వ్యవసాయానికి ప్రత్యేక బడ్జెట్ పెట్టాలి
x

వ్యవసాయానికి ప్రత్యేక బడ్జెట్ పెట్టాలి

ఎన్నికల్లో రైతులకు ఇచ్చిన హామీ విస్మరించరాదు


మార్చి 19 న తెలంగాణ అసెంబ్లీలో 2025-2026 సంవత్సరానికి బడ్జెట్ ప్రవేశ పెట్టబోతున్నారు. బడ్జెట్ తయారీ ప్రక్రియ ఎప్పుడో మూడు నెలల క్రితమే ప్రారంభమవుతుంది, కానీ, గత సంవత్సర బడ్జెట్ కేటాయింపుల లో నిధులు ఖర్చు చేసిన తీరు ఎలా ఉందో చూస్తే, ఈ సంవత్సరానికి బడ్జెట్ కేటాయింపులు ఎలా ఉండాలో అడగడానికి ప్రజలకు, ప్రజా సంఘాలకు వీలవుతుంది. కానీ గత సంవత్సరం బడ్జెట్ ఖర్చయిన తీరు ప్రభుత్వానికి మాత్రమే తెలుస్తుంది. గత సంవత్సరానికి సంబంధించిన పూర్తి లెక్కలు వచ్చే సంవత్సరం మాత్రమే ప్రజలకు అందుబాటులోకి వస్తాయి.

ఈ నేపథ్యంలో ఎన్నికల సందర్భంగా అధికార పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలకు ఈ బడ్జెట్ లో కేటాయింపులు తప్పకుండా చేయాలని అడగడం తప్ప మనం చేయగలిగింది ఏమీ లేదు. ప్రజలకు హామీలు ఇవ్వడంలో రాజకీయ పార్టీలకు ఎన్నికల సమయంలో ఉండే ఉత్సాహం అధికారంలోకి వచ్చాక ఉండదు. బడ్జెట్ కేటాయింపులు లేకుండా ఏ హామీ అమలు కాదు. అందువల్ల ప్రభుత్వం తగిన ప్రాధాన్యతలు నిర్ణయించుకుని కేటాయింపులు చేయాలని మనం అడుగుతాం.

ఈ ప్రాధాన్యతలు నిర్ణయించుకునేటప్పుడు సమాజంలో తీవ్ర వివక్షకు గురయ్యే వారికి, నిస్సహాయులకు, బలహీన వర్గాలకు మొదటి ప్రాధాన్యత దక్కాలి. వృద్ధులు, వికలాంగులు, దీర్ఘకాలిక అనారోగ్య పీడితులు, వితంతువులు, ఒంటరి మహిళలు, ట్రాన్స్ జండర్స్, బాలలకు మొదటి ప్రాధాన్యత దక్కాలి. కేజీ నుండీ పీజీ వరకూ విద్యార్థులందరికీ (మహిళల, వికలాంగుల, స్పెషల్ చిల్డ్రన్ ప్రత్యేక అవసరాలను కూడా దృష్టిలో ఉంచుకుని) ఉచిత విద్య అందించేందుకు, వైద్య పరీక్షల నుండీ అన్ని రకాల జబ్బులకు ఉచితంగా అధునిక వైద్యం అందించే వరకూ కావలసిన నిధులకు రెండవ ప్రాధాన్యత దక్కాలి.

ప్రత్యేక చట్టాల ద్వారా హామీ పడిన, లేదా ఎన్నికల్లో ప్రత్యేక హామీలు ఇచ్చిన వర్గాలకు,ముఖ్యంగా సామాజికంగా వెనుకబడిన వర్గాలకు మూడవ ప్రాధాన్యత దక్కాలి. ఎస్. సి సబ్ ప్లాన్, ఎస్. టి సబ్ ప్లాన్ , బీసీ సబ్ ప్లాన్, ముస్లిం సబ్ ప్లాన్ ఇందులోకి వస్తాయి. ఇప్పటికీ, పురుషాధిక్య భావజాలం కారణంగా వివక్షకు గురవుతున్న, సమాజంలో సగ భాగంగా ఉన్న మహిళల సంపూర్ణ అభివృద్ధికి ( కేవలం పెన్షన్ లు మాత్రమే కాదు, ఆదాయాన్ని పొందే జీవనోపాధి అవకాశాలు పెంచడం) బడ్జెట్ లో నిధుల కేటాయింపుకు నాలగవ ప్రాధాన్యత దక్కాలి.

