ఇందిరమ్మ ఇళ్లపై అప్పుడు కోతలు.. ఇప్పుడు  వాతలు
x

ఇందిరమ్మ ఇళ్లపై అప్పుడు కోతలు.. ఇప్పుడు వాతలు

నిర్మాణ నిబంధనలపై ప్రజల్లో అయోమయం, గద్దెనెక్కాక మాట మార్చారని ఆగ్రహం


ఇల్లు కట్టుకోవడం ప్రతి వ్యక్తి జీవితంలో ఓ కల.. తిని తినకుండా, ప్రతి పైసా కూడబెట్టుకుని ఓ ఫ్లాట్ తీసుకుని మంచి ఇళ్లు కట్టుకోవాలని అనుకుంటారు. ప్రభుత్వం కూడా పేదల కోసం అనేక ఇళ్ల పథకాలను ప్రవేశపెట్టింది.

కాంగ్రెస్ ప్రవేశ పెట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకం, అంబేడ్కర్ పేరు మీద పట్టణాలలో తీసుకొచ్చిన పథకాలు, కేసీఆర్ డబుల్ బెడ్రూం ఇళ్లు.. ఇలా పేరు ఏదైనా పేదలకు ఇళ్లు కట్టించి ఇవ్వడమే లక్ష్యంగా ప్రభుత్వాలు పనిచేశాయి.

ఇప్పుడు రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్ల పథకంపై జోరుగా చర్చ సాగుతోంది. ఇంటి నిర్మాణం కోసం ప్రజాపాలన కార్యక్రమంలో దరఖాస్తు చేసిన వారందరి వివరాలను క్షేత్ర స్థాయిలో అధికారులు పరిశీలిస్తున్నారు.
ఇంటి నిర్మాణం కోసం దాదాపు 77 లక్షలకు పైగా దరఖాస్తులు వచ్చినట్లు ప్రభుత్వం ప్రకటించింది. దరఖాస్తులను పరిశీలించి అర్హులకు ఇళ్లు కేటాయించేందుకు యుద్ద ప్రాతిపదికన పనులు చేస్తున్నారు.
నిబంధనలపై గుస్సా..
ఇందిరమ్మ ఇళ్లపై ప్రభుత్వం ప్రస్తుతం తీసుకొచ్చిన కొత్త నిబంధనలపై ప్రజలు తీవ్ర వ్యతిరేకత కనపరుస్తున్నారు. ఎన్నికల ప్రచారాల్లో హమీ ఇచ్చినవాటికి, అధికారంలోకి వచ్చిన తరువాత చెప్పిన మాటలకు, ఇప్పుడు ప్రభుత్వం తీసుకొస్తున్న నిబంధనలకు ఎక్కడా పొంతనలేకపోవడంతో లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు.
400 నుంచి 600 చదరపు అడుగులు అంటే 66 గజాల లోపే ఇంటిని నిర్మించాలని నిబంధనలు పెట్టడం, ఆ పరిధి దాటి బేస్ మెంట్లు నిర్మించిన వారికి బిల్లులు చెల్లించకుండా నిరాకరించడంతో ప్రభుత్వంపై ప్రజలు దుమ్మెత్తి పోస్తున్నారు.
ఇంటి నిర్మాణాలను ఎప్పుడూ భవిష్యత్ తరాలను దృష్టిలో పెట్టుకుని నిర్మించుకుంటారు. ప్రభుత్వం ఇచ్చే వాటితో పాటు అదనంగా అప్పులు తెచ్చి నిర్మాణాలు కొనసాగిస్తారు.
ఇలా సేకరించిన అప్పులకు దాదాపు ఒక దశాబ్దం కంటే ఎక్కువ కాలం ఈఎంఐలు, వడ్డీలు కట్టడానికి సిద్దమవుతుంటారు. ఈ కష్టాలను చూసే మన పెద్దలు.. ఇల్లు కట్టి చూడు.. పెళ్లి చేసి చూడు అనే సామెతను వాడుతుంటారు. అంతటి ప్రాధాన్యం ఉన్న ఇంటి నిర్మాణానికి ఇప్పుడు అధికారంలో ఉన్న రేవంత్ సర్కార్ కొర్రీలు పెడుతుండటంపై లబ్ధిదారులు ఏ మాత్రం సంతోషంగా లేరు.
అప్పట్లో ఇందిరమ్మ ఇళ్లంటే..
2004 నుంచి 2014 వరకూ అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కూడా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి సాయం చేసింది. సొంతంగా స్థలం ఉన్నవారికి ఆర్థిక సాయం అందజేసింది. అప్పుడు కూడా 400 చదరపు అడుగుల నిర్మాణం అనే నిబంధన ఉన్నా వాటిని పెద్దగా పట్టించుకోలేదు.
సొంతంగా తమకు నచ్చిన రీతిలో ఇంటి నిర్మాణం చేసుకున్న వారికి ప్రభుత్వం ఆమోదించి, సాయం అందజేసింది. కానీ కచ్చితంగా ఇంటి నిర్మాణం పూర్తయ్యాక మూడు రంగులు, ఇందిరమ్మ బొమ్మ పెట్టాలని షరతు విధించింది. వీటిని ఆనాడు అంతా పాటించారు. చాలామంది ఈ పథకంలోనే భాగంగానే తమ సొంత ఇంటికలను నెరవేర్చుకున్నారు.
కానీ ఇప్పుడు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కార్ ఈ పథకంలో నిబంధనల పేరుతో కొర్రీలు పెడుతోంది. ఏ మాత్రం నిబంధనలు ఉల్లంఘించిన ఆర్థిక సాయానికి అందించడానికి నిరాకరిస్తోంది.
మొదట సొంత స్థలం ఉన్నవారికి నచ్చిన రీతిలో నిర్మించుకోవచ్చని చెప్పిన ప్రభుత్వం తాజాగా కొత్త పల్లవి అందుకోవడం లబ్ధిదారుల గొంతులో పచ్చివెలక్కాయ పడినట్లు అయింది. తాము చెప్పినట్లు చేయకపోతే కేటాయించిన ఇళ్లను రద్దు చేస్తామని ప్రకటించడం తెలంగాణ ప్రజల్లో ఒకింత కలవరానికి గురి చేస్తోంది.
కేసీఆర్ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో డబుల్ బెడ్ రూం ఇళ్లను కట్టిస్తామని మోడల్ ఇళ్లను సైతం కట్టించి చూపింది. హైదరాబాద్ లో నిర్మించిన మోడల్ ఇళ్లను పరిశీలించిన అప్పటి గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ తనకు కూడా ఓ ఇంటిని నిర్మించి ఇవ్వాలని కోరడం అప్పట్లో ప్రజల దృష్టిని ఆకర్షించింది.
ప్రతి ఒక్కరు తమకు కేసీఆర్ ఓ డబుల్ బెడ్రూం ఇంటిని నిర్మించి ఇస్తారని ఆశపడ్డారు. కానీ తరువాత ఇది చాలా ఆలస్యం కావడంతో చాలామందికి ఆ పథకం దూరపు కొండల్లాగే కనిపించాయి. అదే సమయంలో కాంగ్రెస్ ఇంటి నిర్మాణానికి ఐదు లక్షలు ఇస్తామని చెప్పడంతో ప్రజలంతా కాంగ్రెస్ మాటలను నమ్మారు.



