హైదరాబాద్ ట్రాఫిక్ గార్డులుగా ట్రాన్స్ జెండర్లు
x
Transgenders in Hyderabad

హైదరాబాద్ ట్రాఫిక్ గార్డులుగా ట్రాన్స్ జెండర్లు

ట్రాన్స్ జెండర్ల సేవలను ట్రాఫిక్ నియంత్రణ రూపంలో ఉపయోగించుకోవాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం తాజాగా డిసైడ్ అయ్యింది.


పరిస్ధితులన్నీ అనుకూలిస్తే తొందరలోనే ట్రాన్స్ జెండర్ల సేవలను హైదరాబాద్ నగర జనాలు అందుకోవచ్చు. ట్రాన్స్ జెండర్ల సేవలను ట్రాఫిక్ నియంత్రణ రూపంలో ఉపయోగించుకోవాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం తాజాగా డిసైడ్ అయ్యింది. నగరంలోని ట్రాన్స్ జెండర్లను పోలీసుశాఖ పరిధిలోకి తీసుకుని వీరికి శిక్షణ ఇప్పించి ట్రాఫిక్ నియంత్రణకు ఉపయోగించుకోవాలని రేవంత్ ఆదేశించారు. మున్సిపల్ వ్యవహారాలు, ఫుట్ పాతుల ఆక్రమణలు, ట్రాపిక్ సమస్యలకు పరిష్కారం అనే అంశాలపై రేవంత్ శుక్రవారం రాత్రి ఉన్నతాధికారులతో సమీక్ష చేశారు. ఈ సందర్భంగానే ట్రాఫిక్ నియంత్రణలో ట్రాన్స్ జెండర్ల సేవలను ఉపయోగించుకునేట్లుగా రేవంత్ ఆదేశించారు.



ఇపుడు ట్రాఫిక్ నియంత్రణలో ట్రాఫిక్ పోలీసులు, హోంగార్డులు సేవలందిస్తున్నారు. అయితే వీరిపై విపరీతమైన ఒత్తిడి పెరిగిపోతోంది. హైదరాబాద్ నగరంలో పెరిగిపోతున్న ట్రాఫిక్ ను నియంత్రించటం ట్రాపిక్ పోలీసులు, హోంగార్డుల వల్ల సాధ్యంకావటంలేదు. ఎందుకంటే నగరమేమో విపరీతంగా విస్తరిస్తోంది. విస్తరిస్తున్న నగరానికి తగ్గట్లుగా పోలీసు శాఖలో నియామకాలు జరగటంలేదు. అందుకనే ఉన్న సిబ్బందినే ఉన్నతాధికారులు ట్రాఫిక్ నియంత్రణకు ఉపయోగించుకుంటున్నారు. ట్రాఫిక్ పోలీసులకు అదనంగా హోంగార్డులను జతచేసినా పెద్దగా ఉపయోగం కనబడటంలేదు. అందుకనే ట్రాన్స్ జెండర్ల సేవలను ఉపయోగించుకోవాలని రేవంత్ ఆదేశించింది.



ప్రతి ట్రాఫిక్ కూడలి దగ్గర జనాలు ట్రాన్స్ జెండర్లను చూస్తునే ఉంటారు. ట్రాఫిక్స్ సిగ్నల్ దగ్గర వాహనాలు ఆగినపుడు ట్రాన్స్ జెండర్ల తాకిడి జనాలందరికీ అనుభవమే. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ తో పాటు నెక్లెస్ రోడ్డులో రాత్రిళ్ళు ట్రాన్స్ జెండర్లు దాడులు జరిపి డబ్బులు గుంజుకున్న ఘటనలు కూడా చాలా ఉన్నాయి. వీళ్ళ ఆగడాలను కంట్రోల్ చేయటానికి పోలీసులు పై ప్రాంతాల్లో ప్రత్యేక డ్రైవులు నిర్వహించిన సందర్భాలు కూడా ఉన్నాయి. ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారం నగరంలో సుమారుగా 5 వేలమంది ట్రాన్స్ జెండర్లున్నారు. వీరందరితో తొందరలోనే పోలీసు ఉన్నతాధికారులు సమావేశం అవబోతున్నారు. ప్రభుత్వ నిర్ణయాన్ని వీరికి వివరించి గౌరవప్రదమైన వేతనంతో ట్రాఫిక్ నియంత్రణలో సహకారం అందించాలని విజ్ఞప్తి చేయబోతున్నారు. ఆసక్తి ఉన్నవారిని వెంటనే చేర్చుకుని అవసరమైన శిక్షణ ఇవ్వాలని కూడా ఉన్నతాధికారులు డిసైడ్ అయ్యారు.



