బీఆర్ఎస్ భవనాలపైకి  జేసీబీలు ?
x
kcr

బీఆర్ఎస్ భవనాలపైకి జేసీబీలు ?

అధికారంలో ఉన్న పదేళ్ళల్లో బీఆర్ఎస్ నిర్మించుకున్న పార్టీ ఆఫీసులకు కాంగ్రెస్ ప్రభుత్వం నోటీసులను జారీచేస్తోంది.


అధికారంలో ఉన్నాం కాబట్టి ఏమిచేసినా చెల్లుబాటు అవుతుందని పార్టీలు అనుకుంటే ఖర్మకాలి ప్రతిపక్షంలోకి వచ్చినపుడు ఏమి జరుగుతుందో కాస్త ఆలోచించుకోవాలి. నిజంగానే అలా ఆలోచించే పార్టీలయితే అధికారంలో ఉన్నపుడు ఆకాశమే హద్దుగా చెలరేగిపోవన్నది వాస్తవం. ఇపుడు విషయం ఏమిటంటే అధికారంలో ఉన్న పదేళ్ళల్లో బీఆర్ఎస్ నిర్మించుకున్న పార్టీ ఆఫీసులకు కాంగ్రెస్ ప్రభుత్వం నోటీసులను జారీచేస్తోంది. ఇప్పటికే మూడు జిల్లాల్లోని పార్టీ ఆపీసుల నిర్మాణాలకు సంబంధించి భూకేటాయింపులు, భవనాల నిర్మాణాల వివరాలను ఇవ్వాలంటు నోటీసుల్లో ప్రభుత్వం స్పష్టంగా చెప్పింది.

అధికారంలో ఉన్నపుడు బీఆర్ఎస్ ప్రతీకార రాజకీయాలకు పాల్పడిన విషయం తెలిసిందే. దాని ఫలితమే ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత కారుపార్టీ పడుతున్న అవస్తలు. ఇందులో భాగంగానే జనగాం, నల్గొండ, హనుమకొండలో నిర్మించిన బీఆర్ఎస్ పార్టీ ఆఫీసులకు సంబంధించిన అన్నీ డాక్యుమెంట్లను తీసుకొచ్చి తమకు చూపించాలని మున్సిపల్, రెవిన్యు శాఖల ఉన్నతాధికారులు పార్టీ ఆఫీసులకు నోటీసులు జారీచేశారు. పార్టీ జిల్లాల అధ్యక్షులు, ఎంఎల్ఏలు, పార్టీ ఇన్చార్జిలు ఎవరు అందుబాటులో ఉంటే వారికి అధికారులు నోటీసులు పంపారు.

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే కేసీయార్ కూడా అధికారాన్ని అడ్డుపెట్టుకుని తనిష్టారాజ్యంగా ప్రభుత్వ స్ధలాలను పార్టీ ఆఫీసులకు కేటాయించేసుకున్నారు. కోట్ల రూపాయలు విలువైన ప్రభుత్వ భూములను పార్టీ సొంతమయ్యేట్లుగా నిర్ణయాలు తీసుకున్నారు. అప్పట్లో తీసుకున్న నిర్ణయాలే ఇపుడు వివాదాస్పదమయ్యాయి. ఎలాగంటే కేటాయించిన స్ధలం కాకుండా దానికి అదనంగా మరికొంత భూమిని కూడా ఆక్రమించేసి పార్టీ ఆఫీసు భవనాలను కట్టేసుకున్నారు. ఆక్రమించిన భూములే ఇపుడు వివాదాస్పదమయ్యాయి. జనగాం పార్టీ ఆఫీసునే తీసుకుంటే ప్రభుత్వం కేటాయించింది ఎకరా భూమి అయితే ఇపుడు పార్టీ ఆపీసు ఎకరా 20 గుంటల్లో ఉంది. కేటాయింపుకు అదనంగా 20 గుంటల భూమి ఎక్కడనుండి వచ్చింది ? ఎలా వచ్చిందంటే అధికారంలో ఉన్నపుడు తాము ఏమిచేసినా అడిగేవాళ్ళు లేరన్న పద్దతిలో తమిష్టం వచ్చినట్లుగా ప్రభుత్వ భూమిని ఆక్రమించేశారు. కోకాపేటలో అత్యంత ఖరీదైన ప్రభుత్వ భూమిలో 11 ఎకరాలను పార్టీ ఆఫీసు కోసం కేసీయార్ కేటాయించేసుకున్నారు. పార్టీ అధినేత హోదాలో ప్రభుత్వానికి ప్రతిపాదనలు తెప్పించుకుని ముఖ్యమంత్రి హోదాలో భూమిని కేటాయించేసుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దానికి బ్రేకులుపడ్డాయి. కోకాపేటలో ఎకరా రు. 100 కోట్లుంది.

భూఆక్రమణలకు కారణం ఏమిటంటే ఎప్పటికీ తామే అధికారంలో ఉంటామన్న థీమాయే. కాబట్టి ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. ఊహించని రీతిలో పార్టీ ఓడిపోయేటప్పటికి ఇపుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఆక్రమణల వ్యవహరాలన్నింటినీ తవ్వి బయటకు తీస్తోంది. ఇందులో భాగంగానే అప్పట్లే జనగాంలో పార్టీ ఆఫీసుకు ప్రభుత్వం కేటాయించిన ఉత్తర్వులను, పార్టీ ఆఫీసు నిర్మాణానికి సంబంధించిన ప్లాను డాక్యుమెంట్లను 15 రోజుల్లో సమర్పించాలని నోటీసులు జారీచేసినట్లు జనగాం కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ చెప్పారు. హనుమకొండ పార్టీ ఆపీసుకు సంబంధించి కూడా ప్రభుత్వం కేటాయించిన భూ వివరాల డాక్యుమెంట్లను సమర్పించాలని రెవిన్యు అధికారులు నోటీసులిచ్చారు. నల్గొండ పార్టీ ఆఫీసు నిర్మాణాలకు సంబంధించి కూడా భూ కేటాయింపు, భవన నిర్మాణానికి సంబందించిన ప్లానులను సమర్పించాలని అధికారులు నోటీసులిచ్చారు. ఎలాగూ ప్లన్లకు తగ్గట్లే భవనాల నిర్మాణాలుండవు. అలాగే కేటాయింపులకు మించిన స్ధలంలోనే ఆఫీసుల నిర్మాణాలు జరిపోయాయని అధికారులు ఇప్పటికే గుర్తించారు. కాబట్టి తొందరలోనే అక్రమ నిర్మాణాల పేరుతో పార్టీ ఆఫీసులపైకి ప్రభుత్వం జేసీబీలను పంపటం ఖాయమని అర్ధమవుతోంది. కాకపోతే ఎప్పుడన్నదే సస్పెన్స్.

Read More
Next Story