సమాజంలో ఎక్కువమందికి జీవనోపాధి వనరుగా ఉన్న రంగాలకు తర్వాత ప్రాధాన్యత దక్కాలి. వ్యవసాయం, పశు పోషణ , అసంఘటిత కార్మిక రంగం ఈ కోవలోకి వస్తాయి. వ్యవసాయ రంగానికి ప్రత్యేక బడ్జెట్ ప్రవేశ పెడతామని కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా హామీ ఇచ్చింది. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక, గత సంవత్సరం మొదటి బడ్జెట్ లో ఆ పని చేయలేక పోయింది. ఈ సారైనా అందుకు పూనుకోవాలి.

గతంతో పోల్చినప్పుడు, సాపేక్షికంగా వ్యవసాయ రంగానికి బడ్జెట్ కేటాయింపులు పెరిగాయి. కానీ పెరిగిన కేటాయింపులలో కనీసం 30 - 40 శాతం నిధులు దుర్వినియోగం అవుతున్నాయి. భూమిపై పట్టా హక్కులు కలిగి ఉండటం తప్ప, స్వయంగా వ్యవసాయం చేయని భూ యజమానులకు కూడా రెండు లక్షల వరకు రుణ మాఫీ చేయడం, ఎకరానికి 12,000 రూపాయల రైతు భరోసా చెల్లించడం లాంటి రూపాలలో ఈ నిధుల దుర్వినియోగం జరుగుతున్నది. ఒక ఎకరం లోపు భూ యజమానులకు, వ్యవసాయ కూలీలకు, కౌలు రైతులకు, పోడు రైతులకు, సన్న,చిన్నకారు రైతులకు ఈ నిధుల కేటాయింపులో ఎక్కువ న్యాయం జరగడం లేదు.

నిజంగా వ్యవసాయ రంగ సంక్షోభం లో ఎక్కువ నష్ట పోతున్నది ఈ సెక్షన్ ల ప్రజలే. వ్యవసాయం చేయని భూ యాజమనులను ఒప్పించుకుని, వ్యవసాయ రంగంలో అర్హులకు మాత్రమే బడ్జెట్ లో కేటాయించిన నిధులలో వాటా దక్కేలా రాష్ట్ర ప్రభుత్వం రాజకీయంగా ధైర్యంగా నిర్ణయం తీసుకుని ఉండాల్సింది. ఈ బడ్జెట్ ప్రవేశ పెట్టే నాటికయినా, ప్రభుత్వం అటువంటి నిర్ణయం తీసుకుంటే తప్ప, నిజమైన వ్యవసాయ కుటుంబాలకు న్యాయం జరగదు. లేదా వచ్చే ఆర్థిక సంవత్సరంలో కూడా నిధుల దుర్వినియోగమే కొనసాగుతుంది.

వాతావరణంలో వచ్చిన మార్పుల వల్ల ప్రకృతి వైపరీత్యాలు పెరుగుతున్నాయి. అదే సమయంలో సుస్థిరం కాని రసాయన వ్యవసాయం వల్ల, రైతులకు ఖర్చులు పెరుగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో రైతులను ఆదుకోవాలంటే సమగ్ర పంటల బీమా పథకం అమలు అవసరం.ఇందుకోసం బడ్జెట్ లో నిధులు తప్పకుండా కేటాయించాలి. ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా రైతుల నుండీ బీమా ప్రీమియం వసూలు చేయకుండా, ప్రభుత్వమే చెల్లించేందుకు వీలుగా, బడ్జెట్ కేటాయింపులు తగినన్ని ఉండాలి. ఈ పంటల బీమా పరిహారం, నిజంగా పంటలు సాగు చేసిన రైతులకు అందేలా చర్యలు చేపట్టాలి.