ట్రాఫిక్ నియంత్రణ విధుల్లో చేరితే ట్రాన్స్ జెండర్ల వల్ల సిగ్నల్ పాయింట్ల దగ్గర జనాలకు సమస్యలు తగ్గుతాయి. ట్రాన్స్ జెండర్లకు గౌరవప్రదమైన బాధ్యతలతో పాటు వేతనం కూడా అందుతుంది. వీళ్ళకోసం ప్రత్యేకమైన యూనిఫారమ్ ను కూడా డిజైన్ చేయాలని రేవంత్ ఇప్పటికే ఆదేశించారు. ట్రాన్స్ జెండర్లను పోలీసు శాఖలో ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు ఉపయోగించుకుంటున్నాయి. వీరి సేవలను ఉపయోగించుకున్న మొదటి రాష్ట్రం తమిళనాడు. దివంగత ముఖ్యమంత్రి జయలలిత హయాంలో మొట్టమొదటిసారి ట్రాన్స్ జెండర్లు పోలీసు శాఖలో అపాయింటయ్యారు. తమిళనాడు విధానాన్ని తర్వాత కర్నాటక, కేరళ, ఛత్తీస్ ఘడ్, బీహార్ కూడా అనుసరించాయి. ఈ రాష్ట్రాల సరసన తొందరలో తెలంగాణా కూడా చేరబోతోంది.



తమిళనాడులో ట్రాన్స్ జెండర్లు ఎస్ఐలుగా పూర్తిస్ధాయిలో విధులు నిర్వర్తిస్తున్నారు. ప్రితికా యాష్నీ మొదటి ట్రాన్స్ జెండర్ ఎస్ఐ. పాట్నాలో కూడా ట్రాన్స్ జెండర్ మాన్వీ మధు కశ్యా ఎస్ ఐ పనిచేస్తున్నారు. కర్నాటక, కేరళ, ఛత్తీస్ ఘడ్ లో కానిస్టేబుల్ స్ధాయిలో పూర్తిస్ధాయిలో ఉద్యోగాలు చేస్తున్నారు. తెలంగాణాలో మాత్రం ప్రయోగాత్మకంగా ట్రాఫిక్ నియంత్రణలో వీళ్ళ సేవలను ఉపయోగించుకోవాలని డిసైడ్ అయ్యింది.



ఒకవేళ ఈ ప్రయోగం సక్సెస్ అయితే పోలీసుశాఖలో పూర్తిస్ధాయిలో ఉద్యోగాల్లోకి ప్రభుత్వం తీసుకుంటుందేమో. ట్రాఫిక్ నియంత్రణలో వీళ్ళ సేవలను ఉపయోగించుకోవటంతో పాటు ప్రతిజిల్లాలో ప్రత్యేక వైద్యసేవలను కూడా అందించాలని ప్రభుత్వం డిసైడ్ అయ్యింది. ప్రతి జిల్లాలోను ట్రాన్స్ జెండర్లకు ప్రత్యేకమైన విభాగాన్ని ఏర్పాటుచేయాలని రేవంత్ ఆదేశించారు. ఇప్పటికే హైదరాబాద్ లోని ఉస్మానియా ఆసుపత్రిలో ట్రాన్స్ జెండర్లకు ప్రత్యేకమైన విభాగముంది. ఈ పద్దతిలోనే ప్రతి జిల్లాలోను ఏర్పాటుచేసి సేవలందించేందుకు ప్రత్యేకమైన సిబ్బందిని కూడా ప్రభుత్వం ఏర్పాటు చేయబోతోంది.

Read More
Next Story