‘‘గద్దెనెక్కిన తరువాత కాంగ్రెస్ మాట మార్చింది. కేవలం అరగుంటలో ఇంటిని నిర్మించుకోవాలని షరతు విధించింది. ఇది చాలా దారుణం. అంతకుముందు అధికారంలో ఉన్న ఇదే కాంగ్రెస్ పార్టీ కొన్ని జిల్లాల్లో కేవలం అగ్గిపెట్టే అంతా ఇళ్లను కట్టించింది.
ఒక మంచం వేస్తే గదిలో ఫిక్స్ అయ్యే విధంగా, మరో వ్యక్తి ఎటువైపు నడవకుండా ఉండేలా నిర్మాణాలు చేపట్టింది. ఇప్పుడు మమ్మల్ని కూడా అలాంటి వాటినే కట్టుకోమని బలవంతం చేస్తోంది.
నాకు ఇద్దరు కుమారులు ఉన్నారు. ఉన్న ఇళ్లు సరిపోవడం లేదని దాని కూల్చివేసి ఇంటి పని మొదలు పెట్టాను. అరగుంటలో ఇల్లు కట్టాలని అధికారులు చెబుతున్నారు. బేస్ మెంట్ నిర్మాణం కొలతల కంటే ఎక్కువగా ఉంది కాబట్టి బిల్లు ఇవ్వమని, దాన్ని మార్చాలని చెబుతున్నారు.
ఈ విషయం ముందే కచ్చితంగా చెబితే నేను ఇల్లు కట్టే పనే విషయంలో ఆలోచించే వాడిని’’ అని ఓ లబ్ధిదారుడు( తన పేరు చెప్పకూడదని షరతు విధించాడు) ఫెడరల్ తో చెప్పారు.
ఇందిరమ్మ ఇంటి పథకం రెండో దశ లిస్ట్ వచ్చాక చాలా గ్రామాల్లో ప్రభుత్వ నిబంధనలపై చర్చలు జరుగుతున్నాయి. ఓ గ్రామంలో జరిగిన పుట్టిన రోజు వేడుకకు హాజరైన కొంతమంది సామాన్యులు ఇదే విషయం చర్చించారు.
‘‘ ఓ పది రూపాయలు కలిపి ఇళ్లు కట్టుకోవాలనుకుంటారు కానీ.. చిన్న చిన్న ఇళ్లు కట్టుకుని ఏం చేసుకుంటారు. ఎదిగిన ఆడపిల్లలు ఉన్నావాళ్లు ఎక్కడ ఉంటారు, చుట్టాలు, చిన్న చిన్న కుటుంబ ఫంక్షన్లు నిర్వహిస్తే వచ్చిన వారు ఎక్కడ ఉంటారు’’ అని గ్రామీణులు తమదైన శైలిలో ప్రభుత్వ నిర్ణయాలపై తమ అభిప్రాయాలను వెలిబుచ్చారు.
అవినీతి చెద..
ఈ పథకంపై విమర్శలు వ్యక్తం అవుతున్న తరుణంలోనే కాంగ్రెస్ పార్టీ నియమించిన ఇందిరమ్మ కమిటీలు కూడా వసూల్ల కార్యక్రమానికి తెరతీశాయి. ఒక్కో ఇందిరమ్మ ఇల్లు మంజూరు అయిన లబ్దిదారుడి ఇంటికి నేరుగా వెళ్లి రూ. లక్షతో బేరం పెట్టి రూ. 50 వేల వరకూ బేరం మాట్లాడుకుంటున్నారు.
ఈ మొత్తం ఒకేసారి కాకుండా ప్రభుత్వం చెల్లించే నాలుగు విడతల్లో తమ వంతుగా ఇవ్వాల్సిన మొత్తాలను డిమాండ్ చేస్తున్నారు. దీనికి చాలామంది లబ్ధిదారులు సరే అంటున్నారు. కాదంటే జాబితా నుంచి పేరు తొలగించే అవకాశం ఉంటుందేమో అని భయపడుతున్నారు.
