
జోర్డాన్ దేశంలో చిక్కుకున్న తెలంగాణ వాసులు
జోర్డాన్‌లో చిక్కుకున్న తెలంగాణ వాసులకు సర్కార్ అండ
జోర్డాన్ కార్మికశాఖ అధికారులతో సమన్వయం చేస్తున్న భారతీయ ఎంబసీ
జోర్డాన్ దేశంలో కష్టాలు పడుతున్నామని తెలంగాణకు చెందిన 12 మంది కార్మికులు ఇటీవల వీడియో విడుదల చేశారు. దీనిపై బీఆర్ఎస్ నాయకులు, మాజీ మంత్రి టి.హరీష్ రావు, రాజ్యసభ సభ్యుడు కే.ఆర్.సురేష్ రెడ్డి స్పందించారు.
సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో...
జోర్డాన్ లో చిక్కుకున్న తెలంగాణ కార్మికుల కుటుంబ సభ్యుల విజ్ఞప్తి మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ఆదేశాలతో, తెలంగాణ ప్రభుత్వ జీఏడి ఎన్నారై విభాగం తక్షణ చర్యలు ప్రారంభించింది. జోర్డాన్‌లోని భారత రాయబార కార్యాలయానికి, ఢిల్లీలోని విదేశాంగ మంత్రిత్వ శాఖకు లేఖలు పంపి విషయం తెలియజేశారు. కేసును ‘మదద్’ పోర్టల్‌లో నమోదు చేశారు.ఈ కేసును జీఏడి ఎన్నారై విభాగం ఐఏఎస్ అధికారులు సయ్యద్ అలీ ముర్తుజా రిజ్వీ, సి.హెచ్.శివ లింగయ్య లు వ్యక్తిగతంగా పర్యవేక్షిస్తున్నారు.
తెలంగాణ వాసుల సంక్షేమంపై శ్రద్ధ
తెలంగాణ వాసులు ప్రపంచంలో ఏ దేశంలో ఉన్నా వారి సంక్షేమం, భద్రత గురించి ముఖ్యమంతి ఏ.రేవంత్ రెడ్డి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని తెలంగాణ ప్రభుత్వ నియమిత ఎన్నారై అడ్వయిజరీ కమిటీ ఛైర్మన్, విశ్రాంత ఐఎఫ్ఎస్ అధికారి, అంబాసిడర్ డా.బిఎం వినోద్ కుమార్ చెప్పారు. జోర్దాన్ లో చిక్కుకున్న కార్మికుల విషయంలో ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందన్నారు. వలస జీవుల సమస్యను రాజకీయ కోణంలో కాకుండా మానవీయ కోణంలో చూడాలని బీఆర్ఎస్ నాయకులకు డా.వినోద్ హితవు పలికారు.
ఇండియన్ ఎంబసీ అధికారుల సందర్శన
జోర్డాన్ దేశంలోని ఇండియన్ ఎంబసీ అధికారులు 'మిల్లీనియం అగ్రికల్చర్ ఇన్వెస్ట్‌మెంట్స్' అనే కంపెనీని ప్రత్యక్షంగా సందర్శించి, కార్మికుల పరిస్థితిని సమీక్షించారు. మొత్తం 170 మంది భారతీయ కార్మికులలో చాలా మంది సంతృప్తిగా ఉన్నా, తెలంగాణకు చెందిన 12 మంది మాత్రమే పని చేయడానికి నిరాకరించి, భారత్‌కు వాపస్ పంపించాలని కోరుతున్నారని ఎంబసీ తెలిపింది. ఈ విషయంలో జోర్డాన్ కార్మిక మంత్రిత్వ శాఖ స్పందన కోసం ఎదురుచూస్తున్నామని భారత రాయబార కార్యాలయ ప్రతినిధి తెలిపారు.
ఇండియన్ ఎంబసీ అధికారుల నివేదిక
జోర్డాన్ దేశంలో కంపెనీ ప్రత్యేకంగా భారతీయ వంటవాడిని నియమించడంతో ఆహార సమస్యలు తగ్గాయని ఇండియన్ ఎంబసీ అధికారులు తమ నివేదికలో తేలిపారు.జీతాలు ఫింగర్‌ప్రింట్ ధృవీకరణ ఆధారంగా చెల్లిస్తున్నారని వారు పేర్కొన్నారు. కార్మికుల నివాసం, వైద్యం, ఇతర సౌకర్యాలు ఒప్పంద ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నాయని ఎంబసీ అధికారుల పరిశీలనలో తేలింది.పని చేయకుంటే జీతాలు చెల్లించలేమని, ఒప్పందాన్ని ఉల్లంఘిస్తే కార్మికులు ఆర్థిక పరిహారం చెల్లించాల్సి ఉంటుందని కంపెనీ స్పష్టం చేసింది.ప్రస్తుతం ఈ 12 మంది కార్మికులు పనికి హాజరుకాకుండా రూముల్లో ఉన్నారని, ఇది ఒప్పంద ఉల్లంఘనగా పరిగణించే అవకాశం ఉందని ఎంబసీ అధికారులు తెలిపారు. ఈ పరిస్థితిలో ఇండియన్ కమ్యూనిటీ వెల్ఫేర్ ఫండ్(ఐసిడబ్ల్యూఎఫ్) కింద వీరు ప్రయోజనాలు పొందడం కష్టమని వారు పేర్కొన్నారు.
Next Story