అనుకోకుండా వచ్చే ప్రకృతి వైపరిత్యాల వల్ల పంటలను నష్టపోయిన రైతులను ఆదుకోవడానికి, కేంద్ర నిధులు వచ్చే వరకూ ఎదురు చూడకుండా, రాష్ట్ర బడ్జెట్ లో తగిన నిధులను కేటాయించుకోవాలి. వైపరీత్యం జరిగిన వెంటనే జిల్లా కలెక్టర్ ల నుండీ తగిన నివేదికను తెప్పించుకుని, పంట నష్ట పరిహారం ఎకరానికి 10,000 అందించాలి. ముఖ్యంగా సాగు చేయని భూ యజమానులకు కాకుండా, సాగు చేసి నష్టపోయిన కౌలు రైతులకు ఈ సహాయం అందించేలా, నిబంధనలు రాయాలి.

సుస్థిర వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహించేందుకు, సేంద్రియ వ్యవసాయ పద్ధతుల ప్రోత్సాహానికి వీలుగా ఒక విధానం రూపొందించుకుని బడ్జెట్ లో తగినన్ని నిధులు కేటాయించాలి. చాలా ఎక్కువ రసాయనాలు వాడే మిరప, వరి, కూరగాయలు, పండ్ల ఉత్పత్తిలో ముందుగా ఈ సేంద్రియ పద్ధతులను ప్రోత్సహించాలి. ప్రతి సంవత్సరం కనీసం 20 శాతం రైతులను రసాయన వ్యవసాయం నుండీ సేంద్రియ వ్యవసాయం వైపు మళ్లించడం లక్ష్యంగా పెట్టుకుని ఈ నిధుల కేటాయింపు ఉండాలి. ఈ పంటలలో కూడా తొలి దశలో రసాయన ఎరువుల కంటే, పురుగు విషాల వినియోగం తగ్గించడానికి దృష్టి సారించి పని చేయాలి. రాష్ట్రంలో కోళ్ళ దాణా కు అవసరమైన మేరకు మొక్క జొన్నలో, ఇతర పప్పు ధాన్యాలు, నూనె గింజలు, చిరుధాన్యాలు, పసుపులో కూడా పురుగు విషాల వినియోగం తగ్గించడం పై దృష్టి పెట్టి ప్రచారం చేయాలి.

భూమిపై పట్టా హక్కులు కలిగిన రైతులకు ఇప్పటి వరకూ రైతు బీమా పథకం అమలవుతుంది. భూమి లేని కౌలు రైతులకు, వ్యవసాయ కూలీలకు కూడా ఈ పథకాన్ని వర్తింప చేస్తామని అభయహస్తం మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు. కానీ మొదటి సంవత్సరం బడ్జెట్ లో ఇందుకు నిధులు కేటాయించలేదు. అమలు చేయలేదు. ఈ సంవత్సరం బడ్జెట్ లో ఇందుకోసం నిధులు కేటాయించాలి. LIC ద్వారా కాకపోయినా, ప్రభుత్వం స్వయంగా, నేరుగా వ్యవసాయ శాఖ ద్వారా ఈ పథకాన్ని అమలు చేయవచ్చు. సహజ మరణంతో పాటు, గ్రామీణ ప్రాంతంలో జరిగే అన్ని రకాల మరణాలకు డెత్ సర్టిఫికెట్ ఆధారంగా ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేయాలి. ఈ పథకాన్ని పట్టణాలలో, నగరాలలో కూడా తెల్ల రేషన్ కార్డు కలిగిన పేద కుటుంబాలకు వర్తింప చేయడానికి నిధులు కేటాయించాలి.