ఇవే కాకుండా సీఎంఆర్ఎఫ్ పథకంలోని లబ్ధిదారుల నుంచి ముడుపులు వసూలు చేస్తున్నారు. ఇవన్నీ కూడా రేపు భవిష్యత్ లో ప్రభుత్వానికి గుదిబండగా మారే అవకాశం కనిపిస్తోంది.
ఇందిరమ్మ ఇళ్ల ఎంపిక ఒక్కో దరఖాస్తుకే చాలా చోట్ల పదివేల వరకూ కాంగ్రెస్ కార్యకర్తలు వసూలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. వీటిపై ఇప్పటి వరకూ ప్రభుత్వం దృష్టి పెట్టినట్లు కనిపించడం లేదు.
ప్రతిపక్ష నేత కేసీఆర్ ఎల్కతుర్తి సభలో ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు చేశారు. పథకాల అమలులో జరుగుతున్న లోపాలను ఎండగడుతున్నారు. అనేక పథకాలను ప్రభుత్వం కనీసం ప్రస్తావించకపోవడంపై కూడా బీఆర్ఎస్ అధినేత మాట్లాడటం, సభలో దానికి అనూహ్య రెస్పాన్స్ రావడం అంతా ప్రభుత్వానికి ఒక హెచ్చరిక లాంటిది. పరిస్థితులు ఇలా ఉన్నప్పటికి ప్రభుత్వం మాత్రం మొండిగా వ్యవహరించడంపైనే ఎక్కువగా దృష్టి పెడుతున్నట్లు కనిపిస్తోంది.
యాభై శాతం కంటే ఎక్కువ అనర్హులే..
ఇందిరమ్మ ఇంటి పథకానికి రాష్ట్ర వ్యాప్తంగా 77 లక్షలకు పైగా దరఖాస్తులు వచ్చినట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో వారిని ప్రభుత్వం మూడు జాబితాలుగా ప్రకటించింది.
ఇవి ఎల్ 1, ఎల్ 2, ఎల్ 3 గా ఉన్నాయి. ఎల్ 1 జాబితాలో ఖాళీ స్థలం, రేకుల ఇల్లు, పూరి గుడిసే ఉన్నవారిని చేర్చారు. వీరి సంఖ్య 18 లక్షలుగా ఉంది. ఇంక ఎల్ జాబితాలో ఇళ్లు, స్థలం లేనివారిని చేర్చారు. వీరి సంఖ్య 17 లక్షలుగా ఉంది.
మిగిలిన ఎల్ 3 జాబితాలో ప్రభుత్వ ఉద్యోగులు, ఇన్ కమ్ ట్యాక్స్ కట్టేవారు, కార్లు ఇతర వాహనాలు ఉన్నావారు ఉన్నారు. వీరు దాదాపుగా 53 శాతంగా ఉన్నట్లు క్షేత్ర స్థాయిలో ఉన్న ఆధారాలను బట్టి ప్రభుత్వం నిర్ణయించింది. వీరికి ఎలాంటి ఇళ్లు ఇచ్చేది లేదని ప్రభుత్వం ప్రకటించింది.
ప్రభుత్వం ప్రతి నియోజవర్గానికి 3500 ఇళ్లను మంజూరు చేసింది. ఇందులో 500 ఇళ్లను పట్టణ ప్రాంతంలో ఉన్న పేదలకు కేటాయించింది. రాష్ట్రంలో మొదటి విడతగా 70,122 ఇళ్లను మంజూరు చేయగా, 46 వేల మందికి మంజూరు పత్రాలను అందజేశారు. కానీ ఇందులో చాలామంది ఈ నిబంధనలతో ఎటూతేల్చుకోలేకపోతున్నారు.
Read More
Next Story