Deputy CM Bhatti Vikramarka
x

రాజీవ్ యువ వికాసానికి రూ.9వేల కోట్లు

నిరుద్యోగ యువత వారి కాళ్లపై వారు నిలబడాలన్న ఆశయంతో ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ఈ పథకాన్ని తీసుకొస్తున్నామని భట్టి చెప్పారు.


తెలంగాణ ప్రభుత్వం మరో పథకాన్ని ప్రారంభించడానికి సన్నద్ధమవుతోంది. అదే రాజీవ్ యువ వికాసం. ఈ పథకాన్ని కాంగ్రెస్ సర్కార్ ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది. ఈ కార్యక్రమాన్ని అధికారులు విజయవంతం చేయాలని, ఎటువంటి అవకతవకలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సూచించారు. సోమవారం సాయంత్రం ప్రజా భవన్‌లో చీఫ్ సెక్రటరీ, సెక్రటరీలు, జిల్లా కలెక్టర్లతో భట్టి విక్రమార్క వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు. అందులో రాజీవ్ యువ వికాసం పథకంపై అధికారులకు కీలక సూచనలు చేశారు. నిరుద్యోగ యువత వారి కాళ్లపై వారు నిలబడాలన్న మహోన్నత ఆశయంతో ఈ పథకాన్ని తీసుకొస్తున్నామని చెప్పారు. రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా నిరుద్యోగులను దృష్టిలో పెట్టుకుని ఈ పథకానికి సుమారు రూ.9వేల కోట్లు ఖర్చు చేయాలని నిశ్చయించుకున్నట్లు ఆయన చెప్పారు. ఈ నేపథ్యంలో అధికారులు అంతా మనసుపెట్టి పనిచేయాలని కోరారు. నిరుద్యోగులకు సేవ చేసే భాగ్యం ఈ పథకం ద్వారా అధికారులకు కలుగుతుందని డిప్యూటీ సీఎం సూచించారు.

దశాబ్ద కాలంగా నిరుద్యోగ యువతపై ఇంత పెద్ద మొత్తంలో ఎప్పుడూ నిధులు ఖర్చు చేయలేదన్నారు. ‘‘ప్రత్యేక రాష్ట్రం తెచ్చుకునేందుకు యువత కష్టపడ్డారు. చిన్న పొరపాటు వచ్చిన అధికారులు వెంటనే సమస్య పరిష్కారానికి కృషి చేయాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. రేవంత్ రెడ్డి, నేను ఈ పథకం ప్రగతిపై నిరంతరం సమీక్షిస్తాం. ఎస్సీ, బీసీ, ఎస్టీ, మైనారిటీ, ఈడబ్ల్యూఎస్ అన్ని వర్గాల గురించి ఆలోచించి మొదటిసారి చేస్తున్న స్వయం ఉపాధి పథకం ఇది. గతంలో మంజూరు అయినా చివరి వరకు నిధులు విడుదల చేయలేదు. దరఖాస్తుదారులు ఎంపీడీఓ కార్యాలయాలు, మునిసిపాలిటీలో నేరుగా ధరఖాస్తు చేసుకునేలా అవగాహన కల్పించాలి’’ అని తెలిపారు.

‘‘మంత్రులు జిల్లాలకు వచ్చినప్పుడు పథకానికి సంబంధించిన ప్రగతి సమాచారం అందించి వారి నుంచి సలహాలు తీసుకోవాలి. ఎమ్మెల్యేలకు పథకానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని అందించాలి. వరుస సెలవుల నేపథ్యంలో ఏప్రిల్ 14 వరకు దరఖాస్తు గడువు పెంచాలి. జూన్ 2న అర్హులకు శాంక్షన్ లెటర్లు ఇవ్వాలి. దరఖాస్తుల స్వీకరణ మొదలు గ్రౌండింగ్ వరకు నిరుద్యోగ యువత ఇబ్బందులు ఎదుర్కోకుండా ఎప్పటికప్పుడు సమస్యలు పరిష్కరించేందుకు ప్రతి జిల్లాలో ఒక యువ అధికారిని నియమించాలి’’ అని డిప్యూటీ సీఎం ఆదేశించారు.

Read More
Next Story