మూడు లక్షల రూపాయల వరకూ వడ్డీ లేని పంట రుణాలు అందిస్తామని మానిఫెస్టోలో హామీ ఇచ్చారు. ఇందుకు అనుగుణంగా బడ్జెట్ లో నిధులు కేటాయించాలి. ఐదేకరాల లోపు రైతులకు , ముఖ్యంగా వాస్తవంగా సాగు చేసే కౌలు రైతులకు బ్యాంకుల నుండీ పంట రుణాలు అందకుండా, అందుకు తగిన చర్యలు చేపట్టకుండా, ఈ పథకాన్ని అమలు చేయడం నిధుల దుర్వినియోగం చేయడమే. ఇప్పటి వరకూ బ్యాంకులు వ్యవసాయం చేసినా, చేయకపోయినా, భూ యజమానులకు పంట రుణాలు ఇస్తున్నాయి. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి, 16 నెలలు గడుస్తున్నా, కౌలు రైతులను గుర్తించే ప్రక్రియను ఈ ప్రభుత్వం కూడా గత సంవత్సర కాలంగా చేపట్టలేదు . ఈ ప్రక్రియ చేపట్టకుండా చేసే బడ్జెట్ నుండీ రూపాయి ఖర్చు పెట్టినా వృధాయే

మండలానికి ఒక మార్కెట్ యార్డ్ ఏర్పాటు చేస్తామని, మండల స్థాయిలో వ్యవసాయ యాంత్రీకరణ కేంద్రాలను ఏర్పాటు చేస్తామని మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేయడానికి వీలుగా బడ్జెట్ లో తగినన్ని నిధులను కేటాయించాలి. ఈ మార్కెట్ యార్డుల నిర్వహణ, వ్యవసాయ యాంత్రీకరణ కేంద్రాల నిర్వహణ స్థానికంగా మండల స్థాయిలో ఉండే రైతు ఉత్పత్తిదారుల కంపెనీలకు, రైతు సహకార సంఘాలకు, మహిళా సంఘాలకు ఉమ్మడిగా అప్పగించాలి. వ్యవసాయ మార్కెటింగ్ శాఖను ఇందుకు సమన్వయ కర్తగా పెట్టాలి.

మండల స్థాయి లోనే ఆయా వ్యవసాయ ఉత్పత్తుల నిల్వకు, ప్రాసెసింగ్ కు ఈ సంఘాల ఆధ్వర్యంలో నిల్వ , ప్రాసెసింగ్ సెంటర్ లను ఏర్పాటు చేయడానికి వీలుగా, బడ్జెట్ లో నిధులు కేటాయించాలి. ఉద్యాన ఉత్పత్తులను ( కూరగాయాలు, పండ్లు) , పశు సంపద నుండీ వచ్చే ఉత్పత్తులను ( పాలు, చేపలు, గుడ్లు, మాంసం) మార్కెట్ చేయడానికి వీలుగా, కోల్డ్ చైన్ కూడా ( సోలార్ బేస్డ్ శీతల వాహనాలు , కోల్డ్ స్టోరేజ్ లు) మండల స్థాయిలో ఏర్పాటు చేయాలి.

పాల ఉత్పత్తిలో, మార్కెటింగ్‌లో అమూల్ లాంటి గుజరాత్ పాల సహకార సంఘాలను కాకుండా స్థానిక, రాష్ట్ర స్థాయి పాల రైతుల సహకార సంఘాలను ప్రోత్సహించాలి. ఆయా సంఘాలతో ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి, వారి ప్రత్యేక అవసరాలు కనుక్కుని బడ్జెట్ లో నిధులు కేటాయించి ప్రోత్సాహం అందించాలి.

రాష్ట్రంలో పప్పు ధాన్యాలు, నూనె గింజలు, చిరు ధాన్యాల ఉత్పత్తిని పెంచడానికి బడ్జెట్ లో ప్రత్యేక నిధుల కేటాయింపు చేయాలి. రైతులు పండించే ఈ పంటలను నేరుగా మార్క్ ఫెడ్ ద్వారా ప్రభుత్వం కొనుగోలు చేయాలి, రైతు సహకార సంఘాలను, FPO లను ఈ ప్రక్రియలో భాగస్వాములను చేయాలి. రైతు, మహిళా సంఘాల ఆధ్వర్యంలో వాటిని ప్రాసెసింగ్ చేయించి, ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా, రైతు బజార్ ల ద్వారా తక్కువ ధరలకు వినియోగదారులకు అందుబాటులోకి తేవాలి.

Read More
Next Story