‘రేవంత్ డబ్బా ప్రచారం మానుకో’.. హరీష్ రావు హితవు
సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి హరీష్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు.
సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి హరీష్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం డబ్బా కొట్టుకోవడం మానుకోవాలంటూ చురకలంటించారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి డబ్బా కొట్టుకోవడం తప్ప రేవంత్ చేసిందేమీ లేదన్నట్లు ఎద్దేవా చేశారు. విదేశాలకు వెళ్లి వేల కోట్ల రూపాయల పెట్టుబడులు తెస్తున్నట్లు చెప్తున్నారే తప్ప ఒక్క పెట్టుబడిదారు కూడా తెలంగాణలో పెట్టుబడులు పెట్టింది లేదన్నారు. రేవంత్ రెచ్చిన ఒప్పందాలు ఏమయ్యాయని ప్రశ్నించారు. కాంగ్రెస్ పాలనలో జీతాలు అందక ఉద్యోగులు రోడ్డెక్కుతున్న పరిస్థితులు నెలకొన్నాయన్నారు. ఒకటో తేదీనే జీతాలు ఇస్తామని గప్పాలు చెప్పిన మీకు చిరుద్యోగుల కష్టాలు కనిపించడం లేదని ఎద్దేవా చేశారు.
‘‘ఇచ్చిన హామీలు అమలు చేసామని ఢిల్లీకి వెళ్లి అబద్దాలు ప్రచారం చేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారూ.. మీ పాలనలో వేతనాలు అందక ఉద్యోగులు రోడ్డెక్కుతున్న దుస్థితి. ఒకటో తేదీనే వేతనాలు చెల్లిస్తామని అధికారంలోకి వచ్చిన మీకు చిరు ఉద్యోగుల కష్టాలు కనిపించకపోవడం దురదృష్టకరం. నాలుగు నెలలుగా పంచాయతీ కార్మికులు, మూడు నెలలుగా MGNREGS ఉద్యోగులు, నెల గడిచినా మున్సిపాలిటీ పారిశుద్ధ్య కార్మికులు వేతనాలు అందక వెతలు పడుతున్నారు. MGNREGS లో ఫీల్డ్ అసిస్టెంట్లు, టెక్నికల్ అసిస్టెంట్, ఏపీఓలు ఇలా వేల మంది చిరు ఉద్యోగులు జీతాలు ఇవ్వాలని ప్రభుత్వానికి దరఖాస్తులు పెట్టుకున్న దయనీయ పరిస్థితి’’ ఉందని గుర్తు చేశారు.
‘‘దాదాపు అన్ని జిల్లాల్లో ఇదే పరిస్థితి ఉన్నప్పటికీ ప్రభుత్వం పట్టించుకోకపోవడం దుర్మార్గం. నెలలు గడిచినా వేతనాలు రాకపోవడంతో కుటుంబ పోషణ భారమై, అప్పుల పాలవుతున్నారు. కండ్లు కాయలు కేసులా జీతాల కోసం ఎదురుచూస్తున్నారు. కుర్చీ కాపాడుకోవడం కోసం ఢిల్లీకి చక్కర్లు కొట్టడం, విదేశాలకు వెళ్లి వేల కోట్ల పెట్టుబడులు తెస్తున్నామనే డబ్బా ప్రచారం చేసుకోవడం మానేసి పాలనపై దృష్టి సారించాలని సూచిస్తున్నాం. ఇప్పటికైనా చిరు ఉద్యోగులందరికీ సకాలంలో వేతనాలు చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం’’ అని వెల్లడించారు.