ఆర్ఠీసీకి సర్కార్ కొత్త సంవత్సర కానుక
x
కొత్త బస్సులు ప్రారంభిస్తున్న మంత్రి పొన్నం ప్రభాకర్, ఆర్టీసీ అధికారులు

ఆర్ఠీసీకి సర్కార్ కొత్త సంవత్సర కానుక

తెలంగాణ ఆర్టీసీకి ప్రభుత్వం కొత్తగా 80 బస్సులు అందజేసింది. వాటిని మంత్రి పొన్నం ప్రభాకర్ హైదరాబాద్ లో ప్రారంభించారు.


టీఎస్ ఆర్టీసీకి ప్రభుత్వం రెండు రోజుల ముందుగానే కొత్త సంవత్సర కానుకను అందించింది. శనివారం 80 కొత్త ఆర్టీసీ బస్సులను ప్రారంభించింది. వీటిలో 30 ఎక్స్ ప్రెస్, 30 రాజధాని, 20 లహరి నాన్ ఏసీ బస్సులు ఉన్నాయి. వీటిని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహం వద్ద మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. ప్రయాణీకుల కోసం మరో 1000 ఎలక్ట్రిక్ బస్సులు ప్రారంభించబోతున్నామని, త్వరలోనే అవి నగరానికి వస్తాయని అన్నారు.

ఆర్టీసీ ఉద్యోగులు తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారని మంత్రి గుర్తు చేశారు. ఎన్ని ఇబ్బందులున్న ఆర్టీసీని కాపాడుకుంటామని అన్నారు. కార్మికుల సంక్షేమం, ఆర్టీసీ సంరక్షణకు పెద్ద పీట వేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించినట్లు చెప్పారు. త్వరలోనే సీసీఎస్ బకాయిలు విడుదల చేస్తామని హమీ ఇచ్చారు. అనంతరం ఆర్టీసీ ఎండీ సజ్జనార్ మాట్లాడారు.

మహలక్ష్మీ పథకం ప్రారంభించిన 21 రోజుల్లోనే మహిళలకు ఆర్టీసీ చేరువఅయిందని అన్నారు. బస్సు ఆక్యూపెన్సీ రేషియో మెరుగైందని చెప్పారు. ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించిన తర్వాత మొత్తం 6 కోట్ల ఉచిత టికెట్లు విక్రయించామన్నారు. త్వరలో రానున్న వెయ్యి ఎలక్ట్రిక్ బస్సుల్లో 500 హైదరాబాద్ నగరానికి కేటాయిస్తామని, మరో 500 జిల్లాలకు కేటాయిస్తామని ఎండీ ప్రకటించారు.

మహలక్ష్మీ పథకం తరువాత ఆర్టీసీ ఆక్యూపెన్సీ 69 శాతం నుంచి 88 శాతానికి చేరుకుంది. కొన్ని డిపోల్లో వందశాతానికి సైతం చేరినట్లు ఆర్టీసీ అధికారులంటున్నారు. మహలక్ష్మీ పథకానికి ప్రభుత్వం ఏటా రూ. 1500 కోట్లు అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. పథకం ప్రారంభంలో నెలకు రూ. 250 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేస్తోంది. ఈ పథకం ద్వారా మహిళలకు పల్లె వెలుగు, ఎక్స్ ప్రెస్, సిటీ లో ఆర్డీనరీ, మెట్రో ఎక్స్ ప్రెస్ లో ఉచితంగా ప్రయాణించే అవకాశం ఉంటుంది.

అలాగే మరో 1050 డీజిల్ బస్సుల కొనుగోలు చేయడానికి సైతం ఆర్టీసీ ప్రణాళికలు రచిస్తోంది. ప్రస్తుతం ఆర్టీసీ లో 9100 ఉద్యోగులు, 50 వేల ఇతర సిబ్బంది ఉన్నారు. వీరందరికి సకాలంలో జీతాలు వేయడానికి సంస్థ తీవ్ర ఇబ్బంది పడుతోంది. ఈ సందర్భంగా టీఎస్ ఆర్టీసీకి మహలక్ష్మీ పథకం వరంలా మారిందని అధికారులు అంటున్నారు. ఉచితంగా ప్రయాణించిన వారి వివరాల ఆధారంగా ప్రభుత్వం ఆ మొత్తాన్ని ఆర్టీసీ అందజేయనుంది.

Read More
Next Story