ట్రాఫిక్ అలర్ట్స్ పై గూగుల్ అద్దిరిపోయే అప్ డేట్
x
Hyderabad Traffic

ట్రాఫిక్ అలర్ట్స్ పై గూగుల్ అద్దిరిపోయే అప్ డేట్

పావుగంటలోపు చేయాల్సిన ప్రయాణానికి కూడా ట్రాఫిక్ సమస్యల వల్ల తక్కువలో తక్కువ ముప్పావుగంట ప్రయాణం చేయాల్సుంటుంది


హైదరాబాద్ ట్రాఫిక్ అంటేనే జనాలు భయపడిపోతారు. పావుగంటలోపు చేయాల్సిన ప్రయాణానికి కూడా ట్రాఫిక్ సమస్యల వల్ల తక్కువలో తక్కువ ముప్పావుగంట ప్రయాణం చేయాల్సుంటుంది. అందుకనే ట్రాఫిక్ సమస్యలపై వాహనదారులకు ముందుగానే అవసరమైన అలర్ట్స్ ఇవ్వటానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ట్రాఫిక్ పోలీసులు-గూగుల్(Google) ప్రతినిధుల మధ్య ఇదే విషయమై చర్చలు జరిగాయి. ఇప్పటికే హైదరాబాద్(Hyderabad) ట్రాఫిక్ పై మొబైల్ వినియోగదారులకు కొంత సమాచారం అందుతోంది. అయితే ఇప్పుడు అందుతున్న సమాచారం కన్నా మరింత నిశితంగా ముందుగానే సమాచారం అందేలా చేయలన్నది ట్రాఫిక్ పోలీసుల ఆలోచన. ఈ విషయంలోనే పోలీసు ఉన్నతాధికారులు గూగుల్ ప్రతినిధులతో భేటీ అయ్యారు. భేటీల తర్వత కొంత కసరత్తు కూడా జరిగింది. ప్రయోగాత్మకంగా కొన్ని రూట్లలోనే ఇపుడు ట్రాఫిక్ పోలీసుల ఇచ్చిన ఫీడ్ బ్యాక్ తో గూగుల్ అలర్టులు అందుతున్నాయి. ఈప్రయోగం నూరుశాతం సక్సెస్ అయితే హైదరాబాద్ మహానగరం ట్రాఫిక్ సిస్టమ్ మొత్తాన్ని గూగుల్ మ్యాప్స్ పరిధిలోకి తీసుకొస్తారు.

సాధారణంగా ప్రతి ట్రాఫిక్ జంక్షన్లోను నాలుగు లేదా ఐదు రోడ్లుంటాయి. ఒక్కో రోడ్డుకు నిర్ణీత సమయం గ్రీన్ లైట్, రెడ్ లైడ్ వెలుగుతుంటుంది. ఆ పర్టిక్యులర్ రోడ్డు మీద వాహనాల రద్దీ ఆధారంగా ట్రాఫిక్ సిగ్నల్ లైట్ల సైకిల్ పనిచేస్తుంటుంది. ఒక్కోసారి సాఫ్ట్ వేర్ దెబ్బతిన్నపుడు ట్రాఫిక్ పోలీసులే మాన్యువల్ గా ఆపరేట్ చేస్తుంటారు. ఇలాంటి అనేక సమస్యలకు గూగుల్ సంస్ధ పరిష్కారం చూపాలని అనుకుంటోంది.

ట్రాఫిక్ సిగ్నల్స్ అనుసంధానించి ఉండే సర్వర్లకు ఏజంక్షన్ లో...ఏరోడ్డులో ఎంత ట్రాఫిక్ ఉందన్న విషయం సాంకేతికంగా తెలిసిపోతుంటుంది. దీనికోసం ఇంటిగ్రేటెడ్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టంలో అడాప్టివ్ ట్రాఫిక్ కంట్రోలింగ్ సిస్టం విధానం అమలవుతుంటుంది. ఈసాంకేతికత వల్ల ఉపయోగం ఏమిటంటే ప్రతి జంక్షన్ కు అనుసంధానించి ఉండే నాలుగు లేదా ఐదు రోడ్లలో ట్రాఫిక్ ఎంతన్నది ట్రాఫిక్ పోలీసులకు ఎప్పటికప్పుడు తెలుస్తుంది. పోలీసుల దగ్గరుండే సాఫ్ట్ వేర్ ను గూగుల్ సర్వర్ కు అనుసంధానం చేయటం ద్వారా ప్రత్యేక సాఫ్ట్ వేర్ కారణంగా వాహనాల రద్దీని లెక్కేసి ట్రాఫిక్ జామ్ లు ఎంతసమయం ఉంటుందన్న విషయాన్ని కాస్త అటుఇటుగా లెక్కేస్తుంది.

ఇప్పటికే ఒక రూటులోని వాహనదారులు వాడుతున్న మొబైల్ ఫోన్ల ద్వారా ఆ పర్టిక్యులర్ రోడ్డుపైన ట్రాఫిక్ రద్దీని గూగుల్ అంచన వేస్తోంది. దాని ద్వారానే గూగుల్ వినియోగదారులకు ట్రాఫిక్ అలర్టులు అందుతున్నాయి. అయితే ఇపుడు మొదలైన ప్రయోగం సక్సెస్ అయితే వాహనదారులకు తాము ప్రయాణిస్తున్న రోడ్డులో మూడు కిలోమీటర్ల ముందు ట్రాఫిక్ ఎంతున్నది అన్న విషయం తెలిసిపోతుంది. దీనివల్ల ట్రాఫిక్ రద్దీ అంటే ట్రాఫిక్ జామ్ లు, నిరసనలు, రోడ్డు ప్రమాదాల వల్ల ట్రాఫిక్ అంతరాయాలు వినియోగదారులకు తెలిసిపోతుంది. దీనివల్ల వాహనదారులు ట్రాఫిక్ ను మళ్ళించుకుని పక్క రోడ్ల ద్వారా ముందుకు వెళ్ళిపోవచ్చు. ప్రయోగం సక్సెస్ అయి ఈ విధానం అమల్లోకి వస్తే సిగ్నల్స్ అన్నీ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్లోని సర్వర్ ఆధారంగా పనిచేస్తాయి. గూగుల్ ప్రయోగం నూరుశాతం సక్సెస్ అవ్వాలని కోరుకుందాం.

Read More
Next Story