నాయి. తెలంగాణ, మహారాష్ట్రల మధ్య ప్రయాణించే వారికి వందేభారత్ రైళ్లు మరింత సౌకర్యవంతంగా మారనున్నాయి.
సికింద్రాబాద్-పూణే శతాబ్ది ఎక్స్‌ప్రెస్ స్థానంలో
చాలాకాలం నుంచి సికింద్రాబాద్-పూణే శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌ను ప్రవేశపెట్టాలని రైల్వేశాఖ చూస్తోంది. కొత్తగా వచ్చే రెండు వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లతో శతాబ్ది ఎక్స్‌ప్రెస్ స్థానాన్ని భర్తీ చేయాలని రైల్వే శాఖ భావిస్తోంది. శతాబ్ది ఎక్స్‌ప్రెస్ ప్రస్తుతం ఎనిమిదిన్నర గంటల్లో ప్రయాణిస్తుంది. తెలంగాణ నుంచి మహారాష్ట్ర మధ్య నడవనున్న ఈ వందే భారత్ రైళ్లు మంగళవారం మినహా మిగతా రోజుల్లో సర్వీసులు అందిస్తాయి. తక్కువ స్టాప్‌లతో, రెండు ఏసీ ఎగ్జిక్యూటివ్ క్లాస్ కోచ్‌లు, తొమ్మిది ఏసీ చైర్ కార్లు, రెండు ఈఓజీ కోచ్‌లతో ఉంటుంది.
ప్రస్తుతం సికింద్రాబాద్-విశాఖపట్నం, సికింద్రాబాద్-తిరుపతి, కాచిగూడ-యశ్వంత్‌పూర్ రూట్లలో ఇప్పటికే ఉన్న వందే భారత్ రైళ్లలో హై ఆక్యుపెన్సీ ఉండటంతో రైల్వేశాఖ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ రెండు కొత్త రైళ్లతో కలిపి సౌత్ సెంట్రల్ రైల్వే మొత్తం ఏడు వందే భారత్ సర్వీసులను నడుపుతున్నట్లు అయ్యింది. స్వదేశీ సెమీ-హైస్పీడ్ రైళ్లను అత్యధికంగా నడిపే జోన్లలో సౌత్ సెంట్రల్ రైల్వే ఒకటిగా నిలుస్తుంది. సికింద్రాబాద్-ముజఫర్‌పూర్ మధ్య అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ కూడా ఒక నెలలోపు ప్రారంభమవుతుందని అధికారికవర్గాలు తెలిపాయి. అది తెలంగాణ రాజధాని నుంచి మరో లాంగ్-డిస్టెన్స్ రైలు మార్గం అవుతుందని అధికారులు చెబుతున్నారు. వందే భారత్ రైళ్లను ఆధునిక సౌకర్యాలతో తయారు చేశారు. ప్రయాణ సమయాన్ని మరింత ఆదా చేయడంలో వందే భారత్ రైళ్లు కీలకంగా నిలిచాయి. ఈ రైళ్లు స్వదేశీ సాంకేతికతతో నిర్మితమై, భారత రైల్వేలో సరికొత్త అధ్యాయాన్ని సృష్టించాయి.