పట్టాలు తప్పిన గూడ్స్,మూడు రైల్వే లైన్లు ధ్వంసం..31 రైళ్లు రద్దు
పెద్దపల్లిజిల్లా రాఘవాపూర్ గ్రామం వద్ద గూడ్స్ రైలు పట్టాలు తప్పడంతో మూడు రైల్వే లైన్లు దెబ్బతిన్నాయి.రైల్వే లైన్లను పునరుద్ధరించేందుకు 24 గంటల సమయం పట్టనుంది.
ఐరన్ లోడుతో వెళుతున్న గూడ్స్ రైలు పెద్దపల్లి జిల్లా రాఘవాపూర్ వద్ద మంగళవారం రాత్రి పట్టాలు తప్పింది. దీనివల్ల 11 బోగీలు పట్టాలు తప్పాయి. పట్టాలు, విద్యుత్ లైన్లు దెబ్బతినడంతో రైల్వే అధికారులు హుటాహుటిన సంఘటన స్థలానికి వచ్చి దెబ్బతిన్న రైల్వే ట్రాక్ మరమ్మతు పనులు చేపట్టారు.
- రైలు పట్టాల మరమ్మతులకు మరో 24 గంటల సమయం పడుతుందని దక్షిణ మధ్య రైల్వే అధికారులు చెప్పారు. దీని వల్ల కాజీపేట-బల్లార్షా మార్గంలో పలు రైళ్లను ఎక్కడికక్కడే నిలిపివేశారు.
- 500 మంది రైల్వే కార్మికులు ట్రాక్ పునరుద్ధరణ పనులు చేపట్టారు. గూడ్స్ రైలు ప్రమాదంపై కేంద్రమంత్రి బండి సంజయ్ ఆరా తీశారు. తక్షణమే ట్రాక్ మరమ్మతులు చేసి, రైళ్ల రాకపోకలను పునరుద్ధరించాలని కేంద్రమంత్రి అధికారులను ఆదేశించారు.
పలు రైళ్ల రద్దు
దక్షిణ మధ్య రైల్వే 31 రైళ్ల రాకపోకలను రద్దు చేసింది. పలు రైళ్లను పాక్షికంగా నిలిపివేసింది. కొన్నిరైళ్లను దారి మళ్లించింది. నర్సాపూర్-సికింద్రాబాద్, సికింద్రాబాద్-నాగ్‌పుర్, హైదరాబాద్-సిర్పూర్ కాగజ్‌నగర్, సికింద్రాబాద్-కాగజ్‌నగర్, కాజీపేట-సిర్పూర్ టౌన్, సిర్పూర్ టౌన్-కరీంనగర్, కరీంనగర్-బోధన్, సిర్పూర్ టౌన్-భద్రాచలం రోడ్, భద్రాచలం రోడ్-బల్లార్షా, బల్లార్షా-కాజీపేట, యశ్వంత్‌పూర్-ముజఫర్‌పూర్ రైళ్లను రద్దు చేశారు.
అదిలాబాద్ - పార్లీ, పార్లీ - అదిలాబాద్, అకోలా - పూర్ణ, పూర్ణ - అకోలా, అదిలాబాద్ - నాందేడ్, నాందేడ్ - అదిలాబాద్, నిజామాబాద్ - కాచిగూడ,యశ్వంతపూర్- ముజఫర్పూర్,కాచిగూడ - రాయచూర్, రాయచూర్ - కాచిగూడ, గుంతకల్ - బోధన్, బోధన్ - కాచిగూడ, కాచిగూడ - గుంతకల్ కాచిగూడ - నాగర్సోల్, కాచిగూడ - కరీంనగర్, కరీంనగర్- కాచిగూడ, సికింద్రాబాద్ - రామేశ్వరం, రామేశ్వరం - సికింద్రాబాద్, సికింద్రాబాద్ - తిరుపతి, తిరుపతి - సికింద్రాబాద్ రైళ్లను అధికారులు రద్దు చేశారు.
Next Story